అక్రమ నిర్మాణాలపై చేతులెత్తేసిన అధికారులు

by samatah |
అక్రమ నిర్మాణాలపై చేతులెత్తేసిన అధికారులు
X

దిశ, వైరా : వైరా మున్సిపాలిటీలో ఎలాంటి అనుమతులు లేకుండా భవనాలు నిర్మించే అక్రమార్కులు బరితెగించారు. ఈ అక్రమార్కులపై చర్య తీసుకోవాల్సిన అధికారులు మేమేం చేయలేమని చేతులెత్తేస్తున్నారు. స్వయానా అడిషనల్ కలెక్టర్ స్నేహలత మొగిలి ఎలాంటి అనుమతులు లేని వైరాలోని రెండు అక్రమ భవనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించి రెండు నెలలు గడుస్తున్నా ,వైరా మున్సిపాలిటీ అధికారులు , డీటీఎఫ్ టీం సభ్యులు ఆ ఆదేశాలను లెక్కచేయడం లేదు.

వైరాలోని ఎంవీఐ కార్యాలయం ముందు ఎలాంటి అనుమతులు లేకుండా గంధం టవర్స్ కు ఆనుకొని అక్రమంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ పై, ఎస్బీఐ టౌన్ బ్రాంచ్ పై అక్రమంగా నిర్మించిన మూడవ అంతస్తుపై చర్యలు తీసుకునేందుకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ భవనాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ స్నేహలత మొగిలి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి రెండు నెలలు గడుస్తున్నా ఆమె ఆదేశాలు బుట్ట దాఖలు అయ్యాయి. రెండు నెలల క్రితం ఈ రెండు అక్రమ భవనాల నిర్మాణం పై దిశ దిన పత్రికలో పలు వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. అయినా అధికారుల్లో మాత్రం కనీస స్పందన కనిపించడం లేదు. అధికారుల తీరును చూసి వైరా మున్సిపాలిటీ ప్రజలు అక్రమ నిర్మించిన ఈ భవనాల విషయంలో మున్సిపాలిటీ, డీటీఎఫ్ అధికారులు చేతులెత్తేసారని వ్యాఖ్యానిస్తున్నారు. అసలు వైరాలోడీటీఎఎఫ్ టీమ్ ఎక్కడుందో ఎవరికి తెలియని పరిస్థితి నెలకొంది.

ఇంకా అధికారులను పక్కదోవ పట్టిస్తున్న టీపీఓ

వైరా మున్సిపాలిటీ, డీటీఎఫ్ అధికారులను టీపీఓ భాస్కర్ ఇంకా పక్కదోవ పట్టిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎస్బీఐ టౌన్ బ్రాంచ్ పై అక్రమంగా నిర్మించిన భవనం విషయంలో మున్సిపాలిటీ కమిషనర్ తో పాటు తహసీల్దార్ ను గతంలో టీపీఓ పక్కదారి పట్టించారు. సోమవారం మేజర్ గ్రామపంచాయతీ పేరుతో కాలం చెల్లిన అనుమతులు చూపించి ఇదంతా సక్రమమే అని టిపిఓ అధికారులను సైడ్ చేస్తున్నారు . టీపీఓ చెప్పిన మాటలు విని అధికారులు ఒకింత సందేహంలో పడ్డారు. మున్సిపాలిటీ ఆఫీస్ ఎదురుగా అనుమంతుల్లేకుండా ఎస్బిఐ టౌన్ బ్రాంచ్ పై అక్రమ నిర్మాణం ప్రారంభించిన సమయం నుంచి ఆరు నెలల కాలం పాటు అధికారులకు కనిపించకపోవడం గమనార్హం. మున్సిపాలిటీ కమిషనర్, తహసీల్దార్ లకు నిబంధనలు తెలిసి కూడా సైలెంట్ గా ఉండటం విమర్శలకు దారి తీస్తుంది. ఎస్బిఐ బ్రాంచ్ పై మూడో అంతస్తు నిర్మించిన వ్యక్తి ప్రస్తుతం ఎలాంటి అనుమతులు లేకుండా ఆ బ్యాంకు వెనుక భాగంలో మరో నిర్మాణం చేపట్టేందుకు పిల్లర్ల కోసం గుంటలు తీయడం విశేషం. ఈ నూతన భవన నిర్మాణం ప్రారంభించే విషయంలో మున్సిపాలిటీలోని ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి హస్తం ఉందని వైరాలో ప్రచారం జరుగుతుంది.

అంతా ఆరంభ సూరత్వమే..

వైరా మున్సిపాలిటీ అధికారుల పనితీరు అంతా ఆరంభ సూరత్వంలాగే ఉంది. గత రెండు నెలల క్రితం గంధం టవర్స్కు అనుకోని నిర్మించిన అక్రమ కాంప్లెక్స్ పై దిశలో వార్త కథనాలు ప్రచురితం కావడంతో ఆ కాంప్లెక్స్ ను పరిశీలించారు. ఆ సమయంలో కాంప్లెక్స్‌కు ఎలాంటి అనుమతులు లేవని, కూలగొడితే కూలగొట్టండని ఆ కాంప్లెక్స్ యజమాని పేర్కొన్నారు. పక్కాగా కాంప్లెక్స్ కు అనుమతులు లేవని యజమాని బహిరంగంగా మాట్లాడిన మున్సిపాలిటీ అధికారులు మాత్రం రెండు నెలలుగా చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. వైరాలో మున్సిపాలిటీ అధికారులు అంటేనే అక్రమార్కుల్లో భయం లేకుండా పోయింది. గంధం టవర్స్ ముందు అక్రమంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ పై వైరా మున్సిపాలిటీ కమిషనర్ అనితకు ఆ టవర్స్లో నివాసం ఉంటున్న ప్రజలు ఇప్పటివరకు పదుల సార్లు ఫిర్యాదు చేశారు. ఇటీవల కూడా కమిషనర్ ను కలిసిన గంధం టవర్స్ లో నివాసం ఉండేవారు తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. మీరు చర్యలు తీసుకోకుంటే కలెక్టర్ కి వెళ్లి ఫిర్యాదు చేస్తామని కూడా హెచ్చరించారు. అయినప్పటికీ మున్సిపాలిటీ అధికారుల్లో కనీస చలనం రాకపోవడం గమనార్హం. భవన నిర్మాణాల కోసం కనీసం అనుమతి దరఖాస్తు కూడా చేసుకొని ఈ భవన యజమానులపై మున్సిపాలిటీ అధికారులు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారో వారికే తెలియాలి. అధికారులు తీరు ఇలానే కొనసాగితే మున్సిపాలిటీ కార్యాలయం ముందు ఆందోళన, ధర్నా చేస్తామని గంధం టవర్స్ లో ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, అడిషన్ కలెక్టర్ స్పందించి ఈ రెండు అక్రమ భవనాలు నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story