అందరికీ పాదాభివందనం చేయడానికి ఢిల్లీకి వెళ్లావా కేటీఆర్.. మంత్రి పొంగులేటి..

by Sumithra |   ( Updated:2024-11-11 14:28:17.0  )
అందరికీ పాదాభివందనం చేయడానికి ఢిల్లీకి వెళ్లావా కేటీఆర్.. మంత్రి పొంగులేటి..
X

దిశ బ్యూరో, ఖమ్మం : ‘ఈ నిమిషంలో మీరు ఎక్కడ ఉన్నారు.. కేంద్ర మంత్రితో మీకున్న పని ఏమిటి.. మీరు మంత్రిగా, మీ నాయనా ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ రేస్ విషయంలో జరిగిన అవకతవకలను కప్పిపుచ్చుకునేందుకు, అందులోనుంచి బయట పడేందుకు ఢిల్లీ వెళ్లావా కేటీఆర్’ అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. సోమవారం ఖమ్మం జిల్లా రూరల్ మండలం వెంకటగిరిలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. అదానీ, అంబానీ, బీజేపీలోని నెంబర్ వన్, టూ, త్రీలను కలిసి కాళ్లు మొక్కి, కేసును పక్కదారి పట్టించేందుకే ఢిల్లీ వెళ్లాడంటూ ఫైర్ అయ్యారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని, తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టదని స్పష్టం చేశారు.

ఒకటి, రెండు రోజుల్లో గవర్నర్ నుంచి క్లియరెన్స్..

ఓ ప్రజాప్రతినిధిని ప్రశ్నించాలంటే గవర్నర్ నుంచి అనుమతి తప్పనిసరని, ఈ రేస్ లో జరిగిన అవకతకలపై గవర్నర్ కు 13 రోజుల క్రితం లేఖ రాశామని, మరో రెండు రోజుల్లో క్లియరెన్స్ రానుందని.. దాన్ని ఆపేందుకే కేటీఆర్ హడావిడిగా, కొంపలంటుకు పోయినట్లుగా ఢిల్లీ వెళ్లారని అన్నారు. కేంద్రంలో ఉండే మంత్రిని ప్రాధేయపడి కేసును పక్కదారి పట్టించేందుకు ఢిల్లీ వెళ్లారా? అదానీ, అంబానీ, ఆర్ఎస్ఎస్, బీజేపీలోని నెంబర్ వన్, టూ వద్దకు వెళ్లి పాదాభివందనం చేసేందుకు వెళ్లారా? చెప్పాలని నిలదీశారు.

గతంలో మీ చెల్లి కేసులో బెయిల్ సంపాదించుకున్న విధంగా ఈ కేసులో కూడా కేంద్ర పెద్దల సహాయం పొందేందుకు వెళ్లింది నిజం కాదా? ఆధారాలతో సహా నిరూపిస్తామన్నారు. ఏ బాంబో పేలుతుందో మీకు తెలిసే, రాబోయే రెండు రోజుల్లో జరిగే పరిణామాలు గ్రహించే మీరు ఢిల్లీ ప్రయాణమయ్యారని దుయ్యబట్టారు. ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు ఉలికిపడుతున్నారని అన్నారు. ఈ కార్ రేసు విషయంలో ఏ యాక్ట్ ప్రకారం విదేశాలకు నిధులు పంపారో ప్రజలకు తెలియపర్చాలని సూచించారు. ఒప్పందం కుదిరిన తర్వాత 55 కోట్ల రూపాయల నిధులను విదేశాలకు పంపాల్సింది పోయి.. ఒప్పందం కాకముందే 25 రోజుల కంటే ముందే మీ బినామీ సంస్థలకు ఎలా పంపారని, కేబినెట్ మినిస్టర్ గా మీకున్న అర్హత ఏంటని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రజల సొమ్మును ఎలా వినియోగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాతకు దగ్గులు నేర్పుతున్నారు..

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాతకు దగ్గులు నేర్పుతున్న విధంగా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. ఇద్దరు, ముగ్గురు పెయిడ్ ఆర్టిస్టులకు కండువాలు కప్పి.. ‘మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే, ఇందిరమ్మ ప్రభుత్వం అరెస్టులు చేయాలని చూస్తుంది’ అనడం సిగ్గుచేటన్నారు. గతంలో దోచుకోకుండా మిగిలి ఉన్న దాన్ని మళ్లీ వచ్చాక దోచుకుందామంటూ హితబోధ చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఉన్న నాయకులను చేజారి పోకుండా వారిని నమ్మించేందుకు కష్టపడటం చూసి నవ్వొచ్చిందని అన్నారు. పేదవారి స్వార్జితాన్ని ఏనాడూ కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చదని, అక్రమంగా నిర్మాణాలు చేసిన బడాబాబుల విషయంలో మాత్రం తాత్సారం చేయదని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ఏడో వింత తర్వాత ఎనిమిదో వింత అన్న కేసీఆర్.. ఆ ఎనిమిదో వింత ఎవరూ కూలగొట్టక ముందే కుంగిపోవడానికి కారకులు ఎవరని పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతరిక్షమే సేఫ్ అనుకుంటారు..

బీజేపీ దయాదాక్షిణ్యాల కోసం లబ్ధి పొందేందుకు ఢిల్లీ వెళ్లిన కేటీఆర్.. తాటాకు చప్పుళ్లకు భయపడమని అంటున్నారని ఎద్దేవా చేశారు. ఎవరినీ ఉద్దేశ పూర్వకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టదని స్పష్టం చేశారు. అదేవిధంగా పేదప్రజలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మీరు అధికారంలో ఉండి, దొర పరిపాలన చేసిన రోజుల్లో విద్యుత్, కాళేశ్వరం, భూములు, ఐఅండ్ పీఆర్ లాంటి అనేక అంశాల్లో అవినీతి రాజ్యమేలిందని, వాటి లెక్కలు తీస్తే బీఆర్ఎస్ నాయకులు భూమ్మీద ఉండరని, అంతరిక్షంలో దాక్కుంటారని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా దర్యాప్తు ముందుకు సాగుతుందని, ఖమ్మం జిల్లాలో తన ఫోన్ను కూడా ట్యాప్ చేశారని, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోమని, జిల్లాలో జరిగిన డబుల్ బెడ్ రూం ఇండ్ల అవకతవకల విషయంలో కూడా సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు.

ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా..

ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి ఇందిరమ్మ రాజ్యం స్థాపించుకున్నారని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సంక్షేమం, అభివృద్ధి పాటిస్తూ ముందుకు సాగుతున్నామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలు కట్టడానికి ఇబ్బంది ఉన్నా.. ఆచరణ సాధ్యం కానివాటిని కూడా సాధ్యం చేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. అర్హులకు అన్ని సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. మొదటి విడుతగా ప్రతీ నియోజకవర్గానికి 4500 ఇళ్లు ఇచ్చేందుకు రెడీ అయ్యామని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed