కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలను నమ్మొద్దు

by Disha Web Desk 15 |
కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలను నమ్మొద్దు
X

దిశ, మధిర : కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెడుతుందని, ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని భారతీయ జనతా పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్​రావు అన్నారు. శనివారం మధిర పట్టణంలోని జిల్లా కన్వీనర్ ఏలూరు నాగేశ్వరావు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. మరలా బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తారని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారన్నారు. బడుగు బలహీన వర్గాలు , ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి అధిక ప్రాధాన్యత ఇస్తూ రిజర్వేషన్ ప్రాతిపదికన తీసుకొచ్చిందే బీజేపీ అని అన్నారు. దివంగత భారత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము వంటి వారికి బీజేపీ సముచిత స్థానం కల్పించిందన్నారు. ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపి ప్రపంచ

దేశాలు భారత దేశ ఔన్నత్యాన్ని గుర్తించే విధంగా పరిపాలన సాగించిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి బాటలు వేసిన బీజేపీ మరలా అధికారంలోకి వచ్చి మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేసింది అన్నారు. కుటుంబ, వారసత్వ పాలనతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చూస్తుందని, దానిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఖమ్మం జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని, మన ఖమ్మం జిల్లాని మనమే అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. తనని పార్లమెంటుకు పంపిస్తే ఖమ్మం జిల్లా అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామన్నారు. కొంతమంది నేను లోకల్ అని చెప్పుకుంటూ

ఖమ్మం జిల్లాని అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిపారన్నారు. మరి కొంతమంది తమ సోదరుడు కు టికెట్ రాలేదని వియ్యంకుడుకి టికెట్ తెప్పించుకొని నాన్​ లోకల్ క్యాండిడేట్ ని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి ఖమ్మం అభివృద్ధికి అడ్డుగా నిలుస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని దోచుకున్నారని, ఇక్కడ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క జాలిమూడి ప్రాజెక్టు నిర్మించి దోచుకున్నారని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ లు రెండూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు పనిచేయలేదని, తమ కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుదలకే పని చేశారన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గల్ల సత్యనారాయణ, యువమోర్చా జిల్లా అధ్యక్షురాలు విజయ రెడ్డి, మాజీ మంత్రి విజయ రామారావు, నాయకులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, పెరుమాలపల్లి విజయరావు , సిల్వర్ సాంబశివరావు, పాపట్ల రమేష్, గుండా చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story

Most Viewed