వారి సంభాషణలు రికార్డు చేయలేదు : రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్ స్పోర్ట్స్

by Harish |
వారి సంభాషణలు రికార్డు చేయలేదు : రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్ స్పోర్ట్స్
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్‌ స్టార్ స్పోర్ట్స్ తన ప్రైవసీకి భంగం కలిగించేలా వ్యవహరించిందని ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆరోపించిన విషయం తెలిసిందే. తన మాటలను రికార్డు చేయొద్దని కోరినా, ఆ వీడియోను ప్రసారం చేసిందని రోహిత్ ట్వీట్ చేయగా.. అది చర్చకు దారితీసింది. దీనిపై స్టార్ స్పోర్ట్స్ సోమవారం స్పందించింది. రోహిత్‌ మాటలను తాము రికార్డు లేదా ప్రసారం చేయలేదని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

‘మే 16న వాంఖడే స్టేడియంలో జరిగిన ట్రైనింగ్ సెషన్‌‌‌కు సంబంధించిన క్లిప్ తీయడానికి స్టార్ స్పోర్ట్స్‌కు అనుమతి ఉంది. స్నేహితుడితో సీనియర్ ప్లేయర్ మాట్లాడుతున్న వీడియోను ప్లే చేశాం. ఆ సంభాషణను మేము రికార్డుగానీ, ప్రసారంగానీ చేయలేదు. తమ ఆడియోను రికార్డు చేయొద్దని అతను కోరిన వీడియోను మాత్రమే స్టార్ స్పోర్ట్స్ ప్రీ మ్యాచ్ లైవ్ కవరేజీలో చూపించాం.’ అని స్టార్ స్పోర్ట్స్ తెలిపింది. ఆటగాళ్ల ప్రైవసీకి కట్టుబడి ఉన్నామని పేర్కొంది. కాగా, కోల్‌కతా అసిస్టెంట్‌ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌తో రోహిత్‌ మాట్లాడిన ఓ వీడియో కేకేఆర్ జట్టు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అయితే, కాసేపటికే ఆ పోస్టును డిలీజ్ చేసింది. ఆ వీడియోలో రోహిత్ ముంబై ఇండియన్స్ జట్టుతో తన భవితవ్యం గురించి మాట్లాడినట్టు సమాచారం.

Advertisement

Next Story