అలజడి రేపుతున్న ‘రిజర్వేషన్ రద్దు’ అంశం.. అప్రమత్తమైన ఆ మూడు సామాజికవర్గాలు

by GSrikanth |
అలజడి రేపుతున్న ‘రిజర్వేషన్ రద్దు’ అంశం.. అప్రమత్తమైన ఆ మూడు సామాజికవర్గాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల వేళ ‘రిజర్వేషన్ రద్దు’ అంశం అలజడి రేపుతున్నది. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయనే ప్రచారం జోరందుకున్నది. దీనిపై ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు అలర్ట్ అయ్యాయి. రిజర్వేషన్లు రద్దయితే తమ వర్గాల భవిష్యత్తు ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. దీంతో వారు ఆందోళనలకు సైతం సిద్ధమవుతున్నట్లు తెలిసింది. రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకువచ్చి వారి నుంచి స్పష్టమైన హామీని తీసుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తున్నది.

ఏకమవుతున్న బీసీ సంఘాలు

రిజర్వేషన్ల రద్దు ఆలోచన విరుమించుకోవాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రిజర్వేషన్ల కొనసాగింపు ఉద్యమం కోసం అన్ని సంఘాలు ఒక్క తాటిపైకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని, అందులో భాగంగానే అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పించిందని సంఘాల లీడర్లు ఆరోపిస్తున్నారు. ఈనెల 5న బీసీల రాజకీయ మధోమదన సదస్సును బీసీ సంక్షేమ సంఘం నిర్వహిస్తున్నది. రాష్ట్ర పర్యటనకు వచ్చే మోడీ జాతీయ స్థాయిలో బీసీ కుల గణన చేపట్టి, బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇవ్వాలని బీసీ సంఘాల లీడర్లు డిమాండ్ చేస్తున్నారు.

ఆందోళనకు రెడీ అవుతున్న దళిత సంఘాలు

రిజర్వేషన్ల రద్దు అంశంపై దళిత సంఘాలు కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. రిజర్వేషన్లను కొనసాగిస్తామని అన్ని పార్టీలు లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇందుకోసం త్వరలో మాదిగ, మాల సంఘాలు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తున్నది. అలాగే రాష్ట్రంలో ఉన్న క్రిస్టియన్ మైనార్టీలు సైతం రిజర్వేషన్ల రద్దుపై ఇప్పటికే ఇంటర్నల్ మీటింగ్స్ పెట్టుకున్నట్టు సమాచారం.

టార్గెట్ బీజేపీ

మూడోసారి పవర్‌లోకి వస్తే బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. తాము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని బీజేపీ లీడర్లు పదే పదే వివరణలు ఇస్తున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం రిజర్వేషన్లు రద్దు చేస్తారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈ విషయాన్ని గ్రహించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల లీడర్లు బీజేపీ నుంచి స్పష్టమైన హామీ కొరకు ఆందోళనలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed