వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో కలిసి పని చేస్తాం: తమ్మినేని వీరభద్రం

by S Gopi |   ( Updated:2023-03-22 08:45:15.0  )
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో కలిసి పని చేస్తాం: తమ్మినేని వీరభద్రం
X

దిశ, వైరా: "వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ తో కలిసి సీపీఎం, సీపీఐ పనిచేస్తాయి... ఈ మేరకు ఇప్పటికే సీపీఎం, సీపీఐ అగ్ర నాయకత్వం సమావేశాన్ని నిర్వహించి కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ తో సీపీఎం, సీపీఐ పోటీ చేసే స్థానాలపై ఇప్పటివరకు చర్చించలేదు. అయితే సీపీఎం పోటీ చేయాలనుకునే స్థానాలను సీపీఐ అడగదు... సీపీఐ కోరుకునే స్థానాలను సీపీఎం అడగొద్దని నిర్ణయించుకున్నాం.... ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి బీజేపీ పార్టీని ఎదిరించే ధైర్యం లేదు... ఒకే దేశం, ఒకే భాష, ఒకే పన్ను, ఒకే ఎన్నిక అని ప్రకటించే బీజేపీ ప్రభుత్వం దేశంలో ఒకే కులం ఉండాలని ఎందుకు కోరుకోవటం లేదని" సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ, కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న జన చైతన్య యాత్ర బుధవారం వైరాకు చేరుకుంది.

ఈ సందర్భంగా వైరాలోని మధిర క్రాస్ రోడ్ లో సీపీఎం నాయకులు బొంతు రాంబాబు అధ్యక్షతన జరిగిన సభలో తమ్మినేని వీరభద్రం ప్రసంగించారు. బీజేపీ దేవుళ్లను అడ్డుగా పెట్టుకుని దేశంలో మత, కుల చిచ్చును రేపుతుందని విమర్శించారు. ఒకే దేశం, ఒకే భాష, ఒకే పన్ను, ఒకే ఎన్నిక ఉండాలని ప్రకటించే బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒకే కులం ఉండాలని ఎందుకు కోరుకోవటం లేదని ప్రశ్నించారు. దేశంలో కుల వ్యవస్థను పున ప్రతిష్టించాలని బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అగ్రవర్ణాల అధిపత్యమే బీజేపీ సిద్ధాంతమని మండిపడ్డారు. దేశంలో బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తప్పు పడుతున్న బీజేపీ అగ్రవర్ణాల రాజ్యాంగాన్ని అమలు చేయాలనే దురుద్దేశంతో ఉందన్నారు. మరోసారి బీజేపీ దేశంలో అధికారంలోకి వస్తే ఘర్షణలు మరింత పెరిగి దేశం పూర్తిగా నాశనం అవుతుందని హెచ్చరించారు.

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి బీజేపీ పార్టీని ఎదురించే ధైర్యం లేదన్నారు. ఆయనపై కేసులు ఉండటంతో కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ పార్టీకి జగన్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ కుమార్తెతోపాటు, రాష్ట్ర మంత్రులపై ఈడీ, సీబీఐ దాడులు చేస్తున్నా కేసీఆర్ మాత్రం బీజేపీపై పోరాడుతున్నారని స్పష్టం చేశారు. బీజేపీని వ్యతిరేకిస్తున్న సీఎం కేసీఆర్ కు ఆయన సభాపూర్వకంగా అభినందనలు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు, బీజేపీ ఓటమి ఎర్రజెండా పుణ్యమే అని ప్రతి ఒక్కరికి తెలుసునన్నారు. వచ్చే ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ పార్టీలు బీఆర్ఎస్ తో కలిసి పని చేస్తాయని మరోసారి స్పష్టం చేశారు. పొత్తుల్లో భాగంగా సీపీఎం అడిగే స్థానాలను సీపీఐ అడగకూడదని, సీపీఐ కోరుకునే స్థానాలను సీపీఎం అడగవద్దని, ఇప్పటికే ఓ స్పష్టమైన నిర్ణయానికి వచ్చామని పేర్కొన్నారు. ఈ మేరకు సీపీఐ, సీపీఎం అగ్ర నాయకత్వం ప్రత్యేక సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుందని వివరించారు.

అయితే బీఆర్ఎస్ పార్టీ సీపీఎం, సీపీఐ పార్టీలకు కేటాయించే సీట్లపై ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. సీట్ల కేటాయింపు వల్ల బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ ఇబ్బందులు జరగకూడదనే ఉద్దేశంతో ఆ పార్టీ కొంతకాలం వేచి చూసే ధోరణిలో ఉందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉండే అంశంతోపాటు ప్రజా సమస్యల పరిష్కారంలో బీఆర్ఎస్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ పార్టీపై కూడా పోరాటాలు చేసేందుకు సీపీఎం సిద్ధంగా ఉందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓ నాయకుడు జంక్షన్లో ఉన్నాడని పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆయన పరోక్షంగా విమర్శించారు. జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు స్నేహపూర్వక వాతావరణంలో పనిచేసుకుంటున్నాయని చెప్పారు. ద్వేషపూరిత వాతావరణంలో ఉన్న బీజేపీ పార్టీలో ఆ నాయకుడు చేరి జిల్లాకు నష్టం చేయొద్దని హితువు పలికారు. సీపీఎం జనచైతన్య యాత్రకు వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, సీపీఐ నాయకులు ఎర్రబాబు, యామాల గోపాలరావులు తమ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్ రావు, నున్న నాగేశ్వరరావు, కళ్యాణం వెంకటేశ్వరరావు, సాయిబాబా, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి, నియోజకవర్గ నాయకులు భూక్యా వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed