- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రేమ చెరిపిన బంధాలు.. బిడ్డ కోసం తల్లిదండ్రుల ప్రయత్నాలు
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఆడ పిల్లలని కని, పెంచాలంటే ఇంకా కొన్ని ప్రాంతాల్లో సగటు జీవి ఆలోచించాల్సిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. తమ బిడ్డలను ఉన్నతంగా చూడాలనుకుంటున్న ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాశలే అవుతున్నాయి. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఓ ఆడపిల్లను తల్లిదండ్రులకు దూరం చేస్తే.. ఇన్ని వ్యవస్థలు ఉన్నా బిడ్డను తమ చెంతకు చేర్చలేకపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సంవత్సరం గడుస్తున్నా కనీసం ఎక్కడుందో కూడా తెలియని స్థితిలో ఆ కన్నపేగు ఎంత తల్లడిల్లిపోతుందో అనుభవించే వారికే తెలుస్తుంది. కనీసం బతికుందో లేదో కూడా తెలియడం లేదని, తమ బిడ్డ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఏడాదికాలంగా కనీసం చూడలేకపోయామంటున్నారు ఆ తల్లిదండ్రులు.
అల్లారుముద్దుగా 18ఏళ్లు పెంచిన ఆ తల్లిదండ్రులు తమబిడ్డను చూపించండంటూ ఎంతో మంది వద్దకు తిరుగుతూ వేడుకుంటున్న తీరు హృదయ విదారకం.. ప్రేమ మాయలో పడి ప్రేమించిన వాడితో వెళ్లిపోతే వారిని తల్లిదండ్రులకు అప్పగించాల్సిన బాధ్యత ఈ వ్యవస్థది కాదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టినా.. రాజకీయ నాయకుల వద్దకు వెళ్లి బతిమాలినా.. పెద్దమనుషుల వద్ద మొరపెట్టుకున్నా ఫలితం మాత్రం కానరావడం లేదు. అంటే చట్టాలు ఉన్నోళ్లకేనా..? పేదోళ్ల సమస్యలు, బాధలు ఎవరికీ పట్టవా..? తమ బిడ్డలను దూరం చేసుకోవాల్సిందేనా? అంటూ ఆ తండ్రి పడే ఆవేదన చూస్తుంటే ఎవరి మనసైనా కరగక మానదు..
అసలేం జరిగిందంటే..
ఖమ్మం నగరంలో ఓ సామాజిక వర్గానికి చెందిన యువతి ఇంటర్ చదువుతుండగా వేరే సామాజిక వర్గానికి చెందిన యువకుడు ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. మొదట తిరస్కరించిన ఆ యువతి కొంతకాలానికి యువకుడి మాయలో పడిపోయింది. ప్రేమపేరుతో అమ్మాయిని మైనార్టీ తీరకముందే ఎక్కడికో తీసుకెళ్లాడు. అయితే కొన్ని రోజుల తర్వాత అమ్మాయి తరపువారు తీసుకొచ్చి ఎవరింట్లో వారిని ఉంచారు. మరోసారి ఇదే అనుభవమైతే మళ్లీ తీసుకొచ్చారు. ఈసారి అమ్మాయి తల్లిదండ్రులు కొంత జాగ్రత్త పడ్డారు.
తిరిగి డిగ్రీలో చేరి చదువుకుంటున్న క్రమంలో మళ్లీ ఆ యువకుడు వెంటపడ్డాడు. మైనార్టీ తీరేదాకా చూసి ఆ అమ్మాయిని మరోసారి తీసుకెళ్లాడు. ఈ ఘటన జరిగి దాదాపు సంవత్సరం. అయినా ఇంత వరకు ఆ అమ్మాయి జాడ తల్లిదండ్రులకు తెలియక పోవడం గమనార్హం. అబ్బాయి తరఫు వారిని అడిగినా తమతోనూ కాంటాక్ట్‌లో లేరంటూ చెబుతున్నారని ఆడపిల్ల తండ్రి తన బాధను వెళ్లగక్కుతున్నాడు.
ఎంతో మంది వద్దకు తిరిగినా..
ఏడాది గడుస్తున్నా తమ బిడ్డ ఆచూకీ ఇంతవరకు తెలియదని.. అసలు బతికి ఉందో లేదో కూడా సమాచారం లేదంటూ ఆ యువతి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినా ఇప్పటి వరకు తమ బిడ్డకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెబుతున్నారు. స్థానిక రాజకీయ నాయకుల వద్దకు వెళ్లామని, పెద్దమనుషులు వద్దకు కూడా వెళ్లి తమ బాధను చెప్పుకున్నా ఎవ్వరూ కనికరించడం లేదంటూ వాపోతున్నారు. 18 సంవత్సరాలు అల్లారుముద్దుగా పెంచుకున్నామని.. ప్రేమ మాయలో పడి ఇలా వెళ్లిపోతే.. తల్లిదండ్రుల వద్దకు బిడ్డను చేర్చాల్సిన బాధ్యత ఎవరికీ లేదా? అంటూ కన్నీళ్లు తెచ్చుకుంటున్నారు. కనీసం అమ్మాయి ఉందా? లేదా ? అన్న విషయం మీద క్లారిటీ లేదని వాపోతున్నారు.
బిడ్డను దూరం చేసుకోవాల్సిందేనా..?
తమ బిడ్డ కోసం ఏడాది కాలంగా ఎక్కడెక్కడో వెతికామని, ఎంతో మందికి తమ గోడు వెళ్లబోసుకున్నామని చెబుతున్నారు బాధితులు. ఒకవేళ వాళ్లు మేజర్లు కాబట్టే పెళ్లి చేసుకున్నారనుకుంటే.. కనీసం ఏడాది కాలంగా జాడలేని తమ బిడ్డను చూపించాల్సిన బాధ్యత పోలీసులకు, వ్యవస్థకు లేదా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా బాధలో ఉన్న తమకు వారి కోసం వెతకొద్దంటూ కోర్టు నోటీసులు కూడా వచ్చాయంటున్నారు. పోలీసులు తలుచుకుంటే తమ బిడ్డను తీసుకొచ్చి చూపించొచ్చని.. కానీ వారిపై కొంతమంది ఒత్తిడి, కోర్టు నోటీసులు ఉండటం వల్లే తమ బిడ్డ విషయమై శ్రద్ధ చూపడం లేదన్నారు. ఎటొచ్చి సదరు యువకుడి తరుఫు వాళ్లకే వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తున్నారు.
ప్రేమించడం తప్పు కాదు..
ప్రేమించడం తప్పు కాదు. కానీ తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవడం సరైన పద్ధతి అంటున్నారు కొందరు తల్లిదండ్రులు. ఇలా ఇంట్లో నుంచి వెళ్లిపోయి కన్నవారిని, బంధువులను అగాథంలోకి నెట్టాల్సి రావడం బాధాకరమని, అమ్మాయి తరఫు వారు ఎన్ని తలవంపులు ఎదుర్కొంటారో వారికే తెలుసన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకునే విషయంలో అబ్బాయి తరఫున అన్ని సహాయసహకారాలు అందుతుంటే.. అమ్మాయి వారికి మాత్రం అన్యాయమే జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : స్పర్శ కోసం తహ తహ.. ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్న ఫిజికల్ టచ్