నీటి ఎద్దడి నివారణకు అధిక ప్రాధాన్యం

by Sridhar Babu |
నీటి ఎద్దడి నివారణకు అధిక ప్రాధాన్యం
X

దిశ, కొత్తగూడెం రూరల్ : మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో నీటి ఎద్దడి నివారణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. చుంచుపల్లి మండలం నందతండా గ్రామ పంచాయతీ పరిధిలోని హౌసింగ్​బోర్డు కాలనీలో రూ.33 లక్షల ఏడీపీ నిధులతో నందతండా, బృందావనం గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు నిర్మించనున్న వాటర్ ట్యాంకు పనులకు గురువారం ఎమ్మెల్యే కూనంనేని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న గ్రామాలను, బస్తీలను గుర్తించామని, త్వరలో పూర్తిస్థాయిలో సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

పాల్వంచ కొత్తగూడెం పట్టణాలతో పాటు గ్రామపంచాయతీల పరిధిలోని గ్రామాలు ఉన్న మేజర్ మినీ నీటి పథకాలను పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తేవాలని, వినియోగంలో లేని పథకాలకు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తేవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సింగరేణి కార్మికవాడల్లో యాజమాన్యం నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్యాంక్ నిర్మాణాన్ని త్వరితగతిన నాణ్యతతో నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచించారు.

కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు ఎస్కే. సాబీర్ పాషా, అన్నవరపు కనకయ్య ఎంపీడీఓ అశోక్ కుమార్, తహసీల్దార్ కృష్ణ, అధికారులు తిరుమల్, భూమిక, పంచాయతీ ప్రత్యేక అధికారి, స్థానిక నాయకులు వాసిరెడ్డి మురళి, రాంబాబు, పౌల్, గుండు శ్రీను, మహేష్, మాలోత్ మురళి, మంగీలాల్, శ్రీరామ్, రామోజీ, తులసీరామ్, మోహన్ రెడ్డి, మోహన్ రావు, తంబళ్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Advertisement

Next Story