టికెట్ కేటాయించకపోవడంపై అసంతృప్తి లేదు

by Sridhar Babu |   ( Updated:2023-08-23 10:14:11.0  )
టికెట్ కేటాయించకపోవడంపై అసంతృప్తి లేదు
X

దిశ, వైరా : టికెట్ కేటాయించకపోవడంపై అసంతృప్తి లేదని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. 2018 ఎన్నికల్లో తాను వైరా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందటం చరిత్ర అయితే, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిత్వం తనకు ఖరారు కాకపోవటం కూడా చరిత్రేనని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. వైరా లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నియోజకవర్గస్థాయి నాయకులు, ముఖ్య కార్యకర్తలు ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ తనకు టిక్కెట్ వస్తుందని చివరి వరకు ఆశపడ్డానని చెప్పారు. తనకు టికెట్ కేటాయించకపోయినా ఎలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ తనను తిట్టినా, నెట్టినా ఆయన ఫోల్డర్ లోనే ఉంటానని అందులో ఎటువంటి అతిశయోక్తి లేదని నర్మగర్భంగా ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి కేసీఆర్ దగ్గరకు వెళ్లిన తాను మెడలో వేసిన గులాబీ కండువాను మాత్రమే ఆశించానని, తెల్ల కాగితాన్ని కూడా తీసుకోలేదని చెప్పారు. శక్తికి మించి నియోజకవర్గ అభివృద్ధికి సంక్షేమ పథకాల అమలుకు తాను చేసిన పని బయట ప్రపంచానికి కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ముందు తాను ఎంత అని..... ఆయనకు అభిమాని అయిన తనకు అతీతమైన శక్తుల్లేవన్నారు. తనపై కేసీఆర్ కరుణ ఎప్పుడైనా కలగవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. తన గిరిజన జాతికి 10 శాతం రిజర్వేషన్ కల్పించిన మహానుభావుడు కేసీఆర్ అని కొనియాడారు. తనకు టిక్కెట్ రాకపోతే ఏమవుతది తెలంగాణ అభివృద్ధి ఆగదు కదా అని అభిప్రాయపడ్డారు. 2014 తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. టికెట్ కోసం చివరి ప్రయత్నం చేసేందుకు కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తనకు గాడ్ ఫాదర్ లా వ్యవహరించిన నాయకులు కూడా ఆ అవకాశం కల్పించలేకపోయారని ఆయన మనోవేధనను వెల్లబుచ్చారు. కొన్ని క్షుద్ర శక్తులు ఉంటాయని, అవి తాత్కాలికమేననని, ఇవన్నీ కేసీఆర్ ముందు ఎంతో కాలం నిలవలేవని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ దిశా నిర్దేశాన్ని తూచా తప్పకుండా పాటిస్తానని స్పష్టం చేశారు. తనకు వేరే ఆలోచన ఏమీ లేదని స్పష్టం చేశారు. భగవంతుడు కంటే సీఎం కేసీఆర్ గొప్ప అని పొగడ్తలతో ముంచేత్తారు. వైరా నియోజకవర్గంలో పార్టీని గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ పార్టీ అభివృద్ధి కోసం పని చేసి కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రి చేసేంతవరకు శక్తి వంచన లేకుండా పనిచేయాలని నాయకులు, కార్యకర్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైరా మున్సిపల్ వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు,

వైరా మార్కెట్ చైర్మన్ బీడీకే రత్నం, జిల్లా దిశా కమిటీ సభ్యులు కట్టా కృష్ణార్జున రావు, జిల్లా నాయకులు పోట్ల శ్రీనివాసరావు, మచ్చా వెంకటేశ్వరరావు (బుజ్జి), కొణిజర్ల మండల అధ్యక్షులు వై.చిరంజీవి, కారేపల్లి మండల అధ్యక్షులు ఉమాశంకర్ ,జూలూరుపాడు మండల అధ్యక్షులు పొన్నెకంటి సతీష్ ,ఏనుకూరు మండల అధ్యక్షులు బానోతు సురేష్, వైరా మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, వైరా పట్టణ అధ్యక్షులు మద్దెల రవి, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు షేక్ లాల్ మొహమ్మద్, వైరా పట్టణ మహిళా అధ్యక్షురాలు బానోతు సక్కుబాయి, వైరా ఎంపీపీ వేల్పులు పావని, జూలూరుపాడు ఎంపీపీ లావుడియా సోనీ ,కారేపల్లి ఎంపీపీ మాలోతి శకుంతల, వైరా జెడ్పీటీసీ నంబూరి కనకదుర్గ , మున్సిపాలిటీ కౌన్సిలర్స్, ఐదు మండలాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, పార్టీ శ్రేణులు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed