అక్రమ నిర్మాణాల పై చర్యలేవి...?

by Sumithra |
అక్రమ నిర్మాణాల పై చర్యలేవి...?
X

దిశ, వైరా : వైరాలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాల పై కనీస చర్యలు తీసుకోకుండా అధికారులు వెనకడుగు వేస్తున్నారు. మున్సిపాలిటీ అనుమతులు లేకుండా వైరాలో ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. వైరా నడిబొడ్డుతో పాటు జాతీయ ప్రధాన రహదారికి ఇరువైపులా అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా చేపట్టిన ఈ నిర్మాణాల వల్ల మున్సిపాలిటీ ఆదాయానికి తీవ్ర నష్టం వాటిల్లింది. అయినప్పటికీ మున్సిపాలిటీ అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదు. అంతే కాకుండా అక్రమంగా చేపట్టిన నిర్మాణాల్లో ప్రారంభించిన వ్యాపారాలకు మున్సిపాలిటీ అధికారులు ఎంచక్కా ట్రేడింగ్ లైసెన్సులు మంజూరు చేయడం విశేషం. మరోవైపు టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణదారులకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు.

ఈ నిర్మాణాల పై అధికారులు మౌనమేల..

వైరాలోని జాతీయ ప్రధాన రహదారికి ఇరువైపులా పలు ప్రాంతాల్లో వ్యాపారాల కోసం పలు నిర్మాణాలు చేపట్టారు. వైరాలోని పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న వజ్రా టీవీఎస్ షోరూం ఏర్పాటు చేసిన భారీ రేకుల షెడ్ నిర్మాణానికి అధికారుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. రేకుల షెడ్డును నిర్మించి దర్జాగా వ్యాపారం నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. అదేవిధంగా వైరాలోని మధిర క్రాస్ రోడ్ సమీపంలో టీ టైమ్స్ ఏర్పాటు చేసిన రేకుల షెడ్ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవు. అయినప్పటికీ మున్సిపాలిటీ అధికారులు ఈ టీ టైమ్స్ వ్యాపారానికి ట్రేడ్ లైసెన్స్ మంజూరు చేయడం విశేషం. మరోవైపు వైరాలోని తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాన్ని చేపట్టారు. రెసిడెన్షియల్ కోసం అనుమతులు తీసుకున్న భవన యజమాని ఏకంగా సుమారు 120 గజాల్లో మూడంతస్తుల్లో వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేయడం విశేషం.

తీసుకున్న అనుమతులకు విరుద్ధంగా ఈ నిర్మాణాలను చేపట్టినా పట్టించుకునే వారు కరువయ్యారు. అంతేకాకుండా కనీసం పార్కింగ్ లేకుండా ఇష్టానుసారంగా వ్యాపార సముదాయాలు నిర్మించిన అధికారుల్లో కనీస చలనం కొరవడింది. ఇప్పటికే ఈ భవనానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. మరోవైపు తల్లాడ రోడ్ లో జాతీయ రహదారి పక్కన ఎలాంటి అనుమతులు లేకుండా భారీ రేకుల షెడ్డు నిర్మించి ఇప్పటికే వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇలా వైరాలో పలు ప్రాంతాల్లో వ్యాపారాల కోసం అక్రమ నిర్మాణాలు చేపట్టారు. అయినప్పటికీ మున్సిపాలిటీ అధికారుల్లో కనీస పర్యవేక్షణ కరువైంది. ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాల్లో నిర్వహిస్తున్న వ్యాపారులకు మున్సిపాలిటీ అధికారులు ఎలా ట్రేడ్ లైసెన్సులు మంజూరు చేస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు టౌన్ ప్లానింగ్ అధికారులు కేవలం అక్రమ నిర్మాణదారులకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారుల వెంటనే స్పందించి వైరాలో అక్రమ నిర్మాణాల పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed