కేంద్రం బడుగులను మరిచింది.. జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్

by Disha News Desk |
కేంద్రం బడుగులను మరిచింది.. జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్
X

దిశ, సత్తుపల్లి: ఏడు దశాబ్దాలుగా బీసీలకు కేంద్రం అన్యాయం చేస్తోందని, ప్రతే ఏటా ప్రవేశపెట్టే బడ్జెట్‌లో బీసీలకు అన్యాయం జరుగుతోందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణ వరపు శ్రీనివాస్ అన్నారు. స్థానిక సత్తుపల్లి బీసీ సంఘం నియోజకవర్గ కార్యాలయంలో సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు దుస్స వెంకటేశ్వర్లు అధ్యక్షతన శుక్రవారం ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో కేంద్ర బడ్జెట్‌లో బీసీలకు లక్ష కోట్లు కేటాయించాలని ప్రధాని మోడీతో పాటు అనేక మంది కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రయోజనం లేదని వాపోయారు.

కేంద్రంలో, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా బీసీలకు మాత్రం ప్రయోజనం ఏమీ లేదని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల రాజ్యాంగంపై చేసినటువంటి వ్యాఖ్యలు బాధాకరమని, దీనిని జాతీయ బీసీ సంక్షేమ సంఘంగా తీవ్రంగా ఖండిస్తోందని శ్రీనివాస్ తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ద్వారానే నేటి చట్టసభల్లో ఎంతోమంది దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, అటువంటి రాజ్యంగాన్ని స్వయాన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు ఈ రాష్ట్రంలోని దళిత ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ మాట్లాడకపోవడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేలి శ్రీనివాస్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తిన్నవల్లి రంగారావు, మండల నాయకులు నాయుడు రాఘవరావు, రాయల కోటేశ్వరరావు మరియు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story