నడిరోడ్డుపై లారీల పార్కింగ్… ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం

by Kalyani |
నడిరోడ్డుపై లారీల పార్కింగ్… ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం
X

దిశ, వైరా : వైరా మండలంలోని సిరిపురం గ్రామ సమీపంలో వైరా - నెమలి ప్రధాన రహదారిపై గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్వాహకులు అత్యధిక లోడుతో ఉన్న లారీలను పార్కింగ్ చేస్తున్నారు. దీంతో ఈ రోడ్డుపై ట్రాఫిక్ కు నిరంతరం తీవ్ర అంతరాయం కలుగుతుంది. గత నెల రోజులుగా నడిరోడ్డుపై లారీలను దర్జాగా పార్కింగ్ చేస్తున్న పట్టించుకునే వారు కరువయ్యారు. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో భాగంగా సిరిపురం గ్రామ సమీపంలో అండర్ గ్రౌండ్ బ్రిడ్జిని నిర్మించారు. ఈ బ్రిడ్జికి ఇరువైపులా రోడ్డు నిర్మించేందుకు అవసరమైన పాండ్ డస్ట్ ని పెద్ద పెద్ద లారీలతో కేటీపీఎస్ నుంచి ఇక్కడకు తోలుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా లారీల్లో సామర్థ్యం కంటే అత్యధిక టన్నులతో ఈ డస్టును ఇక్కడకు తీసుకువస్తున్నారు.

డస్ట్ ను అన్లోడ్ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో నెలరోజులుగా నడిరోడ్డు పై లారీలు పార్కింగ్ చేస్తున్నారు. తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అనుసంధానం చేసే ఈ రోడ్డుపై పదుల సంఖ్యలో లారీలను పార్కింగ్ చేయటంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పార్కింగ్ వల్ల ఎదురెదురుగా వచ్చే వాహనాలు తప్పుకునే పరిస్థితి లేకుండా పోయింది. అత్యధిక లోడుతో లారీలు ప్రయాణించటం వల్ల ఈ రోడ్డు దెబ్బతింటుంది. మరోవైపు ఈ లారీల్లో నుంచి డస్ట్ రోడ్డుపై పడి ప్రయాణికులకు ప్రాణ సంకటంగా మారుతుంది. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి డస్టు లారీలను నడి రోడ్డుపై పార్కింగ్ చేయకుండా తగు చర్యలు తీసుకోవాలని వాహనచోదకులు కోరుతున్నారు.

Advertisement

Next Story