భూమిలేని పేదలకు ఏడాదికి రూ. 12 వేలు

by Sridhar Babu |
భూమిలేని పేదలకు ఏడాదికి రూ. 12 వేలు
X

దిశ బ్యూరో, ఖమ్మం : ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీల్లో భాగంగా భూమిలేని నిరుపేద కుటుంబాలకు ఈ ఏడాది నేరుగా వారి ఖాతాల్లో 12 వేల రూపాయలు జమ చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మంగళవారం మధిర నియోజకవర్గం చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో దళిత బంధు రెండో విడత లబ్ధిదారులు 847 కుటుంబాలకు 15 కోట్ల 54 లక్షల 32 వేల 620 రూపాయల మంజూరీ పత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిరంకుశ రాచరిక పాలన నుంచి తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామ్య పాలనలోకి వచ్చినందున ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించిందని తెలిపారు. ఈ ప్రకటనను వ్యతిరేకించిన వారు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించినట్టే అవుతుందన్నారు. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పరమ పవిత్రమని, వీటిని గౌరవించే ప్రతి ఒక్కరూ సెప్టెంబర్ 17ను ప్రజా పాలన దినోత్సవంగా స్వాగతించి గౌరవించాలన్నారు.

త్వరలో ఇందిరమ్మ ఇండ్లు..

రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టబోతున్నామని భట్టి చెప్పారు. ఇప్పటికే భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఆరు లక్షల రూపాయలు, ఇతర లబ్ధిదారులకు ఐదు లక్షల రూపాయలను ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తుందన్నారు. సేంద్రియ వ్యవసాయం సాగు ద్వారా రైతులు చేసే ఆహార ఉత్పత్తులను విక్రయించడానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపించి కొనుగోలుదారులతో నేరుగా రైతులకు ఒప్పందం చేయిస్తుందని వెల్లడించారు. మధిర నియోజకవర్గం సిరిపురం గ్రామాన్ని సోలార్ వ్యవసాయ పంపు సెట్ల ఏర్పాటుకు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని తెలిపారు.

సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో స్వయం సహాయక సంఘాల మహిళలను భాగస్వాములు చేసే విధంగా ప్రజాప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందన్నారు. సోలార్ విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడానికి స్వయంసహాయక సంఘాల సభ్యులకు బ్యాంకుల ద్వారా ప్రభుత్వమే రుణాలు ఇప్పిస్తుందని తెలిపారు. మధిర నియోజకవర్గంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు వచ్చే స్వయంసహాయక సంఘాల మహిళలకు సంపూర్ణ సహకారం అందిస్తానని వెల్లడించారు. గత ప్రభుత్వం నెలల తరబడి పెండింగ్లో పెట్టిన ఆసుపత్రి మందుల బిల్లులు, కల్యాణ లక్ష్మి, మధ్యాహ్న భోజనం కార్మికుల గౌరవ వేతనం, హాస్టల్ మెస్ బిల్లుల బకాయిలను ప్రజాప్రభుత్వం క్లియర్ చేసిందని వెల్లడించారు.

మధిర ప్రజలు తలెత్తుకునేలా పరిపాలన చేస్తా

తనకు ఓట్లు వేసి గెలిపించిన మధిర నియోజకవర్గ ప్రజలు తలెత్తుకునే విధంగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నానని చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం ప్రతిక్షణం అంకితభావంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ రాష్ట్ర ప్రజల అవసరాలను తీర్చడానికి సంపద సృష్టించడం, సృష్టించిన సంపదను ప్రజలకు పంచడం కోసమే పని చేస్తానని చెప్పారు. దళితబంధు యూనిట్స్ ను లబ్ధిదారుల నుంచి కొనడానికి వీలులేదని, బెదిరించి తీసుకువెళ్లడం నేరమని గుర్తు చేశారు. లబ్ధిదారులను బెదిరించి తీసుకువెళ్లిన యూనిట్స్ ను తిరిగి తీసుకువచ్చి అప్పగించాల్సిన బాధ్యత స్పెషల్ ఆఫీసర్లు, జిల్లా యంత్రాంగంపై ఉందన్నారు.

Advertisement

Next Story

Most Viewed