రెండు రాష్ట్రాల్లో రైతులను దోచుకుంటున్న ఇద్దరు డీలర్లు..

by Sumithra |   ( Updated:2023-06-27 06:19:57.0  )
రెండు రాష్ట్రాల్లో రైతులను దోచుకుంటున్న ఇద్దరు డీలర్లు..
X

దిశ, వైరా : "మా కంపెనీ విత్తనాలు అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు.. మిరప మొక్క మొదల నుంచి చిగురు వరకు జడ కాపు కాస్తుంది.. గనుపుకు రెండు నుంచి మూడు కాయలు కాస్తాయి. బ్రాండెడ్ కంపెనీల కంటే మా కంపెనీ విత్తనాలు అదనంగా దిగుబడి సాధిస్తాయి. నల్లి వైరస్ ఇతర తెగుళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. మిరపకాయ బరువు కూడా అత్యధికంగా వస్తుంది" అంటూ యూట్యూబ్లో ఉద్దరగొట్టే ప్రచారంతో కొన్ని నాసిరకం మిరప విత్తన కంపెనీలు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నాయి.

తమ కంపెనీ విత్తనాలు సాగు చేస్తే ఎకరాకు 35 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని యూట్యూబ్ లో తప్పుడు వీడియోలతో ప్రకటనలు చేసి రైతలను ఆకర్షిస్తున్నారు. యూట్యూబ్ ఛానలల్లో రంగురంగు వీడియోలతో రైతులకు వలవేస్తున్నారు. ఆ వీడియోలు చూసిన రైతులు ఇదంతా నిజమే అని నమ్మి విత్తనాలు కొనుగోలు చేసేందుకు వెళ్ళగానే బ్రాండెడ్ కంపెనీ విత్తనాల కంటే రెట్టింపు ధరలను వసూలు చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. ఈ విత్తన ప్యాకెట్ల పేర్లు కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. సినిమా పేర్లతోపాటు వారికి నచ్చిన పేర్లతో విత్తన ప్యాకెట్లను తయారు చేస్తూ విక్రయిస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై కేంద్రాలుగా ఈ విత్తనాలు తయారవుతున్నాయని రైతులకు నమ్మ పలుకుతున్నారు. దీంతో ఆశపడిన రైతులు వారి జేబులను గుల్ల చేసుకుంటున్నారు.

ఏన్కూరు, సుజాతనగర్ కేంద్రాలుగా మిరప విత్తనాల దందా..

ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సుజాతనగర్ కేంద్రాలుగా మిరప విత్తనాల దందా యదేచ్ఛగా కొనసాగుతుంది. ఏన్కూరుకు చెందిన ఓ "వాసు"డు, సుజాతనగర్ కు చెందిన ఒక "నాగేశ్వరుడు" గత కొన్నేళ్లుగా ఈ అక్రమ దందాకు తెరలేపారు. సుజాతనగర్ కేంద్రంగా పుష్ప విత్తనాల పేరుతో రైతులను అందిన కాడికి దండుకుంటున్నారు. ఎకరాకు 35 నుంచి 40 కింటాలు దిగుబడి వస్తుందని, పంటకు ఎలాంటి తెగుళ్లు సోకవని యూట్యూబ్ లో ఉచిత ప్రచారం చేసుకుంటున్నారు.

ఈ ప్రచారాన్ని చూసిన రైతులు విత్తనాల కోసం ఎగబడుతున్నారు. ఏన్కూరు కేంద్రంగా ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ పేరుతో సుధా, సత్యభామ, మనీ 88, నవధాన్య సీడ్స్ పేరుతో దేవకి లాస్య, విఎన్ హైబ్రిడ్ సీడ్స్ పేరుతో సంజు, మానస పేర్లతో మిరప విత్తనాలను విచ్చలవిడిగా అమ్ముతున్నారు. సోషల్ మీడియాలను కేంద్రంగా చేసుకొని ప్రచారాలను అదరగొడుతూ రైతులను ఆకర్షిస్తున్నారు. బ్రాండెడ్ కంపెనీ మిరప విత్తన ప్యాకెట్లు 10 గ్రాములను 300 నుంచి 450 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. అయితే బ్రాండెడ్ కంపెనీల విత్తనాల కంటే ఈ విత్తనాలను రెట్టింపు ధరలకు విక్రయించడం విశేషం. 10 గ్రాముల ప్యాకెట్ను 900 నుంచి 1000 రూపాయలకు విక్రయించి రైతులను మోసం చేస్తున్నారు. ఈ విత్తన ప్యాకెట్లు తయారీ ఎక్కడో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.

రెండు రాష్ట్రాలకు ఆ ఇద్దరే డీలర్లట..

పుష్ప మిరప విత్తనాలకు సుజాతనగర్ చెందిన వ్యక్తి, ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్, నవధాన్య సీడ్స్, వీఎన్ హైబ్రీడ్ సీడ్స్ లకు ఏన్కూర్ కు చెందిన మరో వ్యక్తి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు డీలర్లట. ఈ రెండు రాష్ట్రాల్లో వారు ఇరువురు కొంతమందిని ఏజెంట్లను పెట్టుకుని యూట్యూబ్ సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తూ అత్యధిక ధరలకు నాసిరకం మిరప విత్తనాలు అమ్ముతూ కోట్లాది రూపాయలను గడిస్తున్నారు. రెండు రాష్ట్రాలకు ఈ విత్తనాలకు ఇద్దరు డీలర్లు మాత్రమే ఉండటం ఏమిటని అవగాహన ఉన్న రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతులు విత్తనాల కోసం ఫోన్ చేస్తే ముందుగా విత్తనాలు అయిపోయాయని బిల్డప్ ఇస్తారు. విత్తన కొరత వల్ల ధరలు పెరిగిందని అందిన కాడికి అనంతరం దండుకుంటారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ దందా నిరంతరాయంగా కొనసాగుతుంది.

గత రెండేళ్లలో నష్టపోయిన అనేక మంది రైతులు..

ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలువురు రైతులు సుజాతనగర్, ఏన్కూరు కేంద్రాలుగా విక్రయించిన నాన్ బ్రాండెడ్ మిరప నాసిరకం విత్తనాలు సాగు చేసి తీవ్రంగా నష్టపోయారు. ఖమ్మం జిల్లాలోని గార్లలో అనేకమంది పుష్ప విత్తనాలు వేసి పంటను నష్టపోయారు. అదేవిధంగా ఏన్కూరు, జూలూరుపాడు, వైరా కొనిజర్ల, కూసుమంచి, తల్లాడ సత్తుపల్లి తదితర ప్రాంతాల్లో ఈ విత్తనాలు సాగుచేసిన రైతుల తీవ్రంగా నష్టాలను చవి చూశారు. అయితే మిరపకు వైరస్ రావటం వల్ల తమ విత్తనాలు పండలేదని, అది విత్తనాల తప్పు కాదని ఈ డీలర్లు కలరింగ్ ఇచ్చి రైతులకు సర్ది చెప్పారు. దేశ వ్యాప్తంగా మిరప పంట వైరస్ వచ్చిందని మేమేమీ చేయలేమని చేతులెత్తేశారు. అయితే ఈ ఏడాది మరల యూట్యూబ్ సోషల్ మీడియా ప్రచారంతో విస్తృతంగా విత్తనాలను విక్రయిస్తున్నారు.

మామూళ్ల మత్తులో జోగుతున్న వ్యవసాయ శాఖ అధికారులు..

బ్రాండెడ్ కంపెనీల కంటే రెట్టింపు ధరలకు సుజాతనగర్, ఏన్కూరు కేంద్రాలుగా మిరప విత్తనాలను విక్రయిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. సుజాతనగర్, ఏన్కూరు మండల వ్యవసాయ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని విమర్శలను వస్తున్నాయి. ఒక లాట్ నెంబర్ కు జీవోటీని తీసుకువచ్చి ఆ జీవోటీ నెంబర్ పైనే వేలాది ప్యాకెట్లను విక్రయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఈ విత్తనాలు వేసి రైతులు నష్టపోయిన విషయం వ్యవసాయ అధికారులకు తెలిసినప్పటికీ కనీసం పట్టించుకోకుండా డీలర్లు ఇచ్చే మామూళ్లకు మోకరిల్లుతున్నారని విమర్శలు వస్తున్నాయి.

వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం అవినీతి వల్ల అమాయకులైన రైతులు విత్తన కంపెనీల డీలర్ల వద్ద మోసపోతూనే ఉన్నారు. ఈ విషయమై ఏన్కూరు మండలం వ్యవసాయ అధికారి నరసింహారావును దిశ వివరణ కోరగా గతంలో కొన్ని కంపెనీల విత్తనాల వల్ల సమస్య వచ్చిన విషయం వాస్తవమే అన్నారు. ఏన్కూర్ లోని ఒక దుకాణంలో విక్రయిస్తున్న కొన్ని రకాల మిరప విత్తనాలను సేకరించి మొలక శాతం కోసం పంపామని వివరణ ఇచ్చారు. ఇప్పటికైనా రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ స్పందించి తప్పుడు ప్రచారంతో మిరప విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story