- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిలువు దోపిడీకి గురవుతున్న అన్నదాత
దిశ, వైరా: ప్రస్తుత యాసంగి సీజన్ లో అనేక అష్టకష్టాలు పడి వర్షాల వల్ల అనేక అగచాట్లు పడి సొసైటీలో నాణ్యమైన ధాన్యాన్ని విక్రయిస్తున్న అన్నదాతలను మిల్లర్లు కోతల పేరుతో దోపిడీకి గురిచేస్తున్నారు .. రైతులు పండించిన ధాన్యంలో క్వింటాలు 6 నుంచి 10 కేజీలు వరకు కోతల పేరుతో మిల్లర్లు నిలువునా దోచుకుంటున్నారు. కోతలకు నిరాకరించిన రైతుల ధాన్యాన్ని దిగుమతి చేసుకునేందుకు మిల్లర్లు నిరాకరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కోతలు విధిస్తున్న మిల్లర్ల ఆగడాలకు కళ్లెం వేసే వారే కరువయ్యారు.
స్వయానా సీఎం కేసీఆర్ సొసైటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం తూర్పార పట్టి నియమ నిబంధనలు ప్రకారం కాంటా వెయ్యాలని ఆదేశించారు. అలా కాంటా వేసి పంపిన ధాన్యంలో ఒక్క గింజ కూడా మిల్లర్లు కోత విధించకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని అత్యధిక నగదును కూలీలకు చెల్లించి తూర్పార పోసి, ఎండబెట్టి నాణ్యమైన సరుకును సొసైటీలోని కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. అలాంటి నాణ్యమైన ధాన్యానికి కూడా మిల్లర్లు విధించే కోతలు దారి దోపిడీ దారులను తలపిస్తుంది. ధాన్యం కాంటా వేసేటప్పుడు కూడా రైతులు దగాకే గురవుతున్నారు.
కాంటా వేసే మొదలు మిల్లుకు వెళ్లే వరకు అంతా దోపిడీనే..
రైతులు సొసైటీ నియమ నిబంధనల ప్రకారం సిద్ధం చేసిన ధాన్యం కాంటా వేసే మొదలు మిల్లుల్లో దిగుమతి చేసే వరకు అంతా దోపిడీకే గురవుతున్నారు. సొసైటీల ఆధ్వర్యంలో ఒక్కో బస్తాలో 40 కేజీల ధాన్యం కాంటా వేయాల్సి ఉంది. అయితే గన్నిసంచి 600 గ్రాములు బరువు ఉంటుంది. ఈ లెక్క ప్రకారం 40 కేజీల 600 గ్రాములు కాంటా వేయాల్సి ఉంటుంది. అయితే అందుకు విరుద్ధంగా సొసైటీ అధికారుల పర్యవేక్షణలో ఒక్కో బస్తా 41 కేజీ 200 గ్రాములు కాంటా వేస్తున్నారు. ఈ కాంటాలోనే ఒక్కో బస్తాకు రైతు కష్టపడి పండించిన 600 గ్రాముల ధాన్యాన్ని దోపిడీ చేస్తున్నారు. అంతేకాకుండా రైతుల ధాన్యాన్ని దిగుమతి చేసుకునేటప్పుడు మిల్లర్లు ఒక్కో 40 కిలోల బస్తాకు కిలో నుండి 2.5 కిలోల వరకు ధాన్యమును కోత విధిస్తున్నారు.
ధాన్యమంతా నాణ్యంగానే ఉంది కదా అని రైతులు ప్రశ్నిస్తే నూక శాతం ఉందంటూ ఇష్టమైతే ధాన్యం అమ్మండి.... లేకుంటే మీ ధాన్యం మాకు అవసరం లేదంటూ మిల్లర్లు బహిరంగంగానే దోపిడీకి పాల్పడుతున్నారు. ఇలా 40 కేజీల బస్తాకు సుమారు మూడు కేజీల పైనే మిల్లర్లు నిలువు దోపిడీ చేస్తున్నారు. ధాన్యంలో చిన్నపాటి మట్టి పెడ్డ, తూర్పార పట్టకపోయినా, కొంచెం తేమ శాతం ఎక్కువ ఉన్నా, ధాన్యాన్ని కాంటావేసేందుకు నిరాకరిస్తున్న సొసైటీ అధికారులు నాణ్యమైన ధాన్యాన్ని కోతలు ఎందుకు విధిస్తున్నారని మిల్లర్లను ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైరా మండలంలో వైరా, గరికపాడు, పూసలపాడు సొసైటీలు ఉన్నాయి.
ఈ సొసైటీలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని కొణిజర్ల మండలం గుండ్రాతిమడుగు లో ఉన్న విజయలక్ష్మి పారాబాయిల్డ్ మిల్, వెంకట శ్రీనివాస రైస్ మిల్, వైరా లోని కస్తూరి ట్రేడింగ్, నాళ్ళ సత్యనారాయణ రైస్ మిల్,పాలడుగు గ్రామంలోని సరస్వతి బిన్నీ రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. ప్రధానంగా కస్తూరి ట్రేడింగ్ మిల్ యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ మిల్లులో అందిన కాడికి కోతలు విధిస్తూ రైతులను నిలువునా ముంచుతున్నారు.
ప్రభుత్వం స్పష్టంగా నాణ్యమైన ధాన్యానికి మిల్లర్లు కోత విధించకూడదని నిబంధనలను విధించిన ఫలితం లేకుండా పోయింది. తమ కష్టాన్ని మిల్లర్లు దోచుకుంటున్న ప్రభుత్వ అధికారులు తమకు తెలియనట్లు వ్యవహరిస్తున్నారని అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ సార్ అయినా వైరాలో మిల్లర్ల ఆగడాల అరికట్టాలని మండల రైతులు ముక్తకంఠంతో కోరుతున్నారు.