అవిశ్వాసం అటకెక్కినట్లేనా..?

by Mahesh |   ( Updated:2023-02-13 08:33:48.0  )
అవిశ్వాసం అటకెక్కినట్లేనా..?
X

దిశ, వైరా: తాము ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందన్నట్లు ఉంది...వైరా మున్సిపాలిటీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలనే అంశం. అవిశ్వాసం తీర్మానం కి వెళ్తే కొసరు కంటే అసలకు ఎసరు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం సంగతి దేవుడెరుగు... అవిశ్వాసం ప్రవేశపెడితే వైరా మున్సిపాలిటీలోని కౌన్సిలర్లు చెల్లాచెదురయ్యారు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకు ఓ సామాజిక వర్గం కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రవేశపెడితే తమ సామాజిక వర్గానికి వైస్ చైర్మన్ పదవి కావాలని డిమాండ్ చేస్తుండటం కారణం.

ఈ అంశం ప్రస్తుతం బీఆర్ఎస్ శ్రేణులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. వైరా మున్సిపాలిటీలో మొత్తం 20 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో చైర్మన్ అభ్యర్థి తో పాటు కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు కౌన్సిలర్లను మినహాయిస్తే మిగిలిన 17 మంది కౌన్సిలర్లు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా... అవిశ్వాసం ప్రవేశపెడితే ప్లాన్ ఏ లో భాగంగా మున్సిపాలిటీ చైర్మన్ ను గద్దె దింపేందుకు కౌన్సిలర్లు సిద్ధంగా ఉన్నారు.

అయితే కౌన్సిలర్లు తమ ప్లాన్ బి ప్రకారం చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ కూడా పదవి నుంచి తొలగించాలని పట్టుబడుతున్నారు. వైస్ చైర్మన్ కూడా బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. ఇలాంటి రాజకీయ సంక్షోభ సమయంలో సొంత పార్టీ వైస్ చైర్మన్ ను తొలగించడం బీఆర్ఎస్ కు అంత తేలికైన వ్యవహారం కాదు.

అవిశ్వాసం అమలు అంత సులువు కాదేమో....

వైరా మున్సిపాలిటీ చైర్మన్ గా ఉన్న సూతకాని జైపాల్ బీఆర్ఎస్ పార్టీ ను వీడి ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గంలో చేరారు. దీంతో ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడతారని గత కొన్ని రోజులుగా వైరాలో తీవ్ర చర్చ జరుగుతుంది. ఇటీవల వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కౌన్సిలర్లు పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహించి అవిశ్వాసం ప్రవేశపెడితే తాము టీఆర్ఎస్ వైపే ఉండేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కౌన్సిలర్ల ప్రకటనతో రేపో మాపో అవిశ్వాసం ప్రవేశపెట్టడం ఖాయమనే సంకేతాలు వచ్చాయి.

అయితే ఆదివారం జరిగిన పరిణామాలు ఈ సంకేతాలను నీరుగార్చే విధంగా ఉన్నాయి. వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యేకు సంబంధించిన రక్తసంబంధీకుడు, కేంద్ర ప్రభుత్వ అధికారి బీఆర్ఎస్ కౌన్సిలర్లతో ప్రత్యేక అంతరంగిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన ఒక్కో కౌన్సిలర్‌తో ఏకాంతంగా మాట్లాడారు.

ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు వైరా మున్సిపాలిటీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే విషయమై ఆయనతో చర్చించారు. ఈ చర్చల సందర్భంగా అవిశ్వాస తీర్మానం పెడితే కమ్మ సామాజిక వర్గానికి వైస్ చైర్మన్ ఇవ్వాలని కొంతమంది కౌన్సిలర్లు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. మండలంలో కమ్మ సామాజిక వర్గానికి పదవుల్లో కనీస గౌరవం లేదని ఆ కౌన్సిలర్లు తమ ఆవేదనను ఆయన ముందు వెల్లబుచ్చారు. దీంతో ఆలోచనలో పడిన ఆయన చైర్మన్ జైపాల్ స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేస్తారేమో వేచి చూద్దామని చెప్పినట్లు తెలిసింది.

అలాకాని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ నిర్ణయిస్తే అవిశ్వాసం ప్రవేశపెడతామని ఆయన పేర్కొన్నారు. అవిశ్వాసం ప్రవేశపెట్టే ఆలోచన ఉన్నప్పుడు వైస్ చైర్మన్ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు వైరాలో ప్రచారం జరుగుతుంది. ఇదే జరిగితే ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్న కౌన్సిలర్లు చెట్టుకొకరు.. పుట్టకొకరుగా చెల్లా చెదురయ్యే అవకాశం ఉంది. దీంతో వైరా మున్సిపాలిటీ లో అవిశ్వాస తీర్మానం అంత ఆషామాషీగా ఉండదనే అభిప్రాయాలు తెరపైకి వస్తున్నాయి.

మంత్రి, ఎమ్మెల్సీ తో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కు అత్యంత సన్నిహిత సంబంధాలు...

వైరా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీతారాములుకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత మధు తో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుత రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆయా నేతలు సీతారాములుతో మరింత అటాచ్మెంట్ పెంచుకున్నారు. మంత్రి, ఎమ్మెల్సీ అండ ఉన్న ముళ్లపాటి సీతారాములు ను వైస్ చైర్మన్ పదవి నుంచి తొలగించడం సాహసోపేత నిర్ణయం అవుతుందని చెప్పవచ్చు.

ఇలాంటి సంకట పరిస్థితుల్లో వైస్ చైర్మన్ మార్పిడి కౌన్సిలర్ల మనోగతం ప్రకారం జరుగుతుందా అనే అంశం వెయ్యి డాలర్ల ప్రశ్నగానే మారుతుంది. అందువల్ల బీఆర్ఎస్ పార్టీ ఇప్పటిలో వైరా మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టేందుకు సాహసించదనేది రాజకీయ విశ్లేషకులు అంచనా... ఇన్ని ప్రతి బంధకాల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే వైస్ చైర్మన్ విషయంలో కౌన్సిలర్ల మధ్య భేదాభిప్రాయాలు వచ్చి ఆ అవిశ్వాస తీర్మానం వీగిపోయే అవకాశం కూడా లేకపోలేదు. అందువల్ల బీఆర్ఎస్ పార్టీ అవిశ్వాస తీర్మానం వ్యవహారాన్ని సున్నితంగా తోసిపుచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.

Advertisement

Next Story