నన్నే టార్గెట్ చేస్తావా.. దేనికైనా రెడీ..! కారేపల్లి బీసీ బాలుర హాస్టల్ వార్డెన్ తీరు

by Shiva |
నన్నే టార్గెట్ చేస్తావా.. దేనికైనా రెడీ..! కారేపల్లి బీసీ బాలుర హాస్టల్ వార్డెన్ తీరు
X

దిశ, ఖమ్మం ఎడ్యుకేషన్: ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంగా తెలంగాణ ప్రభుత్వ వెనుకబడిన తరగతుల ఆధ్వర్యంలో నడుస్తున్న బీసీ బాలుర వసతి గృహంలో నెలకొన్న సమస్యలపై దిశ పత్రికలో సోమవారం ‘ఇష్టారీతిగా హాస్టల్ నిర్వహణ’ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. కారేపల్లి వసతి గృహంలో విద్యార్థులు పడుతున్న గోసను కథనంలో వివరించింది. అయితే, ఆ కథనం చూసిన వార్డెన్ ‘మీరు బీసీ డిపార్ట్‌మెంట్‌ను టార్గెట్ చేశారా? లేక నన్ను టార్గెట్ చేశారా?.. నేను దేనికైనా రెడీ. రాష్ట్రంలోని వసతి గృహాల్లో సమస్యలు ఏమి లేవా?.. మంచిగా నడుస్తున్న హాస్టల్‌పై వార్తలు ఎందుకు రాస్తున్నారు. గత 30 ఏళ్లుగా వసతి గృహాన్ని అద్దె భవనంలోనే నిర్వహిస్తున్నాం. నేను వచ్చిన తరువాతే మంచి అద్దె భవనంలో హాస్టల్‌ నిర్వహిస్తున్నాం. ఈ హాస్టల్లో పనిచేస్తే నాకు అదనపు జీతం ఏమీ రాదు’ అంటూ కారేపల్లి హాస్టల్ వార్డెన్ ‘దిశ’ విలేకరిని బెదిరించే ధోరణిలో వాట్సప్‌లో సందేశం పంపినట్లు తెలుస్తోంది.

వాస్తవాలు రాస్తే అక్కసు..

ఒక్కరోజు కాదు.. రెండు రోజులు కాదు. గత 30 ఏళ్లుగా బీసీ బాలుర కారేపల్లి వసతి గృహాన్ని అద్దె భవనంలోని నిర్వహిస్తున్నారు. సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు ఒకే గదిలో 60 మంది విద్యార్థులు బస చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అసలే వర్షాకాలం.. అందుకు తోడు హాస్టల్ భవనంలో ఒక్క కిటికీ డోర్ అయినా లేదు. నిత్యం జలుబు, జ్వరాలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వాపోతున్నారు. 60 మంది విద్యార్థులు కలిపి రెండంటే రెండే బాత్‌ రూంలు ఉన్నట్లుగా తెలుస్తోంది. వంట గది వర్షాలకు కురుస్తున్నది. ఆ సమస్యలపై కథనం ప్రచురించారనే అక్కసుతో.. బెదిరించే ధోరణిలో వార్డెన్ విలేకరులకు వాట్సప్‌లో మెసేజ్ పంపినట్లు తెలుస్తోంది.

ప్రైవేట్ వ్యక్తితో విధులు..

హాస్టల్‌లో ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు అందుబాటులో ఉండి విద్యార్థుల బాగోగులు చూడాల్సిన హాస్టల్ వార్డెన్ విధులకు సక్రమంగా హాజరవడం లేదని తెలుస్తోంది. హాస్టల్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా ఓ ప్రైవేటు వ్యక్తిని నియమించి, హాస్టల్ వార్డెన్ డ్యూటీకి రాకుండా ఆ ప్రైవేటు వ్యక్తి సహకారంతోనే విధులను చక్కపెడుతున్నట్లుగా సమాచారం. హాస్టల్‌కు పక్కనే ఉన్న వంట గదిలో వంటతో పాటుగా, కంప్యూటర్ ఆపరేటర్‌గా ఓ వ్యక్తి వార్డెన్ విధులను నిర్వహిస్తున్నాడు.

ఇంటెలిజెన్స్ ఆరా..

కారేపల్లి బీసీ బాలురు వసతి గృహంలో నెలకొన్న సమస్యలపై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీశారు. సోమవారం ఉదయం వసతి గృహాన్ని తనిఖీ చేసినట్లుగా తెలుస్తోంది. కథనం వెలువడిన రోజే ముందస్తు చర్యలలో భాగంగా వార్డెన్ వసతి గృహ కిటికీలకు, జాలీ ఏర్పాటు చేశారు. వంట గదిలో నిల్వ ఉంచిన బియ్యం, పప్పు, ఇతర సామాగ్రిని శుభ్రంగా ఉంచాలని సూచించినట్లు తెలుస్తుంది. వార్డెన్‌పై ఉన్నత అధికారులకు నివేదిక ఇవ్వనట్లుగా సమాచారం.

హాస్టల్‌ను తనిఖీ చేసిన డివిజన్ అధికారి..

కారేపల్లి బీసీ హాస్టల్‌పై ‘దిశ’ పత్రికలో వస్తున్న వరుస కథనాలకు డివిజన్ అధికారి డి.నరసయ్య స్పందించారు. ఖమ్మం జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి జ్యోతి సూచనల మేరకు, హాస్టల్‌ను సోమవారం సందర్శించారు. వసతి గృహంలో ఉంటున్న విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలపై వాకబు చేశారు. ఈ సందర్భంగా వార్డెన్ సక్రమమైన మెనూ అందిస్తున్నట్లు విద్యార్థులు చెబుతున్నారని అధికారి తెలిపారు. ప్రస్తుత బిల్డింగ్‌కు అద్దె చెల్లిస్తున్నామని, త్వరలోనే కొత్త బిల్డింగ్ నిర్మాణానికి నిధులు మంజూరు కానున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. హాస్టల్‌లో నెలకొన్న సమస్యలను జిల్లా అధికారి దృష్టికి తీసుకుపోతామని అన్నారు.

వార్డెన్‌పై చర్యలు ఎప్పుడో..

కారేపల్లి బీసీ బాలుర వసతి గృహంలో పని చేసే హాస్టల్ వార్డెన్ ముచ్చర్ల కేంద్రంగా నడుస్తున్న షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ హాస్టల్ రెగ్యులర్ వార్డెన్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ పని చేస్తూనే కారేపల్లి బీసీ బాలుర వసతి గృహానికి ఇన్‌చార్జిగా ఉన్నట్లుగా సమాచారం. ఆ రెండు హాస్టళ్లను దగ్గరుండి చూసుకోవాల్సిన వార్డెన్, కారేపల్లి వసతి గృహంలో ప్రైవేటు వ్యక్తిని నియమించడం పట్ల అనుమానాలకు తావిస్తోంది. హాస్టల్లో నెలకొన్న సమస్యలపై జిల్లా అధికారులు దృష్టి సారించి వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.

Next Story