Kishan Reddy: తెలుగు సినిమా పేర్లపై కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

by Prasad Jukanti |
Kishan Reddy: తెలుగు సినిమా పేర్లపై కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు భాషను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. శనివారం హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరుగుతున్న తెలుగు మహాసభల్లో (Telugu Mahasabha) ఆయన పాల్గొన్నారు. ప్రాథమిక విద్య, పాలన వ్యవహారాలు, అధికారిక ఉత్తర్వులు తెలుగులోనే రావాలన్నారు. న్యాయస్థానాల్లో వాదనలు, ప్రతివాదనలు, తీర్పులు తెలుగుతో పాటు ప్రాంతీయ భాషల్లో ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. గతంలో సినిమాలకు అద్భుతమైన తెలుగు పేర్లు పెట్టేవారు. కానీ ఇవాళ ఇంగ్లీష్ పేర్లు పెడుతున్నారు. సినిమాల పేర్లు తెలుగులో ఉండే బాగుంటుందన్నారు. కేంద్రం తీసుకురానున్న నూతన విద్యా విధానంలో మాతృభాషకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.

మనమంతా ఆలోచించాలి:

డిజిటల్ విభాగంలో తెలుగు భాష క్రోఢీకరించి భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న పుస్తకాలన్ని డిజిటలైజేషన్ చేయాలని తెలుగు కనుమరుగు కాకముందే పరిరక్షించుకోవాలని సూచించారు.విద్యార్థులు లేక తెలుగు విద్యా సంస్థలు మూతపడుతున్నాయి. ఈ పరిణామాలపై మనమంతా ఆలోచించాలి. ప్రస్తుతం వాడుక భాషలో 30 శాతమే తెలుగు (Telugu) ఉందని మిగతా 70 శాతం ఆంగ్ల పదాలే ఉన్నాయన్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే మనకు తెలియకుండానే తెలుగు భాష కనుమరుగయ్యేలా ఉందన్నారు. మాట్లాడటం, రాయడం ద్వారానే భాషను పరిరక్షించగలమని చెప్పారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి కిషన్ రెడ్డి అవార్డులు ప్రదానం చేశారు.

Advertisement

Next Story