నిరుపయోగంగా క్రీడాప్రాంగణాలు

by S Gopi |   ( Updated:2023-03-24 04:45:40.0  )
నిరుపయోగంగా క్రీడాప్రాంగణాలు
X

దిశ, ముదిగొండ: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఆర్భాటంగా మొదలుపెట్టిన క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారి వెలవెలబోతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో యువతకు క్రీడ నైపుణ్యాలు పెంపొందించేందుకు గొప్పలు చెప్పి ఏర్పాటు చేసిన ప్రాంగణాలు ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయి. ముదిగొండ మండల పరిధిలో 25గ్రామాలు, ఐదు అమ్లెట్ గ్రామాలు ఉండగా 15గ్రామాలలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. గ్రౌండ్‌లో మొత్తం మీద రెండు గుంజలు, రెండు ఇనుప రాడ్లు, రెండు ఉయ్యాలతోనే సరిపెట్టారు. కానీ అధికార ప్రజాప్రతినిధులు మాత్రం క్రీడా ప్రాంగణం సకల వసతులతో ఏర్పాటు చేశామని డబ్బా కొట్టారనే విమర్శలు వస్తున్నాయి. ఇక్కడి క్రీడా ప్రాంగణాలలో కనీస వసతులు లేకపోవడంతో అవి ప్రస్తుతం నిరూపయోగంగా మారాయి. చాలా వరకు ఊరికి ఆమడ దూరంలో ఉన్నాయి. దీంతో అటువైపు కన్నెత్తి చూసేవారు లేకుండా పోయారు. వారానికి ఒకసారైనా గేటు తాళం తీయడం లేదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా పది గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఊసే ఎత్తడం లేదు.

నామమాత్రంగానే..

గ్రౌండ్‌లో కోర్టులు ఏర్పాటు చేయలేదు. క్రీడాసామాగ్రి అందుబాటులో లేదు. రన్నింగ్, వాకింగ్ చేసేవారికి ప్రత్యేక ట్రాకులు ఏర్పాటు లేదు. వ్యాయామానికి సంబంధించిన పరికరాలు అందుబాటులో లేదు. కేవలం రెండు గుంజలు పాతి, ఒక నెట్ కట్టి వాలీబాల్, షటిల్ కోర్ట్ అంటున్నారు. మొన్నటివరకు పోలీస్ అభ్యర్థులకు ఈవెంట్స్ జరిగిన విషయం తెలిసిందే. ఇక్కడి క్రీడా ప్రాంగణాలను సరైన ఏర్పాటు చేస్తే వారికి ఎంత కోంత ఉపయోగం ఉండేది. కనీస సౌకర్యాలు లేకపోవడంతో స్థానిక యువత రూ. వేలకు వేలు పెట్టి కోచింగ్‌లు తీసుకున్నారు. ఇక కొన్ని క్రీడాప్రాంగణాలకు ప్రహరీ గోడ, ఫెన్సింగ్ లేకపోవడంతో గేదలు, మేకలకు ఆవాసాలుగా మారాయి. మందు బాబులకు అడ్డాగా మారాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి క్రీడా ప్రాంగణాలలో సౌకర్యాలు మెరుగుపరిచి అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి: రసవత్తరంగా మిర్యాలగూడ పాలిటిక్స్.. ఎమ్మెల్యే సీటుపై నో క్లారిటీ!

Advertisement

Next Story

Most Viewed