Minister Ponguleti : బావ బామ్మర్దులు పగటి కలలు కంటున్నారు

by Sridhar Babu |   ( Updated:2024-11-03 15:32:22.0  )
Minister Ponguleti : బావ బామ్మర్దులు పగటి కలలు కంటున్నారు
X

దిశ, ఇల్లందు : రాష్ట్రంలో ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ 100 సీట్లు గెలుస్తుందని బావ బామ్మర్దులు పగటి కలలు కంటున్నారని, రాష్ట్రంలో17 లోక్ సభ స్థానాలు ఉంటే 12 చోట్ల మూడో స్థానంలో, ఏడు స్థానాలలో డిపాజిట్లను బీఆర్ఎస్ పార్టీ కోల్పోయిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం వ్యవసాయ మార్కెట్ లో జరిగిన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథులుగా మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరమ్మ ఇండ్లని అన్నారు. ఒకేసారి రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డిది అన్నారు.

ఇప్పటి వరకు రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేశామని, ఇంకా రూ.13 వేల కోట్ల రుణమాఫీ చేయాలని, అది కూడా రైతులకు రేషన్ కార్డులు, సాంకేతిక కారణాలవల్ల చేయలేకపోయామని తెలిపారు. డిసెంబర్ 9వ తారీకులోపు ప్రతి ఒక్కరికి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో కొత్త రేషన్ కార్డులు కానీ కొత్త పింఛన్లు కానీ ఇవ్వలేదని, కేసీఆర్ స్వార్థంతో రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ రేషన్ కార్డులు, పింఛన్లు ఇచ్చారన్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద అతి త్వరలో రాష్ట్రంలో స్మార్ట్ కార్డులను ఇస్తామన్నారు. ఆ స్వార్ట్ కార్డులే రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీకి, పింఛన్​కు, రైతు రుణమాఫీకి వర్తిస్తుందన్నారు. గత ప్రభుత్వం ఈ పదేళ్లలో తెలంగాణ రాష్ట్రంపై రూ.7 లక్షల కోట్లు అప్పు వేసిందని, ఆ అప్పుకు వడ్డీని కడుతూ అభివృద్ధి, సంక్షేప పథకాలను ముందుకు సాగిస్తున్నామన్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విధంగా 6 గ్యారంటీలను తల తాకట్టు పెట్టైనా అమలు చేస్తామన్నారు. సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు దుబారా ఖర్చులను తగ్గించి, రాష్ట్ర ఆదాయాన్ని పెంచే విధంగా చూస్తున్నామన్నారు. గతంలో వైఎస్సార్ 19 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించారని, ఈ నాలుగు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రతి నియోజకవర్గంలో కుల మతాలకతీతంగా 3వేల మంది విద్యార్థులు ఉండే విధంగా సకల సదుపాయాలతో రూ.150 కోట్లతో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ పాదయాత్ర చేస్తానని చెబుతున్నారని, ఆరోగ్యానికి నడక మంచిదే అని ఎద్దేవా చేశారు.

పది సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోలేదు కానీ నేడు పాదయాత్ర చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం దోచుకున్న లక్ష కోట్ల రూపాయలను రాష్ట్రంలోని ప్రతి గ్రామపంచాయతీకి పంచాలన్నారు. అనంతరం నూతనంగా ఎన్నుకున్న మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మహబూబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకటరావు, రాందాస్ నాయక్, ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వ విజయబాబు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని, లక్ష్మీనారాయణ, రాష్ట్ర నాయకులు రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి, భరత్ చంద్రా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ దమ్మల పాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed