- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైరా నేతలకు "నిద్రలేని రాత్రులు"
దిశ, వైరా: ముందస్తు ఎన్నికలు ముంచుకొస్తాయని వార్తలు వెలువడుతుండటంతో వైరా టికెట్ ఆశిస్తున్న రాజకీయ పార్టీ నేతల్లో నిద్ర లేని రాత్రులు మొదలయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లోనే సంచలనాలకు కేంద్ర బిందువైన వైరా నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్టీల ఆశావాహుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రధాన రాజకీయ పార్టీల ఆశావాహులు తమ పార్టీ అధిష్టానం తమకే టికెట్ కేటాయిస్తుందని గొప్పలు చెప్పుకుంటూ పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
లో లోపల తమ పరిస్థితి ఏమవుతుందో అని కుమిలిపోతున్నారు. ముందస్తు తథాస్తు అయితే నెల నుంచి రెండు నెలల వ్యవధిలోనే తమ రాజకీయ భవిష్యత్తు స్పష్టమవుతుందని ఆశావాహుల్లో టెన్షన్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నాకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ టికెట్ ఇస్తానని స్పష్టమైన హామీలు ఇచ్చారని బీఆర్ఎస్ ఆశావాహులు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.
తమకు పీ సీ సీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఖమ్మం మాజీ ఎంపీ రేణుక చౌదరి సహకారంతో కాంగ్రెస్ టికెట్ వస్తుందని ఆ పార్టీలోని ఆశావాహులు ఆశగా ఎదురు చూస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆశీస్సులతో తమకు టిక్కెట్ వస్తుందని ఆ పార్టీలోని ఆశావాహులు ప్రకటిస్తున్నారు. మరోవైపు పొంగులేటి ఆశీస్సులతో ఆయన ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ టికెట్ తనకు వస్తుందని విజయబాయి కొండంత ధైర్యంతో ఉన్నారు.
వైరా నియోజకవర్గంలో నామ మాత్రంగా ఉన్న వైయస్సార్‌టీపీలో కూడా తమకు షర్మిల ఆశీస్సులతో టికెట్ లభిస్తుందని చెప్పుకుంటున్నారు. ఇలా అన్ని ప్రధాన రాజకీయ పార్టీల్లో ఆశావాహులు తమకే టికెట్ వస్తుందని వ్యక్తిగతంగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఏ పార్టీలోనైనా ఒక అభ్యర్థికి టికెట్ కేటాయిస్తారనే "నగ్నసత్యం" ఆ పార్టీల అభ్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.
టికెట్ నాదంటే... నాదంటున్న టీఆర్ఎస్ నేతలు
వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ వచ్చే ఎన్నికల్లో టికెట్ తనకు వస్తుందని ధీమాగా ఉన్నారు. సీఎం కేసీఆర్ సిట్టింగులకే టిక్కెట్లు కేటాయిస్తామని పలు సందర్భాల్లో ప్రకటించటం ఆయనకు కొంత ఊరటనిచ్చింది. అయితే బీఆర్ఎస్ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవడంతో ఆయనను సీపీఐ పార్టీ నిద్ర లేకుండా చేస్తుంది.
పొత్తుల్లో సీపీఐ కు సీటు కేటాయిస్తే తన రాజకీయ భవిష్యత్తు ఏంటనే ఆలోచనలు ఆయన పడ్డారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్ ఒక అడుగు ముందుకేసి బీఆర్ఎస్ టికెట్ తనదేనని తన అనుచరులతో వరుసగా నిర్వహిస్తున్న సమావేశాల్లో ప్రకటిస్తున్నారు. తనకు కేటీఆర్ స్వయంగా టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారని చెబుతున్నారు.
అంతేకాకుండా ప్రస్తుత ఎమ్మెల్యే రాముల నాయక్ పై తన అనుచరులతో నిర్వహించిన అంతరంగిక సమావేశాల్లో విమర్శలు చేయడానికి కూడా వెనకాడటం లేదు. మరో మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి తనకు కేటీఆర్ వద్ద ఉన్న పరపతితో టికెట్ వస్తుందని ఆమె సన్నిహితులు వద్ద చెప్పుకుంటున్నారు.
అంతేకాకుండా మదన్లాల్, రాములు నాయక్ వర్గ పోరు తనకు కలిసి వస్తుందని చంద్రావతి ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ రెండు వర్గాల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరుతో మద్యే మార్గంగా తనకు అవకాశం వస్తుందని చంద్రావతి భావిస్తున్నారు. బీఆర్ఎస్‌లో టికెట్ ఆశిస్తున్నా ముగ్గురు నేతల్లో చివరకు అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో తెలియక మానసిక ఆందోళనకు గురవుతున్నారు.
కాంగ్రెస్‌లోనూ ముగ్గురు మొనగాళ్ళే..
కాంగ్రెస్ పార్టీలో ముగ్గురు అభ్యర్థులు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. భట్టి విక్రమార్క సహకారంతో తనకు టికెట్ వస్తుందని మాలోత్ రాందాస్ నాయక్ ఆశగా ఉన్నారు. అయితే రాందాస్ నాయక్ స్థానికేతరుడు కావడంతో పాటు ఆర్థిక బలం అంతగా లేదని స్థానికంగా ప్రచారం జరుగుతుంది. మరో నేత బాలాజీ నాయక్ భట్టి విక్రమార్క ఆశీస్సులతో టికెట్ వస్తుందని చెప్పుకుంటున్నారు.
గతంలో వైరా లో టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసిన అనుభవం తనకు టికెట్ కేటాయింపుల్లో సానుకూలంగా మారుతుందనే భ్రమలో ఉన్నారు. అయితే బాలాజీ నాయక్ ఒకవైపు భట్టి విక్రమార్క తో ఉంటూనే మరోవైపు రేణుకా చౌదరి వర్గీయులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
అంతేకాకుండా ఇతనిపై భూకబ్జా ఆరోపణ ప్రధానంగా ఉన్నాయి. ఈ ఆరోపణలు బాలాజీ నాయక్ కు ప్రతిబంధకంగా మారే అవకాశం ఉంది. రేణుకా చౌదరి సహకారంతో తనకు టికెట్ వస్తుందని ధరావత్ రామ్మూర్తి నాయక్ ఆశ పడుతున్నారు. రామ్మూర్తి నాయక్ స్థానికేతరుడు కావడంతో పాటు వైరా నియోజకవర్గంలో పూర్తిస్థాయి రాజకీయ సంబంధాలు ఏర్పరచుకోలేకపోయారు. అయితే రామ్మూర్తి నాయక్ కుటుంబం కు రాజకీయ నేపథ్యం ఉండటంతో పాటు వైరా ప్రజలతో సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ లో ముగ్గురు నేతలు టికెట్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
బీజేపీ, వైఎస్ఆర్టీపీ పార్టీల్లోను అదే తంతు..
వైరా నియోజకవర్గ బీజేపీ, వైఎస్ఆర్ టీపీ పార్టీలోనూ ఆశావాహులు ఉన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరుతారని జిల్లాలో ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే వైరా బీజేపీ టికెట్ బానోత్ విజయభాయికి లభించటం లాంఛనప్రాయమే అవుతుంది. అయినప్పటికీ బండి సంజయ్ ఆశీస్సులతో బీజేపీ టికెట్ తనకు వస్తుందని కాట్రావత్ మోహన్ నాయక్ ప్రచారం చేసుకుంటున్నారు. మోహన్ నాయక్ గతంలో కొద్ది నెలలు వైరా నియోజకవర్గంలో పర్యటించారు. అయితే ఓ దేవాలయ కేంద్ర బిందువుగా మోహన్ నాయక్ వివాదాస్పదుడయ్యారు.
అప్పట్లో బీజేపీ జిల్లా అధినాయకత్వంతో అతనికి తీవ్ర విభేదాలు రావటంతో ఐదు నెలల క్రితమే వైరాను వదిలి వెళ్లారు. ఇటీవల మరలా తాను నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తానని ప్రకటించి అజ్ఞాతంలోకి వెళ్లారు. వీరితో పాటు గతంలో ఇక్కడ పోటీ చేసిన రేష్మ నాయక్, మరో నేత బీపీ నాయక్ బీజేపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు.
వైరాలో అంతంత మాత్రంగా ఉన్న వైయస్సార్టీపీ లో కూడా ఇద్దరు నేతలు టికెట్ ఆశిస్తూ తమకు షర్మిల సహకారం ఉందని చెప్పుకుంటున్నారు. ఇలా అన్ని రాజకీయ పార్టీల్లో ఆశావాహులు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ తమకు పోటీ చేసే అవకాశం లభిస్తుందో లేదో అని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.