గ్యారెంటీలు నరేంద్ర మోదీతోనే సాధ్యం

by Disha Web Desk 15 |
గ్యారెంటీలు నరేంద్ర మోదీతోనే సాధ్యం
X

దిశ, కారేపల్లి : అభయహస్తం గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కటీ సక్రమంగా అమలు చేయలేదని, గ్యారెంటీ అంటే కేవలం మోదీ ఇచ్చే గ్యారెంటీ మాత్రమేనని బీజేపీ ఎంపీ అభ్యర్థి వినోద్ రావు అన్నారు. అది ఖచ్చితంగా నెరవేరే గ్యారెంటీ అని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సింగరేణి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద వినోద్ రావుకు మహిళలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి బస్టాండ్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం బస్టాండ్ సెంటర్లో వినోద్ రావు మాట్లాడుతూ ఎన్నికలు అనగానే మోసపూరిత మాటలతో ప్రజల వద్దకు అనేక పార్టీల వారు వస్తుంటారని వాటిని నమ్మవద్దని అన్నారు. దేశం సురక్షితంగా ఉంటేనే ప్రతి ఒక్క పౌరుడు బాగుంటాడని అన్నారు. గత పదేళ్లలో మోదీ నాయకత్వంలో భారతదేశం అగ్రదేశాల సరసన చేరిందన్నారు. అటువంటి భారతదేశం ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలిపేందుకు నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందన్నారు. భారతీయ జనతా పార్టీ పాలకులు లేకపోవడంతో ఖమ్మం అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఏ గ్రామంలోకి వెళ్లినా అవకాశాలు మెండుగా ఉన్నాయని, పాలకుల దూరదృష్టి లోపంతో అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక ప్రజలను అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచారన్నారు.

కారేపల్లి జంక్షన్ లో సైతం రైలు సమస్యలు తనకు తెలుసునని, పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందిన వెంటనే రైలు సమస్యలను పరిష్కరిస్తానన్నారు. ఖమ్మం ప్రజలకు అవసరమైన విద్య, వైద్యం, పరిశ్రమలకు సంబంధించిన ఒక్క సదుపాయం కూడా సరిగా లేదన్నారు. గ్రామం నుంచి దేశం వరకు అభివృద్ధి మంత్రంగా అవినీతి రహితంగా పాలన సాగిస్తున్న భారతీయ జనతా పార్టీ రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో 400 సీట్లను గెలుచుకోబోతుందని, అందులో ఖమ్మం సీటును సైతం భాగస్వామ్యం చేయడానికి ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటును కమలం పువ్వు గుర్తుపై వేయాలని కోరారు. భారతీయ జనతా పార్టీలోని అన్ని వర్గాలకు సముచితం స్థానం లభిస్తుందని, గిరిజన మహిళలకు దేశ రాష్ట్రపతిగా అవకాశం కల్పించారన్నారు. ప్రతిపక్షాల మోసపూరిత

మాటలలో పడి ప్రజలు నష్టపోవద్దని కోరారు. మీలో ఒకడిగా ఎప్పటికీ పనిచేస్తానని అన్నారు. అంతకుముందు బాబాసాహెబ్ అంబేద్కర్, కొమురం భీం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బస్టాండ్ సెంటర్లో ప్రతి దుకాణం తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి భూక్య శ్యామ్ రాథోడ్, వైరా నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ నెల్లూరి కోటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధులు కల్తీ రాంప్రసాద్, దొడ్డ అరుణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బోళ్ల భిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఖమ్మం ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, సింగరేణి మండల అధ్యక్షుడు ధనసరి శ్రీను, ప్రధాన కార్యదర్శులు కొండపల్లి ప్రదీప్, మల్లేష్, సీనియర్ నాయకులు తురక నారాయణ, నాయకులు తాళ్లూరి రాంబాబు, పోదెం రామ్మూర్తి, సుజాత, చిరునోముల రామారావు, భాస్కర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed