కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేయాలి : మాణిక్యరావు ఠాక్రే

by Sridhar Babu |
కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేయాలి : మాణిక్యరావు ఠాక్రే
X

దిశ, వైరా : కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయటాన్ని నిరసిస్తూ దేశంలోని కాంగ్రెస్ ఎంపీలంతా మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామా చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యరావు ఠాక్రే పిలుపునిచ్చారు. వైరా లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి హాత్ సే హాత్ జోడోయాత్ర, కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా నాయకులు కట్ల రంగారావు అధ్యక్షతన జరిగిన సభలో మాణిక్యరావు ఠాక్రే ప్రసంగించారు. రాహుల్ గాంధీకి జరిగిన అన్యాయం దేశ ప్రజలకు తెలుసునని చెప్పారు. దేశ ప్రజలను పేదరికం నుంచి కాపాడేందుకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సుమారు నాలుగు వేల కిలోమీటర్ల దూరం రాహుల్ గాంధీ జూడో యాత్రను నిర్వహించారని వివరించారు.

రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారనే భయంతోనే బీజేపీ అరాచక ఆలోచనతో ఆయన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసిందని విమర్శించారు. అదానీ లక్ష కోట్ల రూపాయలను బ్యాంకుల నుంచి లూఠీ చేసి వేర్వేరు కంపెనీలో పెట్టుబడులు పెట్టారని, ఈ విషయం దేశ ప్రజలకు తెలుసునని స్పష్టం చేశారు. అదానీ దోపిడీ చేసిన లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్లాయో బీజేపీ, కేంద్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. బ్యాంకులకు లక్ష కోట్ల రూపాయలు ఎగనామం పెట్టిన అదానీకి బీజేపీకి అండగా నిలిచిందని ఆరోపించారు. రాహుల్ కి జరిగిన అన్యాయాన్ని దేశ ప్రజలు గుర్తించి ఆయనకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు.

రాహుల్ గాంధీని బెదిరించేందుకే ఆయన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసి జైలుకు పంపించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ధ్వజమెత్తారు. బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ భయపడే ప్రసక్తే లేదన్నారు. రాహుల్ గాంధీ పోరాట స్ఫూర్తి స్వాతంత్ర్య ఉద్యమంలో మహత్మా గాంధీ పోరాట స్ఫూర్తిని గుర్తు చేస్తుందని కొనియాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రాహుల్ గాంధీకి అండగా నిలిచారన్నారు. దేశంలోని బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమై రాహుల్ గాంధీకి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించాలని కోరారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా రాష్ట్రంలో పాదయాత్ర చేస్తూ రాహుల్ గాంధీకి జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మాణిక్యరావు ఠాక్రేను ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ఓ దుష్టుడు, దుర్మార్గుడు మంత్రిగా పనిచేస్తూ గుట్టలను ఆక్రమించి మట్టి అక్రమ రవాణా చేస్తున్నారని విమర్శించారు. ధరణి వెబ్సైట్ ద్వారా కూలీల భూములను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ నేత సీఎం కేసీఆర్ కు ప్రజలు వీఆర్ఎస్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, నాయకులు కట్ల రంగారావు, మానుకొండ రాధా కిషోర్, ఎడవల్లి కృష్ణ, లక్కినేని సుదర్శన్, పగడాల మంజుల, మానవతారాయ్ కట్ల సంతోష్, సూరంపల్లి రామారావు, వేణుగోపాల్, సుష్మా బేగం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed