'మరోసారి గెలిపించండి.. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకుందాం'

by Sumithra |
మరోసారి గెలిపించండి.. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకుందాం
X

దిశ, అశ్వారావుపేట/దమ్మపేట : పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేసిందని, త్వరలో తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సోమవారం దమ్మపేట మండల కేంద్రంలో అశ్వారావుపేట బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయడానికి ఏర్పాటు చేసిన ప్రజాఆశీర్వాద బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, రైతులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ అందించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విజయం సాధించిందని, తాగునీరు లేక తెలంగాణ రాష్ట్రంలో వున్న ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారని, గిరిజన గ్రామాల్లో, లంబాడి తండాల్లో, అడవిలో నివసిస్తున్న ఆదివాసీలు ఎంతో ఇబ్బందులు పడ్డారని రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ భగీరథ అనే పధకం తీసుకువచ్చి ప్రజలందరికీ స్వచ్ఛమైన నీరు అందించామని తెలిపారు.

పంటలు పండించుకోవడానికి సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు, ఆ గోస తీర్చాలని గోదావరి పై సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్ నిర్మించి, అంతేకాకుండా రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించి రైతులకు సాగునీరు అందించగలిగామని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న పంటలకు సాగునీరు అందించడానికి గోదావరి పై ఒక్క ప్రాజెక్టు నిర్మించి నీళ్లు ఇవ్వవచ్చని అనాడు కాంగ్రెస్ పార్టీ ఆలోచించలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీతారామ ప్రాజెక్టు ప్రారంభించుకున్నామని, ఇప్పటికే పనులు 70 శాతం పూర్తయ్యాయని, ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాలు సమృద్ధిగా సాగునీరు వస్తుందని తెలిపారు. అంతేకాకుండా 70 ఏళ్లగా రాష్ట్రంలో ఉన్న పోడు భూముల సమస్య తీర్చి పోడు సాగుదారులకు పోడు పట్టాలు ఇచ్చి వారికి ఆ భూముల పై హక్కు కల్పించామని, హక్కులు కల్పించడమే కాకుండా వాటికి రైతుబంధు రైతు బీమా కూడా అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు.

తాటి, మెచ్చా కలయికతో నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు తిరుగులేదు.

మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, మెచ్చా నాగేశ్వరరావు కలయికతో ఇక నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి తిరుగు లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు వివాద రహితుడనీ, అలాంటి చల్లని చక్కటి మనిషిని మరోసారి గెలిపించాలని కోరారు. మరోసారి మెచ్చా నాగేశ్వరరావును గెలిపించడం ద్వారా తాటి వెంకటేశ్వర్లు, మెచ్చా నాగేశ్వరరావు సమక్షంలో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందబోతుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

రాహుల్, రేవంత్, ఉత్తమ్ కుమార్ రెడ్డిల పై కేసీఆర్ ఫైర్..

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణి పోర్టల్ ను తీసి బంగాళాఖాతంలో వేస్తామని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చేది లేదు సచ్చేది లేదు కానీ ధరణి పోర్టల్ ను తొలగిస్తే రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు ప్రజలు తీసుకోవడంలో ఇబ్బందులకు గురవుతారని, దళారి వ్యవస్థ లేకుండా ధరణి పోర్టల్ ఉండటం ద్వారా హైదరాబాద్ నుండి డబ్బులు రైతులకు పంపిస్తే నేరుగా తమ అకౌంట్లో జమవుతున్నాయని తెలిపారు. ధరణి తీసేస్తే రైతుల ఎకౌంట్లో డబ్బులు ఎలా జమ చేస్తారో అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడుగుతున్న వారు సమాధానం చెప్పడం లేదని అన్నారు. ధరణి తీసేయడం ద్వారా మళ్లీ దళారి వ్యవస్థ పుట్టుకు వస్తుందని రైతుబంధు డబ్బులకు కూడా కమిషన్లు అడుగుతారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి కమిషన్లు తీసుకోవడం అలవాటు కాబట్టి ధరణి పోర్టల్ రద్దు చేస్తామని అంటున్నారని రేవంత్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కేసీఆర్ ప్రజల దగ్గర నుండి టాక్సీలు వసూలు చేసి రైతులకు రైతుబంధు ఇచ్చి ప్రభుత్వ ఖజానాను దుబారా చేస్తున్నారనీ అంటున్నారు. రైతుబంధు డబ్బులు దుబ్బారానో కాదో మీరే తెలుసుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మూడు గంటల కరెంటు ఇస్తామని రేవంత్ రెడ్డి వాక్యానించడం వారి అహంకారానికే వదిలేస్తున్నానని కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నియోజకవర్గాన్ని 800 కోట్లతో అభివృద్ధి చేశా, మరోసారి గెలిపించండి ఎమ్మెల్యే మెచ్చా..

నియోజకవర్గాన్ని తాను బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత రెండేళ్లలో 800 కోట్లతో అభివృద్ధి చేశానని, రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడిగిందే తనువుగా తండ్రిలా నియోజకవర్గానికి అన్నీ ఇచ్చారని, నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి, డయాలసిస్ సెంటర్, 46 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారని, సుందరీకరణలో భాగంగా నాలుగు మండలాలకు సెంట్రల్ లైటింగ్ ఇచ్చారని అన్నారు. అడిగిన వెంటనే కేవలం ఈ నియోజకవర్గానికే కాకుండా రాష్ట్రం మొత్తం పోడు భూములకు పోడుపట్టి ఇచ్చారని కాబట్టి చేసిన అభివృద్ధిని చూసి, తనకు ఓటు వేసి మరోసారి గెలిపించాలని మెచ్చా నాగేశ్వరరావు కోరారు.

ప్రజాఆశీర్వాద సభకు భారీగా హాజరైన జనం.

దమ్మపేటలో నిర్వహించిన కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు ప్రజలు భారీగా హాజరయ్యారు. సభా ప్రాంగణం వద్ద ఏర్పాటుచేసిన భారీ టెంట్లు, కుర్చీలు నిండి పోయి ప్రజలు రోడ్లపై నిల్చొని, కేసీఆర్ ప్రసంగాన్ని విన్నారు. తెలంగాణ ప్రముఖ గాయకురాలు మధుప్రియ సభకు వచ్చిన జనాలతో పాటలు పాడిస్తూ డాన్సులు వేయిస్తూ అందర్నీ ఉత్సాహపరిచింది.

బీఆర్ఎస్ పార్టీలో చేరిన నియోజకవర్గ కీలక నేతలు.

ప్రజా ఆశీర్వాద సభ బహిరంగ సభ వేదిక పై నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారిలో అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ములకలపల్లి జడ్పీటీసీ సున్నం నాగమణి, మాజీ ఎమ్మెల్యే వగ్గేల మిత్ర సేన మనవరాలు వగ్గేల పూజిత, వైఎస్ఆర్టీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు సోయం వీరభద్రం, తదితరులు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అంతకుముందు అదే వేదికపై నామా నాగేశ్వరావు సమక్షంలో బీజేపీ నియోజకవర్గ నాయకుడు భూక్య ప్రసాద్, బానోత్ పద్మావతి, చండ్రుగొండ జడ్పిటిసి కొనగండ్ల వెంకటరెడ్డి, తదితర ద్వితీయ శ్రేణి నాయకులు బిఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మధుసూదనా చారి, బొంతు రామ్మోహన్, నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఉప్పల వెంకటరమణ, జిల్లా రైతుబంధు అధ్యక్షుడు రావు జోగేశ్వరరావు, వివిధ మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

భానుడి భగభగ

ఆశీర్వాద సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వీవీఐపీ, ప్రెస్ గ్యాలరీలకు టెంటు ఏర్పాటు చేయకపోవడంతో మండుటెండలో ఉకిరి బిక్కిరి అయ్యారు. సభాప్రాంగణంలో నిర్వాహకుల ఏర్పాట్ల అంచనాలకు మించి ప్రజలు వచ్చారు. దీంతో సభా ప్రాంగణంలోకి వెళ్లడానికి సైతం కాళీ లేకుండా పోయింది. అలాంటి వారందరూ నిప్పులు కక్కుతున్న ఎండలోనే నిలబడి సీఎం కేసీఆర్ రాక కోసం గంటల తరబడి పడిగాపులు కాశారు. ప్రజల అసహనాన్ని గుర్తించిన బీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ వచ్చేస్తున్నారంటూ.. ఎవరు కూడా వెళ్ళొద్దంటూ పదేపదే విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed