వందేళ్లకు చేరువలో నిజాంలు నిర్మించిన వైరా రిజర్వాయర్

by S Gopi |
వందేళ్లకు చేరువలో నిజాంలు నిర్మించిన వైరా రిజర్వాయర్
X

దిశ, వైరా: ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగునీటి ప్రాజెక్టులోనే అత్యంత చరిత్ర ఉన్న వైరా రిజర్వాయర్ శత వసంతాలకు చేరువైంది. 1923లో రంజాన్ మాసంలో నైజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ సారథ్యంలో సాహెబ్ జాదా నవాబ్ అలావత్ జంగ్ బహుదూర్ వైరా రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిజాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ నవాబ్ అలీ జంగ్ బహుదూర్ పర్యవేక్షణలో వైరా రిజర్వాయర్ నిర్మాణం సాగింది. ఇక్కడ కుడి, ఎడమ కాలువలను నిర్మించేందుకు సుమారు ఏడేళ్లు పట్టింది. 1930లో కుడి, ఎడమ కాలువల ద్వారా సాగు నీటిని విడుదల చేశారు. వైరా రిజర్వాయర్ నిర్మాణాన్ని అప్పట్లోనే రూ. 35,90,276 నిధులతో పూర్తి చేశారు. మొత్తం 17,390 ఎకరాలను స్థిరీకరణ ఆయకట్టుగా నిర్ధారించారు. మొత్తం 274 చదరపు మైళ్ల భూమి ముంపునకు గురైంది. 142చదరపు మైళ్లు ప్రభుత్వ భూమి కాగా , 132 చదరపు మైళ్లు రైతుల నుంచి సేకరించారు. అందుకు పరిహారంగా రూ.3,14,073 లు చెల్లించారు. పూర్తి స్థాయి నీటి మట్టం 18.3 అడుగులతో 60 వేల క్యూసెక్కుల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించారు. పటిష్ఠమైన మూడు అలుగు (మత్తడి)లను రిజర్వాయర్ సమీపంలోని గుట్టలను ఆధారం చేసుకుని నిర్మించారు. ఆనకట్ట పొడవు 5,800 అడుగులు కాగా ఎత్తు 88 అడుగులు. సుమారు 100 ఏళ్లలో తుఫాన్లు, అధిక, భారీ వర్షాలతో భారీ వరదలు వచ్చినా చెక్కు చెదరని నిర్మాణంగా నేటికీ విరాజిల్లుతుంది.

రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువల్లో సుమారు 20 కిలో మీటర్ల దూరం సాగు నీరు ప్రవహిస్తుంది. రిజర్వాయర్ ఆయకట్టు క్రమక్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 25 వేల ఎకరాలకు చేరింది. దీంతో బీడు భూములు సైతం ప్రస్తుతం మెట్ట భూములుగా మారాయి. రిజర్వాయర్ అలుగు వాగైన వైరా నది సుమారు 45 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. వైరా నదికి అనుసంధానంగా ప్రభుత్వాలు లెఫ్ట్ ఇరిగేషన్లను ఏర్పాటు చేశాయి. వైరా మండలంలో ఎడమ కాల్వ పరిధిలో చివరి గ్రామంగా ఉన్న దాచాపురంలో మొదట లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించారు. తర్వాత పుణ్యపురంలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మించారు. ఇటీవల వైరా నదిపై పుణ్యపురం, గరికపాడు గ్రామాల్లో చెక్ డ్యామ్ల నిర్మాణాలను పూర్తి చేశారు.

వైరా రిజర్వాయర్ ఈ ప్రాంత రైతుల కల్పతరువుగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైరా రిజర్వాయర్ వద్ద నిర్మించిన మిషన్ భగీరథతో జిల్లాలోని 12 మండలాలకు మంచినీటిని సరఫరా చేస్తున్నారు. రిజర్వాయర్ ఆనకట్ట కొంత భాగం కుంగిపోతూ అధికారులను, ఆయకట్టు రైతులను ఆందోళనకు గురిచేసింది. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ రిజర్వాయర్ ఆధారంగానే మత్స్య సహకార సంస్థ, చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం, వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి నీరు సరఫరా అవుతుంది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బోట్ షికారు నిర్వహిస్తున్నారు. నిర్వాహణ లోపంతో ఈ పర్యాటక కేంద్రం అధ్వానంగా మారడంతో సందర్శకుల సంఖ్య తీవ్రంగా తగ్గింది. ప్రస్తుతం ఆనకట్టపై సోలార్ లైటింగ్ ఏర్పాటు చేశారు. విజిటర్స్ ఆట విడుపుగా కూర్చునేందుకు బెంచీలు ఏర్పాటు చేశారు. ఇన్ని అవకాశాలు, వనరులు ఉన్న వైరా రిజర్వాయర్ వందేళ్లలో కొంతపూడి పోవడం, చెరువు శిఖం కబ్జాకు గురి అవుతున్నది. ఈ రిజర్వాయర్ నిర్వహణ సక్రమంగా కొనసాగితే భవిష్యత్ తరాలకు సాగునీటి వనరుల కేంద్రంగా వర్ధిల్లుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.

Advertisement

Next Story