ఆందోళనలో మామిడి రైతు.. రెండేళ్లగా నష్టాలు

by Mahesh |   ( Updated:2023-03-11 02:37:29.0  )
ఆందోళనలో మామిడి రైతు.. రెండేళ్లగా నష్టాలు
X

దిశ, కల్లూరు: తామర పురుగు, ఇతర తెగుళ్ల దెబ్బతో మామిడి తోటలన్నీ వాడిపోతున్నాయి. పంటను కాపాడుకునేందుకు పురుగు మందులు పిచికారి చేస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది దిగుబడులు క్షీణించాయని, అంతకుముందు కోవిడ్ మహమ్మారితో నష్టాలు పాలయ్యామని, ఈసారైనా లాభాలు పొందాలనే ఆశాభావంతో ఉన్న రైతన్నలకు తెగుళ్లు భయపెడుతున్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సుమారు 30 వేల ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు మండలాలలో రైతులు పండిస్తున్నారు. తోతాపురి, బంగినపల్లి, రసాల్, హిమాయత్ దాసేరి, కేసరి రాయల్ స్పెషల్, చిన్న రసాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మామిడి తోటలకు తామర పురుగు, ఇతర తెగుళ్లు సోకడంతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నారు.

సీజన్ ఆరంభం నుండి పోత దశ వరకు రైతులు ఆశించిన మేర కనిపించిన మామిడి తోటలు తామర పురుగు తెగులు సోకడంతో తేలిపోతున్నాయి. మామిడి తోటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. తెగుళ్ల నివారణకు ఇబ్బడిముబ్బడిగా పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు. ఒక్కో రైతు ఒక్కోసారి మందులు పిచికారికి సుమారు రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు వెచ్చిస్తున్నారు. ఒక్కొక్కరు ఇప్పటికే ఐదుసార్లు పురుగు మందు పిచికారి చేసినా ఆశించిన ఫలితం కానరావడం లేదు. సాధారణంగా ఎకరాకు 10 టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం రెండు, మూడు టన్నులు వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు.

నివారణకు చర్యలు చేపట్టాలి

మిర్చి పంటలకు ఆశించినట్లే ప్రస్తుతం మామిడి తోటలకు తామర పురుగు సోకుతుంది. పూత ఎండి పిందె రాలిపోవడం, కాయ పగలడం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. వీటి నివారణకు ఒక గ్రాము జింకు సల్ఫేట్ ప్లస్ ఒక గ్రాము బోరాన్ లీటర్ నీటికి కలిపి మొగ్గ పెరిగే దశలో చెట్లు తడిచేలా పిచికారీ చేయాలి. లీటర్ నీటికి గ్రాము కార్బండ జిమ్ కలిపి పిచికారి చేస్తే పూత పిందె దశలో ఆకుపచ్చ వ్యాప్తిని అరికట్టవచ్చు. మీనాక్షి ఉద్యాన శాఖ అధికారి సత్తుపల్లి..

రెండేళ్లగా నష్టాలే

ఎర్ర బంజర, కల్లూరు పదేళ్లుగా మామిడి సాగు చేస్తున్నా. రెండేళ్లగా నష్టాలే మిగులుతున్నాయి. ఈసారి మరీ దారుణం తామర పురుగు ఉత్పత్తితో ఐదు సార్లు మందులు పిచికారి చేశా. 80 చెట్లకు రూ.60 వేలు వెచ్చించా. అయినా పంట చేతికి వచ్చేలా కనిపించడం లేదు. మాయరి సత్యం

పెట్టుబడి వచ్చేలా లేవు..

పదెకరాల్లో మామిడి సాగు చేస్తున్నా. తామర పురుగు తేనె మంచుతో తోటలు మాడిపోయి, పూత రాలిపోయింది. ఎకరాకు రూ.50 వేల వరకు పెట్టుబడి పెట్టా. రూ.వేలు వెచ్చించి పురుగు మందులు పిచికారి చేసినా ఫలితం లేదు. పిందే దశలోనే కాయలో పురుగులు రావడంతో అవి రాలిపోతున్నాయి. ఈఏడాది పెట్టుబడులు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు.- గుగులోతు శ్రీనివాసరావు ఎర్ర బంజర గ్రామం,కల్లూరు

Advertisement

Next Story