పండగపూట విషాదం నింపిన ఈత సరదా..

by Disha News Desk |
పండగపూట విషాదం నింపిన ఈత సరదా..
X

దిశ, అశ్వారావుపేట టౌన్: కనుమ పండుగ రోజు మిత్రులతో కలిసి సరదాగా గడిపేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త మామిళ్లగూడెం గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు కనుమ పండుగ రోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో గాడ్రాల గ్రామ సమీపంలోని వాగు వద్దకు వెళ్లారు. వీళ్లలో కొక్కెరపాటి ప్రవీణ్(20) కవులూరు సాయి(20) లు ఫోటోలు దిగేందుకు వాగులోకి దిగారు. కొక్కెరపాటి ప్రవీణ్ కు ఈత రాకపోవడంతో లోతుల్లోకి వెళ్లి నీట మునిగాడు. ఇతడిని కాపాడేందుకు వెళ్లిన కవులూరు సాయి కూడా మునిగిపోవడంతో మిగిలిన యువకులు స్థానికుల సహాయంతో గాలించగా మునిగిన చోటే మృతదేహాలు లభ్యమయ్యాయి.

పండగ పూట యువకులు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాలు శోకసముద్రంలో మునిగాయి. మృతదేహాల వద్ద కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో అందరితో కలివిడిగా ఉండే యువకుల హఠాన్మరణంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. మృతులు ఇద్దరు వ్యవసాయ పనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నారు. అశ్వారావుపేట రూరల్ ఎస్ఐ ఊకే రామ్మూర్తి ఘటనా స్థలికి చేరుకొని మృతుల తో ఈతకు వెళ్లిన యువకుల నుంచి వివరాలు సేకరించారు.

Advertisement

Next Story

Most Viewed