Heavy rain : చినుకు పడితే చిత్తడి..

by Sumithra |   ( Updated:2024-07-25 14:55:47.0  )
Heavy rain : చినుకు పడితే చిత్తడి..
X

దిశ, తిరుమలాయపాలెం : చినుకు పడితే చిత్తడి అనే చందంగా కేశవపురం వీధుల పరిస్థితి మారింది. దురదృష్టవశాత్తు సర్పంచ్ గా ఎన్నికైన కొన్ని నెలలకే, స్థానిక సర్పంచ్ దొడ్డ భద్రమ్మ మరణించారు. రాష్ట్ర ప్రభుత్వం బై ఎలక్షన్లు నిర్వహించకపోవడం, ఉపసర్పంచ్ ద్వారానే కాలం వెళ్లదీయడంతో అభివృద్ధికి ఆమడ దూరంలో కేశవపురం గ్రామం నిలిచింది. మండలంలోని కేశవపురం గతంలో పిండిప్రోలు గ్రామ పంచాయతీ పరిధిలో ఉండగా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పిండిప్రోలు పంచాయతీ నుంచి, కేశవపురం గ్రామాన్ని విడదీసి ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు చేశారు. ప్రత్యేక పంచాయతీగా ఏర్పడ్డా కేశవపురం, అన్ని విధాలా అభివృద్ధి చెందిందని ఆ సమయంలో గ్రామప్రజలు ఆశపడ్డారు. కానీ వారి ఆశలు అడియాశలగానే మిగిలిపోయాయి.

ప్రత్యేక పాలన పొందిన కేశవపురం గ్రామంలో సమస్యలు గుర్తించి పరిష్కారం చూపడంలో అధికారులు విఫలమయ్యారు. ఐదేళ్ల కాలంలో ముగ్గురు ఎంపీడీఓలు మారగా, ఒక ఎంపీవో విధులు నిర్వహించారు. ఎంపీడీఓగా ఎక్కువ కాలం ఇక్కడ పనిచేసిన జయరాం నాయక్, తాజాగా బదిలీ పై వెళ్లిన ఎంపీవో రాజేశ్వరిలు కేశవపురం గ్రామంలోని సమస్యలు తీర్చడంలో విఫలమయ్యారు.

గడిచిన ఈ ఐదేళ్ల పాలనలో, కేవలం ఆ గ్రామంలో సుమారు రూ. 9.5 లక్షల అభివృద్ధి పనులు మాత్రమే జరిగాయంటే అక్కడ పాలన తీరు, సంబంధిత పంచాయతీ మండల అధికారుల పర్యవేక్షణ ఎలా ఉందో అర్ధమవుతుంది. గతంలో వేసిన సీసీ రోడ్లు తప్ప, ఈ ఐదు సంవత్సరాల పాలన కాలంలో, ఇక్కడ కేవలం నాలుగు సీసీ రోడ్లు మాత్రమే వేశారు. అదికూడా ఈజీఎస్ వర్క్ కింద జరిగిన పనులు మాత్రమే. గ్రామంలో ప్రణాళిక బద్దంగా సైడ్ డ్రైనేజ్ లు నిర్మించక పోవడం, ఉన్న సైడ్ డ్రైనేజ్ లు సైతం బూడిపోవడం ఆ ప్రాంత ప్రజల పాలిట శాపంగా మారింది. చిన్న వర్షానికి వర్షపు నీరు వీధుల్లోకి చేరి వీధులు బురదమయమై స్థానికులకు తప్పని తిప్పలుగా మారాయి.

దీనికితోడు, సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన కాంక్రీట్ మెటీరియల్స్ ఈ గ్రామ శివారులో ఉండగా, ఆ మెటీరియల్ ఈ గ్రామం మీదుగానే ఇతర ప్రాంతాలకు పెద్ద పెద్ద మాండ్లకు తరలిస్తున్నారు. అధిక లోడ్ కారణం చేత గ్రామ ప్రధాన రహదారి సైతం ధ్వంసమై, వరద నీరు చేరి మురికి గుంటలుగా దర్శనం ఇస్తున్నది. ఇకనైనా అధికారులు దృష్టి సారించి గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాల్సిందిగా గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story