పేద కుటుంబాల బాధ్యతను ప్రభుత్వం స్వీకరించడం అభినందనీయం : ఎమ్మెల్యే కూనంనేని

by Aamani |
పేద కుటుంబాల బాధ్యతను ప్రభుత్వం స్వీకరించడం అభినందనీయం : ఎమ్మెల్యే  కూనంనేని
X

దిశ, కొత్తగూడెం : ఆడపిల్లలను కన్న పేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం ఆర్థిక భరోసా అని, ఈ పథకంతో ఆడపిల్లలు సగౌరవంగా మెట్టింట్లో అడుగుపెడుతున్నారని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం క్రింది కొత్తగూడెం మున్సిపాలిటీ, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి ఎంపికైన 66 లబ్దిదారులకు రూ.66,07,656ల విలువగల చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కూనంనేని అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన మాట్లాడుతూ ఆడబిడ్డలకు వివాహాలు చేయలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆసరాగా నిలుస్తుందని, ఆడపిల్లల జీవితాలకు భరోసా కల్పిస్తోందని అన్నారు.

లబ్ధిదారులకు రూ.1,00,116లు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేస్తోందని, పేద కుటుంబాల ఆడపిల్లల వివాహ భాద్యతను ప్రభుత్వం స్వీకరించడం అభినందనీయమని అన్నారు. పథకం అమలులో సాంకేతిక లోపాలుంటే సరిచేసి త్వరితగతిన ఆర్థిక చేయూత అందించాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, ఛైర్ పర్సన్ కే సీతామహాలక్ష్మీ, తహశీల్దార్లు పుల్లయ్య, కృష్ణ, కమిషనర్ శేషాంజన్ స్వామి, కౌన్సిలర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed