డ్వాక్రా సంఘాల డబ్బులు స్వాహా.. ఐకెపి ఆఫీస్ ముందు మహిళల ధర్నా

by Nagam Mallesh |
డ్వాక్రా సంఘాల డబ్బులు స్వాహా.. ఐకెపి ఆఫీస్ ముందు మహిళల ధర్నా
X

జూలూరుపాడు, దిశ : జూలూరుపాడు మండల కేంద్రంలోని ఇందిరా క్రాంతి పథకం (ఐకెపి) ఆఫీస్ ముందు కరివారిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని డ్వాక్రా సంఘాల మహిళలు బుధవారం దాదాపు రెండు గంటలకు పైగా ధర్నా చేశారు. వెలుగు కార్యాలయం ఏపీఓ, సీసీలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డ్వాక్రా సంఘాల అధ్యక్షులు మాట్లాడుతూ కరివారిగూడెం పరిధిలో 30 వరకు డ్వాక్రా గ్రూపులో ఉన్నాయని, వీరందరూ బ్యాంకులో పొదుపు చేసుకోవడంతో పాటు తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లిస్తూ ఉంటారని తెలిపారు. ఈ క్రమంలో బ్యాంకు అధికారులు, వెలుగు అధికారులు కలిసి నియమించిన బ్యాంకుమిత్ర దుర్గారావుకు ప్రతి నెల బ్యాంకులో జమ చేయాల్సిన డబ్బులను ఇచ్చేవారమని అన్నారు. ఈ క్రమంలో దుర్గారావు ఎనిమిది గ్రూపులకు చెందిన సుమారు 30 లక్షల రూపాయలను స్వాహా చేశాడని, వెలుగు ఉద్యోగులకు తెలిసినా తెలియనట్లు వ్యవహరించారని, అతనితో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. అంతేగాక డబ్బులు చెల్లించాలంటూ బ్యాంకు నుంచి నోటీసులు జారీ చేస్తుండడంతో ఆందోళన చెందాల్సి వస్తుందని అన్నారు. బ్యాంక్ అధికారులు, వెలుగు అధికారులపై చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed