ఖమ్మంలో అత్యధిక సీట్లు గెలిచి.. కేసీఆర్‌కు బహుమతిగా ఇస్తాం: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

by Satheesh |   ( Updated:2023-10-17 13:57:39.0  )
ఖమ్మంలో అత్యధిక సీట్లు గెలిచి.. కేసీఆర్‌కు బహుమతిగా ఇస్తాం: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
X

దిశ బ్యూరో, ఖమ్మం: ఖమ్మం జిల్లా నుంచి అత్యధిక సీట్లు గెలిచి కేసీఆర్‌కు బహుమతిగా ఇస్తామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. మంగళవారం ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరో ప్రజలకు తెలుసు, ప్రత్యర్థి పార్టీలు వారికి అభ్యర్థి ఎవరో తెలుసుకోవడానికి తర్జన భర్జన పడుతున్నాయన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు విభిన్నంగా ఆలోచించాలని, అభివృద్ధి వైపే నిలవాలని పిలుపునిచ్చారు. ఇతర జిల్లాల కంటే ఎక్కువగా సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాకు పెద్ద పీట వేశారని పేర్కొన్నారు.

తమకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీనే అని, ఖమ్మం జిల్లా ప్రజలంతా ఆలోచన చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తమ కార్యక్రమాలు, హామీలను కాపీ కొట్టిందని, వాళ్ల హయాంలో ఇచ్చిన పింఛన్ వందల్లోనే అని, దాన్ని వేలు చేసింది కేసీఆర్ సర్కారే అన్నారు. గతంలో మీరు మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన వాటిని మీరు నెరవేర్చలేదని, తాము మాత్రం నెరవేర్చామన్నారు. చిన్న రాష్ట్రాన్ని నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టిన కేసీఆర్‌కు మూడవసారి విజయం అందించే బాధ్యత ఖమ్మం జిల్లా ప్రజలపైనే ఉందన్నారు.

పదేళ్లలో ఎంతో అభివృద్ధి: ఎంపీ నామా నాగేశ్వరరావు

తెలంగాణ సాధించుకున్న తర్వాత గత 10 ఏళ్లలో తెలంగాణలో చాలా అభివృద్ధి జరిగిందని ఎంపీ నామానాగేశ్వరరావు పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో కూడా దేశంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందన్నారు. కేసీఆర్‌ను మూడవసారి సీఎంగా ప్రజలు హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు పేదలు, రైతులు, కరెంట్, నీటి కష్టాల విలువ తెలుసు కాబట్టి గొప్ప గొప్ప పథకాలు రాష్ట్రానికి అందించారన్నారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలను పలు రాష్ట్రాలు, కేంద్రం కాపీ కొట్టాయన్నారు.

10 ఏళ్లలో ఇచ్చిన ప్రతి హామీని చేసి చూపామని, ఇప్పుడు ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తామన్నారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏమి చేసింది లేదని, కానీ ఇప్పుడు ఆ పార్టీ వచ్చి 6 గ్యారెంటీలు అంటుందన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే రాములు నాయక్, బీఆర్ఎస్ అభ్యర్థులు సండ్ర వెంకట వీరయ్య(సత్తుపల్లి), మదన్ లాల్(వైరా), లింగాల కమల్ రాజ్(మధిర), నాయకులు పగడాల నాగరాజు, ఆర్జేసీ కృష్ణ, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్ ఉన్నారు.

Advertisement

Next Story