Kishan Reddy : జమిలీ ఎన్నికలతో రాష్ట్ర సమస్యలకు ప్రాధాన్యత: కిషన్ రెడ్డి

by Prasad Jukanti |
Kishan Reddy : జమిలీ ఎన్నికలతో రాష్ట్ర సమస్యలకు ప్రాధాన్యత: కిషన్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహణ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయడం స్వాగతించదగిన పరిణామం అని కేంద్ర మంత్రి, స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా ఐదేళ్లపాటు ఏదో ఒకచోట ఎన్నికలు జరుగుతున్నందున ఎన్నికల కోడ్ అమల్లో ఉంటోందని దీని వల్ల విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేక ప్రభుత్వ నిర్ణయాలకు ఆటంకంగా ఉందన్నారు. జమిలీ ఎన్నికలపై స్పందిస్తూ గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పార్లమెంట్ కు రాష్ట్ర అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికల నిర్వహణ కారణంగా అవుతున్న ఖర్చు రూ. 4,500 కోట్ల పైమాటే నని జమిలీతో ఈ ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. దేశంలో చాలా ప్రాంతాల్లో ప్రాంతీయ పార్టీల ప్రభావం స్పష్టంగా ఉందన్న కిషన్ రెడ్డి.. పార్లమెంటు ఎన్నికల సమయంలో కేవలం జాతీయ సమస్యలపైనే చర్చ జరుగుతున్న మాట వాస్తవం అని, అందుకే.. జమిలీ ఎన్నికల ద్వారా జాతీయ అంశాలతోపాటు ప్రాంతీయ సమస్యలపైనా సమాన స్థాయిలో చర్చ జరుగుతుందన్నారు. ప్రాంతీయ పార్టీల ప్రభావం కూడా కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.

జమిలీతో ద్రవోల్బణం తగ్గుదల:

2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ప్రధాన అడ్డంకిగా ఉన్న అసెంబ్లీలు, పార్లమెంటుకు జరుగుతున్న ఎన్నికలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. వేర్వేరుగా ఎన్నికల కారణంగా ఓటర్లలో ఎన్నికల ప్రక్రియ పట్ల నిరాసక్తత పెరిగి ఓటింగ్ శాతం తగ్గడం స్పష్టంగా కనబడుతోందని దీనికి జమిలీ ఎన్నికలు ఓ పరిష్కారాన్ని చూపుతాయని భావిస్తున్నట్లు చెప్పారు. జమిలీ ఎన్నికల కారణంగా దేశంలో ద్రవ్యోల్బణంలో 1.1% తగ్గి, డీజీపీలో 1.5 శాతం పెరుగుదల ఉంటుందని రామ్ నాథ్ కోవింద్ కమిటీ పేర్కొందన్నారు. ఇలాంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని జమిలీ ఎన్నికల అవసరాన్ని గుర్తిస్తూ ఈ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందన్నారు.

వ్యతిరేకిస్తున్న పార్టీలో త్వరలోనే సహకరిస్తాయి:

జమిలీ ఎన్నికల అంశంపై రామ్ నాథ్ కమిటీ దాదాపు 47 పార్టీల అభిప్రాయాలను సేకరిస్తే అందులో 32 పార్టీలు జమిలీ ఎన్నికలకు సానుకూలంగా స్పందించాయని కిషన్ రెడ్డి చెప్పారు. ఖర్చులను తగ్గించుకోవడం, సామాజిక సమతుల్యతకు బాటలు వేస్తూ, దేశ ఆర్థికాభివృద్ధికి బాటలు వేసుకోవచ్చని కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే జమిలీ ఎన్నికలకు ముందుకెళ్లాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. కేబినెట్ నిర్ణయంపై దేశవ్యాప్తంగా చర్చకు ప్రోత్సహించడం, జమిలీ ఎన్నికల నిర్వహణ అమలు కోసం కేంద్రం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేయనుందన్నారు. ఇప్పుడు వ్యతిరేకిస్తు్న పార్టీలు కూడా త్వరలోనే జమిలీకి సహకరిస్తాయనే విశ్వాసం తనకుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed