MLA : రైతులను అప్పుల ఊబిలో దింపిన కేసీఆర్‌

by Sridhar Babu |
MLA : రైతులను అప్పుల ఊబిలో దింపిన కేసీఆర్‌
X

దిశ, కారేపల్లి : గత ప్రభుత్వం రైతులను రుణమాఫీ పేరుతో అప్పుల ఊబిలో దింపిందని వైరా ఎమ్మెల్యే మాలోత్‌ రాందాస్‌నాయక్‌ విమర్శించారు. ఆదివారం కారేపల్లి క్రాస్‌రోడ్‌లో ఏర్పాటు చేసిన విశ్వనాథపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వైరా ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్బంగా సొసైటీ చైర్మన్‌ దుగ్గినేని శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.లక్ష రుణమాఫీ పై కేసీఆర్‌ మాయమాటలు చెప్పిండని, అలా చేసి ఉంటే బ్యాంకులో రైతు ఖాతాలు యాక్టివేషన్‌ లో ఉండి లబ్ధిపొందేవారన్నారు. దశలవారీగా రైతులకు మాఫీ అంటూ వడ్డీలకు వడ్డీలు పడి మొండి బకాయిలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులతో పాటు ప్రభుత్వంపై రూ.7వేల కోట్ల భారం పడిందని, దానిని కాంగ్రెస్‌ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తుందన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమతూకంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుందన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సాగు నీరు అందిస్తానని సీతారామ ప్రాజెక్టుకు రూ.8వేల కోట్లు ఖర్చు చేసిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దానిని పడావునపెట్టి చుక్కనీరు అందించలేదన్నారు. వృథాగా ఉన్న జలాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం సద్వినియోగం చేసి వైరా చెరువుకు నీరు రప్పించిందన్నారు. సింగరేణి మండలానికి సాగు నీరు అందించడానికి అన్ని వనరులను వినియోగిస్తానని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు బుగ్గవాగును వినియోగించుకొని సాగునీరు అందేలా చేస్తానని హామీ ఇచ్చారు.

డిస్టిబ్యూటర్‌ ద్వారా జూలూరుపాడు పాపకొల్లు ప్రాంతంలో టన్నెల్‌ ఏర్పాటు చేసి నీటిని సింగరేణి మండలానికి వచ్చే ఏర్పాటు ప్రారంభమైందన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌ ఆఫీసర్‌ కె.నవీన్‌బాబు, ఎంపీడీఓ సురేందర్‌, తహసీల్ధార్‌ సంపత్‌కుమార్‌, ఏఓ అశోక్‌కుమార్‌, సొసైటీ డైరెక్టర్లు అడ్డగోడ ఐలయ్య, బానోత్‌ హీరాలాల్‌, మర్సకట్ల రోషయ్య, కొత్తూరి రామారావు, డేగల ఉపేందర్‌, కాంగ్రెస్‌ నాయకులు బానోత్‌ రాంమ్మూర్తి, తలారి చంద్రప్రకాష్‌, పగడాల మంజుల, ఇమ్మడి తిరుపతిరావు, మేదరి వీరప్రతాప్​, నర్సింగ్‌ శ్రీనివాసరావు, అలోత్‌ ఈశ్వరినందరాజ్‌, బానోత్‌ దేవ్లా, గుగులోత్‌ భీముడు, తోటకూరి రాంబాబు, దారావత్‌ భద్రునాయక్‌, సొందు, బోడా సెట్రాం, ఎండీ.యాకూబ్‌, వాంకుడోత్‌ గోపాల్‌ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed