కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా ఒక్క ప్రాజెక్టు తేలేదు.. మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు

by Shiva |
కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా ఒక్క ప్రాజెక్టు తేలేదు.. మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : కిషన్‌‌రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు తేలేదని, ఒక్క ప్రయోజనం చేకూరలేదని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆరోపించారు. గల్లీలో ఎవరున్నా.. ఢిల్లీలో ఎవరున్నా.. తెలంగాణ ప్రయోజనాలు కాపాడే బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో గెలవాలని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ జరిగిన మహబూబాబాద్ పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం, విద్యుత్ అవినీతి అని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ కాపాడుకోవాలని కేసీఆర్ కృషి చేశారని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన నాడు ఎలాంటి పరిస్థితులు ఉండే.. ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు చూస్తున్నారని తెలిపారు. దురదృష్టవశాత్తూ ఓడిపోయాని, అలా అని బాధపడాల్సిన అవసరం లేదన్నారు. ఓటమి కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని, భవిష్యత్తులో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు.

మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో 4 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామని తెలిపారు. విద్య, వైద్యం, వ్యవసాయం, రోడ్లు ఇలా అన్నింట్లోనూ కేసీఆర్ అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ చేసిన గ్లోబల్ ప్రచారంపై చర్చ చేయాలన్నారు. డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణ మాఫీ, వడ్ల కొనుగోలు బోనస్ అని మాట తప్పి దగా చేశారని ఆరోపించారు. నాగార్జున సాగర్ కింద పంటకు నీటి విడుదల ప్రశ్నార్థకం అయ్యాయని తెలిపారు. నిరుద్యోగ భృతి అనలేదని అసెంబ్లీ సాక్షిగా భట్టి అబద్దం చెప్పారని మండిపడ్డారు. కరెంట్ ఇవ్వడం లేదు.. విద్యుత్ కోసం కొత్త విధానం తెస్తానంటారు.. ఇప్పటికే 24 గంటల కరెంట్ కేసీఆర్ ఇచ్చింది వాస్తవం కాదా.. కొత్త విధానం అంటే 48 గంటల కరెంట్ ఇస్తారా? అని ప్రశ్నించారు. నాడు ఉచిత విద్యుత్ అని కాంగ్రెస్ ఉత్త కరెంట్ చేసింది వాస్తవం కాదా? కర్ణాటకలో 5 గ్యారంటీలు అమలు చేయడం లేదని జనం రివర్స్ అయ్యారని తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో అందరం కష్టపడాలని, మీరు చెప్పిన అంశాలు ప్రతిదీ చర్చిస్తామని పేర్కొన్నారు.

నెల రోజులు అయితే కేసీఆర్ కూడా తెలంగాణ భవన్‌లోనే ఉంటారని, అందరం ఇక్కడే ఉంటామని తెలిపారు. ఏ ఒక్క సమస్య వచ్చినా అందరం బస్సు వేసుకుని కార్యకర్తల ముందుకు వస్తామని తెలిపారు. మొదటి కేబినెట్‌లో మొదటి డీఎస్సీ ఏమైందని ప్రశ్నించారు. భవిష్యత్తు అంతా బీఆర్ఎస్ పార్టీదేనని అన్నారు. త్యాగాల పునాదుల మీద ఏర్పడిన పార్టీ బీఆర్ఎస్ అని, గెలుపు ఓటమి కొత్త కాదన్నారు. మొన్న శాసనసభలో కాంగ్రెస్‌కు చూయించినది ట్రైలర్ మాత్రమేనని, ముందుంది అసలు సినిమా అన్నారు. కార్యకర్తలను కాపాడుకునేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని, అవసరమైన వారి పిల్లలకు సహకారం అందిస్తామని వెల్లడించారు. అక్రమ కేసుల నుంచి కార్యకర్తలను కాపాడేందుకు లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని, జిల్లా కార్యాలయాల్లో కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మండల, జిల్లా కమిటీలు వేసుకొని పార్టీని మరింత బలోపేతం చేసుకుందామని తెలిపారు. కార్యకర్తలకు అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని, 420 లో కాంగ్రెస్ వాళ్లు చారాణ మందం కూడా చేయరని, ప్రజలే వారికి బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. త్వరలోనే కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం బండారం బయట పడుతుందని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed