అవసరమైతే ప్రధాని మోడీ పర్యటిస్తారు: కిషన్ రెడ్డి

by Gantepaka Srikanth |
అవసరమైతే ప్రధాని మోడీ పర్యటిస్తారు: కిషన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో జరిగిన వరద నష్టానికి కేంద్రం నుంచి తగిన సాయం అందుతుందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక అందిన తర్వాత నిర్ణయం జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. చనిపోయిన కుటుంబాలకు తలా రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నదని, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే రూ. 5 లక్షలతో సంబంధం లేదని తెలిపారు. సీఎం రేవంత్ ఇప్పటికే ప్రకటించిన రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియాలో కేంద్రం ఇచ్చే నిధులను కూడా కలుపుతారో లేదే రాష్ట్ర ప్రభుత్వమే క్లారిటీ ఇవ్వాలన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వరదల కారణంగా గాయాల పాలై ఆసుపత్రి చికిత్స పొందుతున్న బాధికులకు కూడా వారం కేంద్రం నుంచి సాయం అందుతుందని వివరించారు. వారం రోజులకు పైబడి ట్రీట్‌మెంట్ తీసుకున్నట్లయితే రూ. 16 వేలు, అంత కంటే తక్కువ రోజులుంటే రూ. 4 వేల చొప్పున ఖర్చుల నిమిత్తం కేంద్రం ఇవ్వనున్నట్లు తెలిపారు.

వరదల నష్టాన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నదని, ఇప్పటికైతే కేంద్ర ప్రభుత్వం అలాంటి ప్రకటన చేయలేదని, అవసరమైన పక్షంలో ప్రధాని మోడీ కూడా ఇక్కడ పర్యటిస్తారని కిషన్‌రెడ్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ వరద ప్రాంతాల్లో పర్యటిస్తుండడంతపై ఇప్పుడు తాను ఎలాంటి కామెంట్ చేయదల్చుకోలేదన్నారు. ఆయన ఎందుకు వెళ్ళారో తాను ఎలా చెప్పగలనని ఎదురు ప్రశ్న వేశారు.

వరదల కారణంగా నష్టపోయిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం తన దగ్గర ఉన్న స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి వాడుకోవచ్చని, ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దగ్గర రూ. 1,300 కోట్లు ఉన్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు. ఆ నిధులతో ప్రస్తుతం సహాయక చర్యలు చేపట్టవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా నివేదిక అందితే దాన్ని పరిశీలించిన తర్వాత కేంద్రం నిధులను విడుదల చేస్తుందన్నారు. గతేడాది కేంద్రం ఇచ్చిన నిధుల వినియోగానికి సంబంధించి ఇప్పటికీ యుటిలైజేషన్ సర్టిఫికేట్లు అందలేదన్నారు. వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత అంటు వ్యాధులు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, దాని నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ క్యాంపులు పెట్టి అవసరమైన మందులను పంపిణీ చేయాలన్నారు. వర్షాలపై వాతావరణ శాఖ ముందుగానే అప్రమత్తం చేసినా 11 జిల్లాల్లో ప్రజలు ఇబ్బందులు పడడం, కొంతమంది చనిపోవడం బాధాకరమన్నారు.

వరద బాధిత ప్రాంతాలను సందర్శించాల్సిందిగా ప్రధాని మోడీని సీఎం రేవంత్ రిక్వెస్టు చేశారని, అవసరమైతే రాష్ట్ర పర్యటనకు వస్తారని కిషన్‌రెడ్డి బదులిచ్చారు. త్వరలోనే తేదీలపై స్పష్టత వస్తుందన్నారు. తెలంగాణతో పాటు ఏపీలోనూ వరద తీవ్రత ఎక్కువగానే ఉన్నదని, కేంద్ర హోం మంత్రి ఇప్పటికే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. దెబ్బతిన్న జాతీయ రహదారులు, రైల్వే లైన్లను యుద్ధ ప్రాతిపాదికన పునరుద్ధరించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు. సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిందిగా పార్టీ శ్రేణులకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రభుత్వం వరద సహాయక చర్యలు చేపట్టిందని, ఇప్పుడు తాము వెళ్ళి చేసేదేముందని ఒక ప్రశ్నకు సమాధానంగా రిప్లై ఇచ్చారు. తొందర్లోనే తాను కూడా తిరుగుతానని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed