వైరా సీఎం సభలో ప్రోటోకాల్ ముసలం

by Aamani |   ( Updated:2024-08-16 14:54:57.0  )
వైరా సీఎం సభలో ప్రోటోకాల్ ముసలం
X

దిశ, వైరా : వైరాలో గురువారం నిర్వహించిన సీఎం బహిరంగ సభ సాక్షిగా ప్రోటోకాల్ ముసలం నెలకొంది. ఈ సభకు వైరా మున్సిపాలిటీలోని కౌన్సిలర్ లకు స్టేజి పాసులు ఇవ్వకపోవడంతో ప్రస్తుత వివాదానికి కారణమైంది. తమకు స్టేజి పాసులు ఇవ్వకపోవడం పట్ల అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు అందరూ ఏకమై రగిలిపోతున్నారు. ఈ సభకు ప్రోటోకాల్ ఉన్నవారికి స్టేజీ పాసులు ఇవ్వకుండా ప్రోటోకాల్ లేని చోటా, మోటా నాయకులకు పాసులు ఇవ్వడం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనియాంశమైంది. మున్సిపాలిటీ నుంచి కేవలం వైరా మున్సిపాలిటీ చైర్మన్ సూతకాని జైపాల్ కు మాత్రమే స్టేజి పాస్ మంజూరు చేశారు. వైరా మున్సిపాలిటీలో మొత్తం 20 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో 11 మంది కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. మరో 9 మంది కౌన్సిలర్లు బిఆర్ఎస్ లో ఉన్నారు.

అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం సభకు తమ పార్టీ కౌన్సిలర్లతో పాటు బీఆర్ఎస్ కౌన్సిలర్లకు కూడా స్టేజి పాసులు మంజూరు చేయలేదు. దీంతో సభ వేదిక వద్దకు వెళ్లిన కొంతమంది కౌన్సిలర్లకు చేదు అనుభవం ఎదురైంది. వైరా ఎమ్మెల్యే తమకు స్టేజి పాసులు ఇప్పించే విషయాన్ని కనీసం పట్టించుకోలేదని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది కౌన్సిలర్ల సీఎం సభ పాసులు అమ్ముకున్నారని బహిరంగంగా వ్యాఖ్యానించడం విశేషం . ప్రోటోకాల్ లేని వ్యక్తులకు, ఇటీవల పార్టీలో చేరి హడావుడి చేస్తున్న వారికి స్టేజి పాసులు ఇవ్వటం ఏమిటని కౌన్సిలర్లు ప్రశ్నిస్తున్నారు. మాజీ ప్రజా ప్రతినిధులు, గల్లీ కార్యకర్తలకు కూడా పాసులు ఇచ్చారని కౌన్సిలర్లు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే సీఎం సభ విజయవంతం కావడంతో కృతజ్ఞతలు చెప్పేందుకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి వైరా మున్సిపాలిటీలోని కౌన్సిలర్లను ఆహ్వానించారు. అయితే తాము ఈ సమావేశానికి వచ్చే ప్రసక్తే లేదని పలువురు కౌన్సిలర్లు తేల్చి చెప్పారు. ఒకరిద్దరూ కౌన్సిలర్లు ఈ సమావేశానికి హాజరయ్యేందుకు క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అయితే మిగిలిన కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించిన విషయాన్ని తెలుసుకొని ఆ ఒక్కరిద్దరూ కౌన్సిలర్లు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం సీఎం సభ స్టేజి పాసుల ప్రోటోకాల్ రగడ వివాదం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారనుంది. కొంతమంది కౌన్సిలర్లు ఏకంగా పాసులు అమ్ముకున్నారని బహిరంగంగా విమర్శిస్తుండటం పార్టీకి ప్రతిబంధకంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికైనా పార్టీ నాయకులు ఈ వివాదాన్ని సద్దుమణిగేలా వైరా మున్సిపాలిటీ కౌన్సిలర్లను బుజ్జగిస్తారో.... లేదో వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story