ఇందిరమ్మ ఇళ్లకు నిరుపేదలను మాత్రమే ఎంపిక చేయాలి

by Sridhar Babu |
ఇందిరమ్మ ఇళ్లకు నిరుపేదలను మాత్రమే ఎంపిక చేయాలి
X

దిశ, కూసుమంచి : ప్రజా ప్రభుత్వంలో మంజూరు చేసే ఇందిరమ్మ ఇండ్లకు నిరుపేదలను మాత్రమే ఎంపిక చేయాలని, ఒక్క అనర్హుడిని ఎంపిక చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. కూసుమంచిలోని ఎంఎల్ఏ క్యాంప్ కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజతో కలిసి మంత్రి బుధవారం ఖమ్మం రూరల్ మండలంలో ఉన్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఖమ్మం రూరల్ మండలంలోని పలు గ్రామాలలో ఉన్న సమస్యలను ఆయా గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకొని రాగా మంత్రి అధికారులతో వెంటనే పనులు పూర్తి అయ్యేలా సూచనలు ఇచ్చారు. సంబంధిత పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు పూర్తవుతున్న నేపథ్యంలో నెలాఖరు నాటికి గ్రామాల వారీగా మంజూరు చేయాల్సిన ఇండ్ల జాబితా వస్తుందని, మొదటి దశలో నిరుపేదలను పార్టీలకతీతంగా ఎంపిక చేయాలని సూచించారు. అనర్హులకు ఎవరికైనా ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనట్లు తెలిస్తే ఆ ఇంటిని రద్దు చేయడంతో పాటు సంబంధిత అధికారులను సస్పెండ్ చేస్తామని అన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే పైలట్ ప్రాజెక్టు పూర్తయిందని, నాలుగు, ఐదు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇచ్చేందుకు మార్గదర్శకాలు విడుదల చేస్తామని, ఫ్యామిలీ డిజిటల్ కార్డు ద్వారా రేషన్, పెన్షన్, ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్యశ్రీ, మొదలగు అన్ని సంక్షేమ పథకాలకు ఉపయోగపడుతుందని అన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందవచ్చని అన్నారు. జనవరి ఒకటి నుంచి రేషన్ కార్డుల ద్వారా ప్రభుత్వం సన్న బియ్యం సరఫరా చేస్తుందని మంత్రి తెలిపారు. రైతు రుణమాఫీ పెండింగ్ ఉన్న రూ.13 వేల కోట్లు విడుదల చేయనున్నట్టు తెలిపారు.

ఏ రైతుకు కూడా రుణమాఫీ ఎగ్గొట్టాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తెలిపారు. రైతు రుణమాఫీకి సంబంధించి షెడ్యూల్ విడుదల చేస్తామని, ఆ షెడ్యూల్ ప్రకారం రూ.2 లక్షలకు పైగా రుణాలు ఉన్న వారు పైనున్న రుణాలు చెల్లిస్తే మిగతాది మాఫీ చేస్తామని చెప్పారు. సన్న ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ అందిస్తామని అన్నారు. బయటి ప్రాంతాల నుంచి సన్న వడ్లు మన కొనుగోలు కేంద్రాలకు రాకుండా చూసుకోవాలని సూచించారు. ప్రతివారం మండలంలోని గ్రామాలను ఎంపీడీఓ, తహసీల్దార్ లు తప్పనిసరిగా పరిశీలించాలని, ప్రజలకు ఉన్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఖమ్మం రూరల్ మండలంలో ప్రజలకు అవసరాల మేరకు అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుకు స్థలం గుర్తించాలని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా చేసే అవకాశం ఉన్న చోట నీరు సరఫరా చేయాలని, లేని పక్షంలో స్థానికంగా ఉన్న వనరులను సమకూర్చుకొని యుద్ధ ప్రాతిపదికన నీరు సరఫరా చేసే విధంగా పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ప్రస్తుతం గ్రామాలలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని, తర్వాత డ్రైయిన్ల నిర్మాణం మంజూరు చేస్తామన్నారు. గ్రామాల పర్యటన సందర్భంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వం నుంచి దశల వారీగా మంజూరు జరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ముత్తగూడెం విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పల్లెగూడెం నుంచి ఎంవీ పాలెం వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఖమ్మం ఆర్డీఓ గణేష్, పీఆర్ ఈఈ వెంకట్ రెడ్డి, మండల విద్యాధికారి శ్రీనివాసరావు, తహసీల్దార్ సురేష్, వివిధ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story