Deputy CM : దేశం మన వైపు చూసేలా ఇందిరా మహిళా డెయిరీలు విజయం సాధించాలి

by Sridhar Babu |
Deputy CM : దేశం మన వైపు చూసేలా ఇందిరా మహిళా డెయిరీలు విజయం సాధించాలి
X

దిశ, మధిర : దేశం మన వైపు చూసేలా ఇందిరా మహిళా డెయిరీ విజయం సాధించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక ప్రణాళిక, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka)అన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం పరిధిలోని బోనకల్లు, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపనలు చేశారు.

బోనకల్ మండలంలో రావినూతల గ్రామం నుండి ప్రొద్దుటూరు గ్రామం వరకు ఆర్ అండ్ బి విస్తరణ పనుల కొరకు రూ 26 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, మధిర మండల పరిధిలోని సిరిపురం గ్రామంలో సిరిపురం నుండి నెమలి వరకు( ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి), ఆంధ్ర - తెలంగాణ సరిహద్దు గ్రామమైన రామచంద్రాపురం గ్రామం వరకు రూ 26 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. సిరిపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి శిథిలావస్థలో ఉన్న కళాశాల గదులను, లైబ్రరీ, ప్రిన్సిపాల్ రూంలను పరిశీలించి ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశంతో ఫోన్ లో మాట్లాడి వెంటనే కళాశాలను సందర్శించి, పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు.

రైతులకు ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోలు చేయాలి

పత్తి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు పూర్తి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సంబంధిత అధికారులను ఆదేశించారు. మధిర మండల పరిధిలోని మాటూరు, ఖాజీపురం గ్రామాల సమీపంలో గల మంజిత్ కాటన్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని(CCI Cotton Buying Centre)ఆయన ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 9 కాటన్ జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు రైతుల నుండి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. తేమ శాతం ఎనిమిది నుంచి 12 మధ్యలో ఉండే విధంగా చూసుకోవాలని కోరారు. రైతులకు నష్టం జరిగే విధంగా యాజమాన్యం ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

ఇందిరా మహిళా డెయిరీ లోగో ఆవిష్కరణ

మహిళా సంఘాల సభ్యులతో రెడ్డి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ మధిర అసెంబ్లీ సెగ్మెంట్ కు సంబంధించి మహిళలతో పాల వ్యాపారం చేయించేందుకు ఇందిరా మహిళా డెయిరీ సంస్థను ఏర్పాటు చేయాలనే ఆకాంక్ష నేడు నెరవేరుతుందని అన్నారు. గతంలో ఆహార ధాన్యాలు దొరకకపోవడంతో దేశంలో కోట్ల మంది ప్రజలు ఆకలితో మరణించారని, దీనిని గమనించిన దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయానికి ప్రాధాన్యత కల్పించారని, ఆయన వేసిన పునాదులతో అనేక నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించుకున్నామని తెలిపారు. దీని వల్ల నేడు మనకు సరిపోయే ఆహార ధాన్యలే కాకుండా ప్రపంచానికి ఎగుమతి చేసే స్థాయికి మన దేశం ఎదిగిందన్నారు.

నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా మధిర నియోజక వర్గం పరిసర ప్రాంతాల్లో ఆయకట్టు నీరు రావడంతో పంటలు పండిస్తున్నారని చెప్పారు. వ్యవసాయానికి తోడు పాడి రైతుల ఆదాయం జత చేస్తే కుటుంబాలు మరింత నిలదొక్కుకుంటాయనే ఆలోచనతో ఇందిరా మహిళా డెయిరీలకు 2013 లో రూపకల్పన చేసినట్టు తెలిపారు. కట్టలేరు, మున్నేరుపై ఆనకట్ట నిర్మించుకొని సాధ్యమైనంతవరకు వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకున్నామన్నారు. ఇందిరా మహిళా డెయిరీ ఏర్పాటు కోసం 9.5 ఎకరాల స్థలం సేకరించి భూమి పూజ కూడా చేశామని తెలిపారు. గతంలో మహిళలు చెల్లించిన 500 రూపాయలను డిపాజిట్ చేశామని, నేడు దాదాపు 40 లక్షల రూపాయలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మహిళా డెయిరీలో సభ్యులుగా ఉన్నవారికి తలా రెండు పాడి పశువులు అందిస్తామని, దీని ద్వారా రోజూ దాదాపు 2 లక్షల 40 వేల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతుందని, నెలకు 25 కోట్లకు పైగా మహిళలు సంపాదించే అవకాశం ఉందని అన్నారు. పాలు మాత్రమే కాకుండా మజ్జిగ, నెయ్యి, వెన్న, స్వీట్స్ అమ్మకాలు కూడా కలిపితే సంవత్సరానికి ఈ టర్నోవర్ రూ.500 కోట్లు దాటుతుందని అన్నారు.

దేశం మొత్తం ఇందిర మహిళా డెయిరీ వైపు చూసేలా అభివృద్ధి సాధించాలని కోరారు. దీపావళి సందర్భంగా ఇందిరా మహిళా డెయిరీ లోగో ఆవిష్కరణ చేశామని అన్నారు. 5 మండలాల్లోని నిరుద్యోగ యువతకు పశువుల దాణా తయారీ, ప్యాకింగ్ సరఫరా యూనిట్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. పశువులకు అవసరమైన దాణ, పచ్చి గడ్డి ఇంటి దగ్గరికి వచ్చే విధంగా ఆలోచన చేస్తున్నామని అన్నారు. పశువుల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి అంబులెన్స్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ తాను కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉప ముఖ్యమంత్రి ఇందిరా మహిళా డెయిరీ గురించే మొదట మాట్లాడారని, వారి నిరంతర పర్యవేక్షణ ఫలితంగా 3 నెలల కాలంలో గ్రౌండింగ్​ చేసినట్టు చెప్పారు.

మధిర అసెంబ్లీ నియోజకవర్గంలోని 5 మండలాల్లోని అన్ని గ్రామాలలో పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అవసరమైన యంత్రాలు ప్రొక్యూర్ చేస్తున్నామని అన్నారు. ప్రతి మండల కేంద్రంలో బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని, అవి పూర్తయిన తర్వాత ప్రతి మండలం నుంచి దాదాపు 5 వేల లీటర్ల పాల సేకరణ జరుగుతుందని అన్నారు. 48 గంటల వ్యవధిలో పాడి రైతుల ఖాతాలలో నగదు బదిలీ జరిగేలా కార్యాచరణ తయారు చేస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో ఇందిరా మహిళా డెయిరీ బ్రాండ్ పేరుతో పాలు విక్రయించేందుకు అవసరమైన ప్లాంట్ నిర్మాణానికి స్థలం ఎంపిక ప్రక్రియ జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర్ రావు, డీఆర్డీఓ సన్యాసయ్య, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి డా. వేణు మనోహర్, ఇందిరా మహిళా డెయిరీ చైర్మన్ అన్నపూర్ణ, మహిళా సంఘాల సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story