యదేచ్చగా మట్టి దందా.. పట్టించుకోని మైనింగ్ శాఖ..

by Sumithra |
యదేచ్చగా మట్టి దందా.. పట్టించుకోని మైనింగ్ శాఖ..
X

దిశ, దమ్మపేట : మండలంలో ఎక్కడి నుండి అయినా మట్టి తరలించుకపోవాలన్న అనుమతులు అవసరం లేదా! మండలంలో అక్రమంగా మట్టి తరలించుకపోతున్న పట్టించుకునే అధికారులు కరువయ్యారా ! పేదవాడికి మట్టి కావాలంటే ఎన్నో ఆంక్షలు పెట్టే అధికారులు, దళారులకు కాంట్రాక్టర్లకు పర్మిషన్ తీసుకోకపోయిన ఎందుకు స్వేచ్ఛగా వదిలేస్తున్నారు ! ఇష్టానుసారంగా ఎవరికి అందినంతవారు ప్రభుత్వ స్థలాల్లో ప్రవేట్ స్థలాల్లో రహదారుల పక్కనే పెద్ద పెద్ద జేసీబీల సహాయంతో మట్టి తరలించకపోతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు ! మండలంలో జరుగుతున్న మట్టి దందాపై దిశ ప్రత్యేక కథనం.

మండలంలో మట్టి దందా యదేచ్చగా సాగుతుంది. ఏటువంటి అనుమతి లేకుండా ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో రాత్రి పగలు అనే తేడా లేకుండా దళారులు, కాంట్రాక్టర్లు మట్టిని తరలించకపోతున్నారు. అక్రమ రవాణా అడ్డుకోవాల్సిన మైనింగ్ శాఖ అధికారులు అసలు అటువైపే కన్నెత్తి చూడకుండా, తమ బాధ్యత కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మండలంలోని దమ్మపేట, పెద్ద గొల్లగూడెం, అప్పారావుపేట, మందలపల్లి, ముష్టిబండ, మారప్పగూడెం, జలవాగు తదితర గ్రామాల నుండి ట్రాక్టర్లతో, ట్రిప్పర్లతో మట్టి తరలించకపోతు లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామాల్లో పేద ప్రజలకు పిడికెడు మట్టి కావాలంటే ఎన్నో ఆంక్షలు పెట్టే అధికారులు దళారులు, కాంట్రాక్టర్లలు రోజుకు లక్షల రూపాయల మట్టిని మండలంలో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల నుండి తరలించకపోతున్న ఎలాంటి పట్టింపు లేకుండా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పేరుతో అక్కడికి మట్టి తరలించాలనీ పేరు చెబుతూ కమర్షియల్ పనులకు మట్టిని తరలించకపోతున్నారు. మండలంలో రోజుకు వందల వేల ట్రిప్పులు మట్టిని అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ దళారులు కాంట్రాక్టర్లు తమ జేబులు నింపుకుంటున్నారు.

ట్రాక్టర్ ట్రక్కు మట్టి ధర@800

ప్రభుత్వ, ప్రవేట్ స్థలాల్లో మట్టి తరలించకపోతు ఒక ట్రాక్టర్ ట్రక్కు మట్టి ధర 800 రూపాయలుగా దళారులు నిర్ణయించారు. తాము చెప్పిన ధర చెల్లించాల్సిందేనని కలరింగ్ ఇస్తూ ఇందులో తమేకే కాకుండా అధికారులకు, స్థానిక నాయకులకు, తాము కూడా వారికి కొంత మొత్తంలో చెల్లించాలని, లేకపోతే మట్టి రవాణా మేము చేయలేమని చెపుతూ అధికారులను కూడా మట్టి దందాలో భాగస్వాములుగా చేరుస్తూ మట్టి రవాణా సాగిస్తున్నారు. మండలంలో సామాన్య ప్రజలు తమ ఇంటి పునాదుల్లో మట్టి తోలుకోవాలంటే లక్షల్లో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటు పేద ప్రజల కష్టాన్ని దోచుకుంటూ, ఆటు ప్రభుత్వం ఆదాయానికి కూడా గండి కొడుతూ దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

మైనింగ్ శాఖ ఉన్నట్లా.. లేనట్లా?

నర్సరీల పేరుతో మట్టి దందా సాగిస్తున్న చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ గత నాలుగు నెలల క్రితం అనేక ఫిర్యాదులు అందుకున్న జిల్లామైనింగ్ శాఖ అధికారులు పలువురు పైన కేసులు నమోదు చేశారు. అయినప్పటికీ కాంట్రాక్టర్లు, దళారులు తీరులో ఎలాంటి మార్పులు రాలేదు, ఈ దశలో మరోసారి మట్టి దందా గత వారం రోజులుగా యదేచ్చగా సాగుతున్న మైనింగ్ శాఖ అధికారులు మాత్రం ఇటువైపు కూడా కన్నెత్తి చూడలేదు. ఇదే అదునుగా భావించిన దళారులు యదేచ్చగా మట్టిని తరలించకపోయి జేబులు నింపుకున్నారు. ఎన్ని వేల ట్రిప్పులు మట్టి తరలించకపోయినా మైనింగ్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై మైనింగ్ శాఖ పై ప్రజల నుండి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

అతివేగంగా ట్రాక్టర్ల ప్రయాణం.

మట్టి రవాణా జరుగుతున్న సమయంలో డ్రైవర్లు ట్రాక్టర్లను అతివేగంగా నడుపుతున్నారు. ఎక్కువ ట్రిప్పులు తోలుకుంటే ఎక్కువ మొత్తంలో నగదు వస్తుందన్న ఉద్దేశంతో ఏటువంటి నిబంధనలు పాటించకుండా, ట్రాక్టర్ లకు సౌండ్ స్పీకర్లు పెట్టుకొని అతివేగంగా ప్రయత్నిస్తున్నారు. దీని వలన ఆదివారం మట్టి రవాణా జరుగుతున్న సమయంలో మట్టి ట్రాక్టర్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇప్పటికైనా మైనింగ్ శాఖ, రెవిన్యూ శాఖ, పోలీస్ శాఖ స్పందించి మట్టి దందా సాగించిన వారిపై చర్యలు తీసుకొని సామాన్య ప్రజల కోసం మట్టి క్వారీని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story