అధికారుల ఇంటి ముందే మురుగు.. ఆస్తి పన్ను ఆపేస్తామంటున్న ఆఫీసర్స్

by Bhoopathi Nagaiah |
అధికారుల ఇంటి ముందే మురుగు.. ఆస్తి పన్ను ఆపేస్తామంటున్న ఆఫీసర్స్
X

దిశ, వైరా : వైరా నడిబొడ్డున జాతీయ ప్రధాన రహదారిపై మురుగునీరు ప్రవహించి ఆ రహదారి పక్కనే నిలిచిపోవటంతో ముక్కుపుటాలు అదిరే దుర్వాసన వస్తుంది. 40 మంది నివాసం ఉండే అపార్ట్మెంట్ ముందు, ప్రభుత్వ కార్యాలయ సమీపంలో వెదజల్లుతున్న ఈ దుర్వాసనను ప్రజలు భరించలేకపోతున్నారు. ఈ మురుగు నీటి వల్ల జాతీయ రహదారిపై ప్రయాణించే వేలాది వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. మండలానికి చెందిన పలువురు ప్రముఖ అధికారులు నివాసం ఉండే అపార్ట్మెంట్ ముందు ఈ దుస్థితి నెలకొని ఉంది. అయినప్పటికీ మున్సిపాలిటీ అధికారులు ఈ సమస్యకు పరిష్కారం చూపటం లేదు.

మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోరా..?

వైరాలోని తహసీల్దార్, ఏసీపీ కార్యాలయాల ఎదురుగా జాతీయ రహదారి పక్కన ఉన్న గంధం అపార్ట్మెంట్‌లో నివాసం ఉంటున్న వారు వినియోగించే మురుగునీరు డ్రైనేజీ వ్యవస్థ లేక జాతీయ రహదారిపై ప్రవహిస్తుంది. ఈ అపార్ట్మెంట్లో మొత్తం 40 మంది నివాసం ఉంటున్నారు. మండల మెజిస్ట్రేట్ అయిన తహసీల్దార్ కేవీ శ్రీనివాసరావు, వైరా ఎస్సై వంశీకృష్ణభాగ్యరాజు, వైరా అగ్నిమాపక కేంద్ర అధికారి మాధవరావుతో పాటు తదితర ప్రభుత్వ శాఖల అధికారులు ఈ అపార్ట్మెంట్లోనే నివాసం ఉంటున్నారు. అయితే ఈ అపార్ట్మెంట్లో నివసించే వారు ఉపయోగించే నీరు మొత్తం జాతీయ రహదారి పక్కనే నిలిచిపోతుంది. దీంతో ఈ పరిసర ప్రాంతాల్లో దుర్గంధం వెదజల్లుతుంది. ఈ దుర్వాసన సమీపంలోని తీసిల్దార్, ఏసీపీ కార్యాలయాల వైపు కూడా వెదజల్లుతోంది. అంతేకాకుండా ఈ దుర్వాసనతో వాహనచోదకులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ అపార్ట్మెంట్లో ఉన్న 40 ప్లాట్ల యజమానులు మున్సిపాలిటీకి ఇంటి పన్ను చెల్లిస్తున్నారు. అయితే డ్రైనేజీ సమస్యకు మాత్రం అధికారులు పరిష్కారం లభించడం లేదు.

మున్సిపాలిటీ అధికారులకు తాము లిఖితపూర్వకంగా పలుమార్లు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోవటం లేదని ఈ అపార్ట్మెంట్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాము ఈ ఏడాది ఇంటి పన్ను చెల్లించకూడదని నిర్ణయించుకున్నామని వారు తెలిపారు. ఈ దుర్వాసన వల్ల తాము అనారోగ్యం బారిన పడుతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరాలోని టీఎస్ ప్రసాద్ సొసైటీ కాంప్లెక్స్ వరకు డ్రైనేజీ వ్యవస్థ ఉంది. ఈ అపార్ట్మెంట్‌కు సుమారు 300 మీటర్ల దూరంలో ఉన్న టీఎస్ ప్రసాద్ సొసైటీ కాంప్లెక్స్ వరకు డ్రైనేజీ నిర్మిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. సంవత్సరాలు తరబడి సమస్యను పరిష్కరించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మండల ప్రముఖ అధికారులు నివాసం ఉండే అపార్ట్మెంట్ ముందే ఈ పరిస్థితి ఉండటం పలువురిని విస్మయానికి గురిచేస్తుంది. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు వెంటనే స్పందించి జాతీయ రహదారిపై మురుగునీరు ప్రవహించకుండా చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story