అనుమతులు లేకున్నా విద్య మాటున వ్యాపారం..

by Aamani |
అనుమతులు లేకున్నా విద్య మాటున వ్యాపారం..
X

దిశ ప్రతినిధి,కొత్తగూడెం: ప్రస్తుత పోటీ ప్రపంచంలో డబ్బు సంపాదన దండిగా ఉంటే చాలు రాజ్యాలు ఏలవచ్చు అనుకుంటున్నారు కొంతమంది బడాబాబులు. కాలంతో పాటు పరిగెడుతూ షార్ట్ కట్ లో డబ్బు సంపాదన కోసం అనేక మార్గాలను ఎంచుకుంటున్నారు. అనతి కాలంలో కోటీశ్వరులు అవ్వాలని భావితరాలకు బంగారు బాటను వేయాల్సిన విద్యను వ్యాపారంగా చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు.

అనుమతులు లేకున్నా విద్య మాటున వ్యాపారం... ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలలను కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ కొత్త పెళ్లి కూతురులా ముస్తాబు చేస్తున్నప్పటికీ పేద మధ్యతరగతి ప్రజలు తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ప్రైవేటు స్కూళ్లలో పిల్లలను చేర్చుతున్నారు. ఇదే అదునుగా తీసుకున్న ఒక వ్యాపారి చుంచుపల్లి మండలం నందా తండా గ్రామపంచాయతీలో అనుమతులు లేకుండా నిర్మించిన భారీ భవంతిని అద్దెకు తీసుకుని పాఠశాలకు సైతం అనుమతి లేకుండానే చైతన్య స్కూల్ పేరుతో తరగతులు నిర్వహిస్తున్నారు. పరిసర ప్రాంతాల గిరిజన తండాలను టార్గెట్ గా చేసుకుంటూ అరకొర అనుభవం ఉన్న ఉపాధ్యాయులతో విద్యాబోధన చేస్తూ కోట్లు గడిస్తున్నారు. పాఠశాలకు పూర్తి అనుమతులు పొందకుండానే పాఠశాలను నిర్వహిస్తున్నారు.

బడి కొత్తదైన వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్న వైనం..

చుంచుపల్లి మండలం నంద తండాలో నిర్మాణం పూర్తయిన భవంతిలో చైతన్య స్కూల్ పేరుతో జూన్ మాసంలో నూతనంగా ఏర్పాటు చేశారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన చేస్తామంటూ అరచేతిలో నక్షత్రాలు చూపించి అడ్మిషన్లు భారీగానే చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందని భావించిన పిల్లల తల్లిదండ్రులకు ఫీజుల రూపంలో చుక్కలు చూపెడుతున్నారు. నిన్న గాక మొన్న పురుడు పోసుకున్న పాఠశాలలో అడ్మిషన్ ఫీజు, పుస్తకాలు, యూనిఫామ్, ప్రాజెక్టులు అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు చుక్కలు చూపుతున్నారు. పాఠశాలలో ఉంచవలసిన ఫీజుల పట్టిక ఉంచకుండా తల్లిదండ్రులను కన్ఫ్యూజ్ చేస్తూ వేల రూపాయలు దండుకుంటున్నారు.

పాఠశాలకు బోర్డు లేదు, క్రీడా మైదానం అసలు కనపడదు... ఎలాగో అనుమతి రాలేదు బోర్డు పెట్టడం ఎందుకు అనుకున్నారో ఏమో అంతా హడావుడి చేసి అన్ని అడ్మిషన్లు పొందిన పాఠశాలకు కనీసం బోర్డు లేకపోవడం ఆశ్చర్యాన్ని తొలగించే అంశం. భారీ భవంతిలో అట్టహాసంగా ప్రారంభించిన పాఠశాలకు బోర్డు లేకపోవడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు కన్ఫ్యూజన్ కి గురవుతున్నారు. ఒక పాఠశాల నిర్వహించాలంటే చదువుతోపాటు పిల్లల ఆటపాటలకు స్కూల్ ప్రాంగణంలో క్రీడా మైదానం ఉండటం తప్పనిసరి కానీ ఇందులో చదివే పిల్లలకు ఆటపాటలు దూరమైనట్లేనని అర్థమవుతుంది. స్కూల్ ప్రాంగణం మొత్తం కేవలం భవంతి మాత్రమే ఉండటంతో విద్యార్థుల మానసిక ఉల్లాసం కోసం ఆడే ఆటలుకు పూర్తిగా దూరమవుతున్నారు. నిబంధనల ప్రకారం పాఠశాలలను నిర్వహించాల్సిన యాజమాన్యాలు నిబంధనలకు నీళ్లు వదిలి ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారని తేటతెల్లమవుతుంది.

అధికారుల అనుమతితోనే పాఠశాలలను నిర్వహిస్తున్నాం అంటూబుకాఇస్తున్న చైతన్య స్కూల్ యాజమాన్యం... మాకు పూర్తి అనుమతులు రాకపోయినా అధికారులు పాఠశాలను నిర్వహించుకోవచ్చు అని అనుమతిని ఇచ్చారు. జిల్లా విద్యాధికారికి ఎంఈఓ కి చెప్పి పాఠశాల నిర్వహిస్తున్నాం. పాఠశాల నిర్వహించేందుకు అనుమతులు చేతికి రావాల్సిన అవసరం లేదు, అప్లై చేస్తే సరిపోతుంది అంటూ పాఠశాల ప్రిన్సిపాల్ ఇచ్చిన వివరణ అనేక అనుమానాలకు తావిస్తోంది. అధికారులకు ముడుపులు ముట్టజెప్పకుండానే ఇంత బహిరంగంగా అనుమతులు లేకుండా పాఠశాల నిర్వహించడం సాధ్యమవుతుందా అంటూ విద్యార్థులకు తల్లిదండ్రులు గుసగుసలాడుకోవడం గమనార్ధం.

Advertisement

Next Story

Most Viewed