Collector Muzammil Khan : మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి

by Sridhar Babu |
Collector Muzammil Khan : మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి
X

దిశ, ఎర్రుపాలెం : మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని వారి ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వంచే ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. మంగళవారం మీనవోలు గ్రామంలో నాలెడ్జి సెంటర్ లో ఇందిరా మహిళా డెయిరీపై నిర్వహించిన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని, మహిళా సమైక్య సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా ఇందిరా మహిళాశక్తి కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రారంభించే వ్యాపారంపై పూర్తి అవగాహన కల్గివుండాలన్నారు. వ్యాపారం ఎక్కువ కాలం కొనసాగేలా సమిష్టి సహకారంతో ముందుకు సాగాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కార్యక్రమం ద్వారా, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులచే పాఠశాలల అభివృద్ధి పనులు చేపట్టి, విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నామన్నారు. 85 శాతం పనులు పూర్తయ్యాయని, మిగులు పనులు త్వరితగతిన పూర్తి చేసి జిల్లాకు మంచిపేరు తేవాలన్నారు. మహిళా సంఘాలచే మహిళా శక్తి కుట్టు కేంద్రాలు ఏర్పాటు చేసి, పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్ ల తయారు చేసుకున్నామన్నారు.

మహిళల కోసం మహిళా శక్తి కార్యక్రమం కింద వివిధ పథకాల కార్యాచరణ చేపట్టామన్నారు. మహిళలు వ్యాపారాన్ని ప్రారంభించే ముందు, ఉత్పత్తి అయ్యే వస్తువుకు సంబంధించి డిమాండ్, మార్కెటింగ్ కు సంబంధించి కార్యాచరణపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. మహిళా సంఘాలన్నీ ఒకేచోట ఒకే విధమైన వ్యాపారాలను నిర్వహించడం కాకుండా, ఆయా ప్రదేశాల డిమాండ్, మార్కెటింగ్ పరిస్థితులకు అనుగుణంగా వ్యాపారాలను ప్రారంభించాలన్నారు. వ్యాపారాన్ని సమిష్టిగా నిర్వహించడమే కాకుండా, వ్యాపార వృద్ధి కూడా సంపూర్ణ సహకారంతో, పరస్పర అవగాహనతో, ఎలాంటి అపోహలకు తావులేకుండా చేపట్టినప్పుడే అద్భుతమైన విజయాన్ని చవిచూడగల్గుతామన్నారు. స్వయం సహాయక సంఘాలచే చేపట్టిన వ్యాపారాలు అనుకున్న విజయాలు సాధించినప్పటికి, కొంతకాలానికి వ్యాపారం మానేస్తారని, కొంతకాలం నడిపించామా, తర్వాత మూసివేసాం అన్న చందంగా కాకుండా మంచి నాణ్యతతో, డిమాండ్ కు తగ్గ సరఫరా అందిస్తూ, వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొని, వ్యాపారాన్ని దినదిన అభివృద్ధి చేసుకోవాలన్నారు.

వ్యాపారాన్ని ఎక్కడ ప్రారంభించాలనుకున్నా మన సామర్థ్యం, తోటివారి సహకారం, నిజాయితీ గురించి స్పష్టమైన అవగాహన పొందాలన్నారు. వ్యాపారాన్ని సునాయాసంగా లాభసాటిగా మార్చుకోగలిగే ధీమాతో, మహిళా సంఘాలన్నీ సమన్వయంతో ఆదర్శంగా ముందుకు సాగాలన్నారు. మహిళలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో మీ సేవా కేంద్రాలు, ఈవెంట్ మేనేజ్మెంట్, డెయిరీలు, డెయిరీ వ్యాపారాలు, క్యాంటీన్లు, బ్యూటీ పార్లర్ ల ఏర్పాటు తదితర అన్నిరకాల ఉపాధికల్పనకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించడంతో పాటు రుణ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తుందని ఆయన తెలిపారు. డిమాండ్ ప్రాతిపదికన యూనిట్లు ఎంచుకుంటే ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా మహిళలతో అభిప్రాయాలు, వారి అనుభవం, ఆలోచనలను కలెక్టర్ పంచుకున్నారు. తొలుత జిల్లా కలెక్టర్ మీనవోలు గ్రామంలో మిల్క్ డెయిరీ నడుపుతున్న కేంద్ర నిర్వాహకులు మహబూబ్ తో ముచ్చటించారు.

డెయిరీ వ్యాపారం నిర్వహణ, లాభనష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. డెయిరీ వ్యాపారానికి అనువైన పరిస్థితి గురించి, అభివృద్ధి గురించి ఆరా తీశారు. నాలెడ్జి కేంద్రం వద్ద మొక్కలు నాటారు. ఎర్రుపాలెం మండల కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న గ్రామ పంచాయతీ భవనాన్ని పరిశీలించారు. ఎర్రుపాలెంలో ప్రస్తుతం నడుస్తున్న చిల్లింగ్ కేంద్రాన్ని భవనంలోకి మార్చడానికి, మిల్క్ చిల్లింగ్ సెంటర్ ఏర్పాటుకు అనుకూలతను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ స్థానిక సంస్ధల అదనపు కలెక్టర్, డీఆర్డీవో సన్యాసయ్య, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వేణు మనోహర్, డీఎల్డివో కె.కిషోర్, అడిషనల్ డీఆర్డీవో మహ్మద్ నూరుద్దీన్, ఎర్రుపాలెం మండల తహసీల్దార్ ఉషాశారద, ఎంపీడీఓ సురేందర్, ఖమ్మం విజయ డెయిరీ మేనేజర్ సిద్దేశ్వర్, గౌతమి జిల్లా సమైక్య అధ్యక్షురాలు టి. సుహసిని, ఇందిరా డెయిరీ అధ్యక్షురాలు అన్నపూర్ణ, డీపీఎం, ఏపీఎంలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed