భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలి

by Disha Web Desk 15 |
భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలి
X

దిశ, భద్రాచలం : శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం మరియు మహా పట్టాభిషేకం మహోత్సవాలు తిలకించడానికి భద్రాద్రి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు కృషి చేయాలని భద్రాచలం ఆర్డీఓ దామోదర్ రావు ఆదేశించారు. గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణం మరియు పట్టాభిషేకం మహోత్సవాలకు చేపట్టాల్సిన కార్యాచరణపై జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం సంబంధిత అధికారులతో డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణం జరుగు మిథిలా స్టేడియంలో కళ్యాణ మండపాన్ని 26 సెక్టార్లుగా విభజించడం జరిగిందని, ప్రతి సెక్టార్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేడుకలు వీక్షించేందుకు భక్తుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు.

గత సమావేశంలో జిల్లా కలెక్టర్ సూచించిన విధంగా ప్రత్యేక అధికారులు భక్తులు ఒక సెక్టార్ నుంచి వేరే సెక్టార్ కి వెళ్లకుండా పటిష్ట భారీకేట్లు ఏర్పాటు చేయాలని, అలాగే భక్తులకు ఆన్లైన్ ద్వారా లాడ్జిలు బుక్ చేసుకునే విధంగా సౌకర్యం కల్పించినట్టు తెలిపారు. అదేవిధంగా ఆన్లైన్ ద్వారా టికెట్లు విక్రయాలు చేపట్టాలని అన్నారు. సెక్టర్ లో విధుల నిర్వహణకు ప్రత్యేక పారిశుధ్య సిబ్బందిని నియమించనున్నట్టు తెలిపారు. అలాగే ఇప్పటివరకు విధులు నిర్వహించే సిబ్బందికి ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేస్తామని, పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు పర్యవేక్షణకు 25 జోన్లుగా విభజించినట్టు చెప్పారు. దానికి సంబంధించిన అధికారులను కూడా కేటాయించినట్టు తెలిపారు. మంచినీటి సరఫరా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, దాదాపు 200 మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని అన్నారు.

మంచినీటి సరఫరా పర్యవేక్షణకు 30 మంది, మంచినీటి పరీక్షల నిర్వహణకు 12 మంది సిబ్బందిని నియమించినట్టు తెలిపారు. అలాగే వాహనాల పార్కింగ్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ముఖ్యంగా అగ్ని ప్రమాదాల నివారణకు అగ్నిమాపక వాహనాలను, ఎస్టీమ్ గిరీష్ పరికరాలను సిద్ధంగా ఉంచాలని అన్నారు. అలాగే రిస్కీ టీములను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. భక్తులు గోదారిలోకి వెళ్లకుండా పటిష్ట భారీకేడ్లు ఏర్పాటుతోపాటు నాటు పడవలను, గజయితగాళ్లు సిద్ధంగా ఉండేలా సంబంధిత అధికారులు చూసుకోవాలని, అలాగే ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని అన్నారు. స్వామివారు కళ్యాణ

మండపానికి విచ్చేసేటప్పుడు భక్తుల రద్దీ నియంత్రణకు మూడంచెల భద్రత ఏర్పాటు చేయాలని అన్నారు. వంతెన పై వాహనాలు ఆగిపోతే తక్షణమే తరలించేందుకు వీలుగా క్రేన్లను సిద్ధంగా ఉంచాలని, 24 గంటలు పని చేయు విధంగా అత్యవసర వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలు అందించేందుకు 20 బెడ్లను సిద్ధంగా ఉండేటట్లు చూడాలని కోరారు. తలంబ్రాల పంపిణీ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ రమాదేవి, వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed