భద్రాద్రి ట్రస్ట్ బోర్డుకు మోక్షం ఎప్పుడు ?

by Sridhar Babu |
భద్రాద్రి ట్రస్ట్ బోర్డుకు మోక్షం ఎప్పుడు ?
X

దిశ, భద్రాచలం : దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు లేక పుష్కర కాలం దాటింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో కొనిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చివరిసారిగా భద్రాద్రి రామాలయానికి ట్రస్ట్ బోర్డును ఏర్పాటుచేసి చైర్మన్​గా కురుచేటి పాండురంగారావును నియమించారు. 2012 సంవత్సరంలో ఆ ట్రస్ట్ బోర్డు పదవీకాలం పూర్తి అయిన తర్వాత 12 సంవత్సరాలుగా రామాలయానికి ట్రస్ట్ బోర్డును నియమించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం రెండుసార్లు అధికారం చేపట్టినా రామాలయానికి ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరం. ట్రస్టు బోర్డును ఏర్పాటు చేయకపోగా భద్రాద్రి రామాలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ప్రకటించిన రూ. 100 కోట్లులో ఒక్క రూపాయి నిధులు కూడా మంజూరు చేయలేదు. ఏటా రూ. 50 కోట్లకు పైబడి ఆదాయం వచ్చే ఈ దేవస్థానానికి ట్రస్టు బోర్డును నియమించకపోవడం కారణంగా అభివృద్ధికి నోచుకోవడం లేదని శ్రీరామ భక్తులు ఆరోపిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం భద్రాచల రామాలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ఎన్ని నిధులైనా వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఈ మేరకు ఎండోమెంట్, రెవెన్యూ అధికారులతో ఆలయ అభివృద్ధి గురించి ప్రత్యేకంగా సమీక్షలు జరిపారు. అధికారులు రామాలయం చుట్టూ స్థల సేకరణ కొరకు గృహ యజమానులతో అనేక దఫాలుగా చర్చలు నిర్వహించారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరి గుట్ట ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తూ టీటీడీ తరహాలో యాదాద్రికి ట్రస్ట్ బోర్డును నియమిస్తామని ప్రకటించారు.

యాదాద్రితో పాటు భద్రాద్రి కి కూడా ట్రస్టు బోర్డును ఏర్పాటు చేసి అభివృద్ధికి నిధులు వెచ్చించాలని శ్రీరామ భక్తులు కోరుకుంటున్నారు. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి నాడు భద్రాద్రిలో జరిగే శ్రీసీతారాముల వారి కళ్యాణం వీక్షించడానికి దేశ నలుమూలల నుండి లక్షలాదిమంది భక్తులు భద్రాద్రికి తరలి వస్తారు. అలాగే ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలను సైతం రామాలయంలో వైభవంగా నిర్వహిస్తారు. రామాలయ అభివృద్ధికి నిధులు మంజూరుకు ముందే పాలకవర్గం ఏర్పాటు చేయాలని భక్తులు కోరుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed