బస్సుల కోసం రోడ్డుపైనే.. ఎండలో.. వానలో ప్రయాణికుల పడిగాపులు..

by Sumithra |
బస్సుల కోసం రోడ్డుపైనే.. ఎండలో.. వానలో ప్రయాణికుల పడిగాపులు..
X

దిశ, కూసుమంచి : కూసుమంచి మండల కేంద్రంతో పాటు నాయకన్ గూడెం, జీళ్ళ చెరువు ఆర్టీసీ ప్రయాణికులకు నిలువ నీడ కరువవుతోంది. మండల కేంద్రంలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు 41 గ్రామపంచాయతీల నుండి వచ్చే ప్రజలు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు ప్రయాణికులు ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ రోడ్లపైనే ప్రయాణికులు బస్సుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. బస్టాప్‌లలో షెల్టర్ లేదు. అదేవిధంగా జీళ్ళ చెరువులో ఉన్నచోట మినీ బస్టాండ్ గత 25 యేండ్లుగా ప్రయాణికులకు నీడనిచ్చిన బస్సు షెల్టర్ నిర్వహణ లేక అధ్వానంగా మారి పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరుకుంది. మండలంలోని జీళ్ల చెరువు గ్రామంలో చిన్న తిరుపతిగా పేరుపొందిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంకు వచ్చిపోయే భక్తులకు బస్ షెల్టర్ లేక అవస్థలు పడుతున్నారు.

జిళ్ల చెరువులో పూర్తిస్థాయిలో శిధిలమైన బస్ షెల్టర్ ను ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు. అదేవిధంగా మరికొన్న చోట్ల బస్టాప్‌లలో బస్సులు ఆపక.. రోడ్ల పై పాఠశాల, కళాశాల విద్యార్థులు, ప్రయాణికులు పరుగులు తీయాల్సి వస్తోంది. మొత్తంగా కూసుమంచిలో ఆర్టీసీ ప్రయాణం ప్రయాణికులకు చుక్కలు చూపుతోంది. అసలే వర్షాకాలం తలదాచుకునే షెల్టర్ లేక ఎలా ప్రయాణించాలని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. కూసుమంచి, జిళ్ళ చెరువు, నాయకన్ గూడెం గ్రామాల్లో బస్‌ షెల్టర్ లేక ప్రయాణికులు ఎండకు ఎండుతూ, వానకి తడుస్తూ రోడ్లకు ఇరువైపుల దుకాణాల ముందు నిల్చొని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇదిలా ఉండగా పాలేరుకు బస్సు షెల్టర్ ఉండగా బస్టాండ్ లో పల్లె వెలుగు బస్సులు మినహాయించి ఎక్సప్రెస్, డీలక్స్ బస్సులు ఆగకపోవడం శోచనీయంగా మారింది. పాలేరులో సైతం బస్టాండు షెల్టర్ ఉన్నప్పటికీ వృద్ధులు మహిళలు, పిల్లలు, విద్యార్థులు పాలేరు రోడ్డుపైనే బస్సు ఎక్కడం దిగడం ఒక శాపంగా మారింది. పాలేరులో బస్టాండ్ ఆవరణం మొత్తం గుంతల మయంగా ఉండటంతో వర్షం వచ్చిన ప్రతిసారి ఇబ్బందిగా ఉందని, బస్ షెల్టర్ ఆవరణంలో సీసీ రోడ్లు నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇప్పటికైనా టీజీ ఆర్టీసీ అధికారులు, పాలేరు ఎమ్మెల్యే, రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చొరవ తీసుకొని కూసుమంచి మండల కేంద్రంలో నూతన బస్సు షెల్టర్ మంజూరు చేపించి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed