బాలసాని.. ఏందిది?

by Sumithra |   ( Updated:2023-09-06 17:28:13.0  )
బాలసాని.. ఏందిది?
X

దిశ, ఖమ్మం బ్యూరో/ భద్రాచలం : ఎన్నికల వేళ భద్రాద్రి రాజకీయం రంగులు పులుముకుంటున్నది. అధికార బీఆర్ఎస్‌కు చెందిన మాజీ ప్రజాప్రతినిధి వర్గపోరును ప్రోత్సహిస్తూ తననే ఇంచార్జిగా నియమించాలంటూ అనుచరులతో రహస్య మంతనాలు సాగిస్తున్నారు. అనుచరులను గ్రూపులుగా విడగొట్టి కొత్త ఇంచార్జికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. అయితే గతంలో ఆ నాయకుడి తీరుపై విమర్శలు రావడంతో పక్కనబెట్టి అధిష్టానం కొత్తవారికి స్థానం కల్పించడంతో అసమ్మతిని క్రియేట్ చేయడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

భద్రాచలం నియోజకవర్గం అధికార పార్టీలో వర్గ పోరు రోజు రోజుకూ ముదురుతున్నది. ముందు తెల్లం వెంకట్రావుకు టిక్కెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకించిన అసమ్మతి వర్గం, ఇప్పుడు స్వరం పెంచి ఏకంగా ఇంచార్జినే మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అసమ్మతి రాగం వెనకాల మాజీ ప్రజాప్రతినిధి హస్తం ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. గత ఎన్నికలలో భద్రాచలం అసెంబ్లీ ఎన్నికలు ఇంచార్జిగా బాలసాని లక్ష్మీనారాయణను అధిష్టానం నియమించింది. పార్టీ ఫండ్ ఖర్చు పెట్టకుండా సొంత ఖాతాలో జమ వేసుకున్నారని, సదరు ఇంచార్జి సొంత మండలంతో పాటు చర్ల, వాజేడు మండలాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్యకు అత్యధిక ఓట్లు పోలయ్యాయనే ఆరోపణలు వచ్చాయి. వచ్చే ఎన్నికల ఇంచార్జిగా ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధును భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికలు ఇంచార్జిగా అధిష్టానం నియమించింది.

దీంతో నియోజకవర్గంలోని ఐదు మండలాల అధ్యక్షులను రెచ్చగొట్టి అభ్యర్థి తో పాటు ఇంచార్జిని కూడా మార్చాలనే డిమాండ్‌ను తెర మీదకు తీసుకురావడంలో ఈ మాజీ ప్రజా ప్రతినిధి చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. అసమ్మతి నేతలు ప్రభుత్వ విప్ రేగా కార్యక్రమానికి కూడా డుమ్మా కొట్టి, అదేరోజు స్థానికంగా వేరే చోట సమావేశం నిర్వహించడాన్ని అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. కలిసి పని చేయని పక్షంలో పార్టీ నుంచి తొలిగించాడానికి రంగం సిద్ధం చేసినట్లుగా సమాచారం. భద్రాచలం నియోజకవర్గం పరిస్థితి పై పూర్తి స్థాయిలో అవగాహనకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ బలమైన నిర్ణయం తీసుకొనున్నట్లు తెలిసింది.

బాలసాని వర్గీయుడుగా ఉన్న బుచ్చయ్య బీఆర్ఎస్ టిక్కెట్ ఆశించి విఫలం కావడంతో టీడీపీ నుంచి పోటీ చేస్తారనే వదంతులు వినవస్తున్నాయు. 2018ఎన్నికలలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య 47,746 ఓట్లతో విజయం సాధించగా, బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు 35,961ఓట్లు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచారు. కేవలం 11,785ఓట్ల తేడాతో వెంకట్రావు ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటి ఎన్నికల ఇంచార్జి సొంత మండలంతో పాటు పక్క మండలాలలో కూడా బీఆర్ఎస్‌కు అత్యధిక ఓట్లు వచ్చిఉంటే గెలిచే అవకాశం లేకపోలేదు. కానీ ఎన్నికల నిధులు ఖర్చు చేయకపోవడం, సొంత మండలంలో కూడా ఇంచార్జికి పట్టు లేకపోవడంతోనే బీఆర్ఎస్ ఓటమి పాలైందని కొందరు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

బీఆర్ఎస్‌పై అభిమానం కంటే తెల్లం వెంకట్రావుపై నమ్మకంతో 30 వేలకు పైగా ఓట్లు వచ్చాయనేది అధిష్టానానికి కూడా తెలుసు. బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రకటన రోజు నియోజకవర్గం లోని ఐదు మండలాలు అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులు మంత్రి పువ్వాడను కలిసి తెల్లంకు టిక్కెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. అయినా అధిష్టానం వెంకట్రావుకే పట్టం కట్టింది. మళ్లీ రెండు రోజుల క్రితం కేటీఆర్, కేసీఆర్‌లను కలవడానికి అసమ్మతి నేతలు రాజధాని వెళ్లారు. కాగా మంగళవారం తాతా మధు, ఎంపీ కవిత, బాలసాని కలిసి భద్రాచలం వస్తున్నట్లు పార్టీ నాయకులు ప్రకటించిన కొంతసేపటికే కార్యక్రమం రద్దు అయినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ తాతా మధునే ఇంచార్జిగా కొనసాగించాలని, తెల్లం వెంకట్రావు బరిలో ఉంటారని అధిష్టానం ఫిక్స్ అయినట్లుగా సమాచారం. అసమ్మతి నేతలు తీరు మార్చుకోకపోతే అధిష్టానం వేటు వేయడానికి కూడా వెనకాడనట్లు అదే పార్టీ కి చెందిన కొందరు నేతలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story