రిజిస్టర్ కార్యాలయంలో కొనసాగుతున్న వసూళ్ల దందా.. జాడ లేని టాస్క్ ఫోర్స్ అధికారులు

by Aamani |
రిజిస్టర్ కార్యాలయంలో కొనసాగుతున్న వసూళ్ల దందా.. జాడ లేని టాస్క్ ఫోర్స్ అధికారులు
X

దిశ, వైరా : వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమ వసూళ్ల దందా కొనసాగుతూనే ఉంది. ఈ కార్యాలయంలో ప్రతి పనికి డాక్యుమెంట్ రైటర్లను మధ్యవర్తులుగా పెట్టి ఓ అధికారి అందిన కాడికి దండుకుంటున్నారు. అయితే ప్రభుత్వ వ్యవస్థలో ఒకటైన టాస్క్ ఫోర్స్ అధికారులు ఈ కార్యాలయం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. గత నాలుగు నెలల క్రితం వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి అక్రమాలపై దిశ వెబ్సైట్, దిన పత్రిక లో పలు వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో స్పందించిన సీపీ వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పై నిఘా పెట్టాలని టాస్క్ ఫోర్స్ అధికారులను ఆదేశించారు. అయితే అప్పట్లో టాస్క్ ఫోర్స్ అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. అంతవరకు బాగా ఉన్నప్పటికీ ప్రస్తుతం కొనసాగుతున్న అక్రమ వసూళ్ల గురించి నిఘా వ్యవస్థలు కనీసం పట్టించుకోవడం లేదు.

ప్రభుత్వానికి నిబంధనల ప్రకారం చలానాలు కట్టి అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా తీసుకు వస్తున్నప్పటికీ ఇక్కడ ఓ అధికారి ప్రతి పనికి ఓ రేటును నిర్ణయించి నగదు వసూలు చేస్తున్నారు. ఒక్కో ఇంటి రిజిస్ట్రేషన్ కి రూ. 7000, ప్లాట్ రిజిస్ట్రేషన్ కి రూ. 2000, చివరకు మ్యారేజ్ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ కు రూ. 1500 వసూలు చేస్తున్నారు. చివరకు బ్యాంకులకు అవసరమైన మార్ట్ గేజ్ లు కూడా వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వచ్చిన వారి నుంచి డాక్యుమెంట్ రైటర్లు ఈ నగదును వసూలు చేస్తున్నారు. ఇలా వసూలు చేసిన నగదును ప్రతిరోజు సాయంత్రం ఓ డాక్యుమెంట్ రైటర్ వద్ద పనిచేసే ప్రైవేటు వ్యక్తి తీసుకొని ఆ నగదును ఓ అధికారికి అందిస్తున్నారు. గత నాలుగు నెలల క్రితం వరకు డాక్యుమెంట్ రైటర్ల వద్ద నుంచి అధికారులే నేరుగా ఈ నగదును తీసుకునేవారు.

గతంలో దిశలో వార్తా కథనాలు రావడంతో అధికారుల అప్రమత్తమై ఓ ప్రైవేటు వ్యక్తి ద్వారా డాక్యుమెంట్ రైటర్ల వద్ద నగదును వసూలు చేయించి తమ వద్దకు ఆ నగదు తెప్పించుకుంటున్నారు. ఈ వ్యవహారంలో ఆ ప్రైవేటు వ్యక్తి కీలకపాత్ర పోషిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా ఉందని తెలిసే ప్రైవేటు వ్యక్తి ద్వారా ఈ నగదును వసూలు చేస్తున్నారని సమాచారం. అంతేకాకుండా మరోవైపు ఇక్కడ పనిచేసే అధికారి తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ కార్యాలయంలో సిబ్బంది సమయపాలన కూడా పాటించడం లేదు. ఇప్పటికైనా టాస్క్ ఫోర్స్ అధికారులు వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమ వసూళ్ల పై నిఘా పెట్టి అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed