ఉద్యోగానికి ఖానాపూర్ ఎమ్మెల్యే భర్త శ్యాం నాయక్ రిజైన్.. కారణమదేనా?

by Sathputhe Rajesh |
ఉద్యోగానికి ఖానాపూర్ ఎమ్మెల్యే భర్త శ్యాం నాయక్ రిజైన్.. కారణమదేనా?
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : అధికార భారత రాష్ట్ర సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో మరో సంచలనాత్మక అడుగు పడింది. ఎప్పటి నుంచో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆరాటపడుతున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్ భర్త అజ్మీర శ్యాం నాయక్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే స్వచ్ఛంద పదవి విరమణ కోసం రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌కు శ్యామ్ నాయక్ విజ్ఞాపన పెట్టుకోగా సంబంధిత ఫైలును కమిషనర్ జ్యోతి బుద్ద ప్రసాద్ ప్రభుత్వానికి సిఫారసు చేశారు.

ఈ నెలాఖరులోగా ఆయన తీసుకున్న నిర్ణయానికి ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రవాణా శాఖలో సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్‌గా ఉద్యోగంలో చేరిన శ్యాంనాయక్ ఆ తర్వాత ఎంవీఐగా పదోన్నతి పొందారు. ఆసిఫాబాద్‌లో సుమారు 15 సంవత్సరాలకు పైగా పనిచేశారు. ఆ తరువాత ఆదిలాబాద్ జిల్లా బోరజ్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులో పనిచేస్తున్నారు. డిప్యూటేషన్‌పై జగిత్యాల జిల్లా ఆర్టీవో‌గా ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఈ హోదాలోనే ఆయన తనకు స్వచ్ఛంద పదవి విరమణ కల్పించాలని కోరుతూ దరఖాస్తు పెట్టుకున్నారు.

ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి...

అజ్మీరా శ్యాం నాయక్ ఖానాపూర్ శాసనసభ్యురాలు రేఖానాయక్ భర్తగా అందరికీ సుపరిచితులు. ఎప్పటి నుంచో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న శ్యామ్ నాయక్ ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయం తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికార పార్టీలో సంచలనంగా మారింది. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం కోసం ఇప్పటికే ఎందరో మంది అభ్యర్థులు రంగంలో ఉండగా తాజాగా శ్యామ్ నాయక్ ఆ టికెట్ ఆశిస్తూ ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్నారని ప్రచారం మొదలైంది. మరోవైపు ఆసిఫాబాద్ అసెంబ్లీ స్థానంపై కూడా ఆయన ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికైతే అధికార పార్టీ నుంచే ఆయన టికెట్ వస్తుందని బలంగా విశ్వసిస్తున్నారు. ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే శ్యాం నాయక్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.

Advertisement

Next Story