జనసేన అభ్యర్థికి జనాదరణ కరువు..? ఇక ఆశలన్నీ ఆయనపైనే..!

by Sathputhe Rajesh |   ( Updated:2023-11-23 04:03:12.0  )
జనసేన అభ్యర్థికి జనాదరణ కరువు..? ఇక ఆశలన్నీ ఆయనపైనే..!
X

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: కొత్తగూడెం రాజకీయాలు రోజులు గడుస్తున్న కొద్ది రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీ అభ్యర్థులు నేనంటే నేనంటూ పోటా పోటీగా ప్రచారాలు సాగిస్తున్నారు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రజలను తమ వైపు ఆకర్షించడానికి క్యాడర్ ఉన్న నాయకులు సైతం ముప్పు తిప్పలు పడుతుంటే నియోజకవర్గంలో గుర్తింపు లేని వ్యక్తులు విజయం తమదే అని ప్రచారం చేస్తుంటే నియోజకవర్గ ప్రజలకు మింగుడు పడడం లేదు.

ఇదిలా ఉంటే ఏదో పార్టీ నుండి లేదా ఇండిపెండెంట్గా నామినేషన్ వేసి ప్యాకేజీల కోసం ఎదురుచూసే అభ్యర్థులు మరో కొంతమంది. క్యాడర్ లేకున్నా ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఏకంగా సింహాసనం అధిష్టించవచ్చని మరి కొంతమంది అభ్యర్థులు అత్యాశతో తిరుగుతున్నారు.

జనసేన అభ్యర్థికి జనాదరణ కరువు...

ఎన్నికల హడావుడి మొదలైంది మొదలు ఉదయం నుండి రాత్రి వరకు మైకు మోతలతో ఆటోలు తిరుగుతున్నప్పటికీ ఏమాత్రం ప్రజాదరణ పొందలేకపోతున్నారు కొంతమంది అభ్యర్థులు. ఈ జాబితాలో జనసేన పార్టీ అభ్యర్థి ముందు వరుసలో ఉన్నారు. ఏదో ఒక పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలవాలన్న కోరికతో తక్కువ సమయంలోనే నాలుగు పార్టీలు మారిన ఘనత ప్రస్తుత జనసేన అభ్యర్థికే దక్కుతుందని చెప్పవచ్చు. గతంలో బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో పనిచేసినప్పటికీ పార్టీ బీఫామ్ కోసం బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు.

కానీ బీజేపీ జనసేన పొత్తులో భాగంగా కొత్తగూడెం నియోజకవర్గ సీటు జనసేన పార్టీకి ఇవ్వనున్నట్లు తెలుసుకున్న ప్రస్తుత అభ్యర్థి కేవలం మూడు రోజులకే బీజేపీని వదిలి బీఫామ్ కోసం జనసేన తీర్థం తీసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా నియోజకవర్గంలో ప్రజాదరణ పొందడంలో పూర్తి విఫలమయ్యారని నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ సాగుతోంది.

పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురుచూపులు..

జనసేన అభ్యర్థికి ప్రస్తుత ప్రచారంలో జనాదరణ లేకున్నా 23వ తారీకు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రానున్నారు. పవన్ కళ్యాణ్ రాకతో ఆయన అభిమానులంతా తమకే ఓటు వేస్తారని స్థానిక అభ్యర్థి ఊహిస్తున్నప్పటికీ కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం సరైన అభ్యర్థికి టికెట్ ఇవ్వలేదని పెదవి విరుస్తున్నారు.

ఇక బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ ఒకరిద్దరు ప్రధాన నాయకులు తప్ప ద్వితీయ స్థాయి నాయకులు, కార్యకర్తలు స్థానిక జనసేన అభ్యర్థికి మద్దతు తెలియజేయడానికి వెనకాడుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా జనసేన అభ్యర్థి నామినేషన్ వేసే రోజు ర్యాలీకి వచ్చిన ప్రజలకు డబ్బులు ఇవ్వకపోవడంతో పార్టీ ఆఫీస్‌కి తాళాలు వేయడానికి సిద్ధపడ్డట్టు సమాచారం. ఈ వ్యవహారం అంతా తెలుసుకున్న నియోజకవర్గ ప్రజలు పార్టీ కోసం వచ్చారా ప్యాకేజీల కోసం ఎదురుచూస్తున్నారా అంటూ సెటైర్లు విసురుతున్నారు.

జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్‌కు ఊహించని రీతిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ స్థానిక అభ్యర్థి ఎంపిక సరైనది కాదు అని, అదే స్థానంలో అంతో ఇంతో కేడర్ ఉన్న అభ్యర్థిని ఎంపిక చేసినట్లయితే పవన్ కళ్యాణ్ అభిమానులు అవలీలగా గెలిపించేవారని రాజకీయ విశ్లేషకుల మధ్య చర్చ సాగుతోంది.

Advertisement

Next Story

Most Viewed