మరో ప్రభుత్వ భూమిపై కన్ను

by Mahesh |
మరో ప్రభుత్వ భూమిపై కన్ను
X

దిశ, ఖమ్మం రూరల్: పోలేపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 149 లో పద్మావతి గ్రానైట్ యాజమాన్యం అక్రమంగా గ్రానైట్ వ్యర్థాలను తోలుతున్న విషయం తెలిసిందే. దినపత్రిక వరుస కథనాలతో బెంబేలెత్తిపోయిన యాజమాన్యం ప్రస్తుతం వ్యర్థాలు పోస్తున్న సర్వే నెంబర్లు కాకుండా మరొక చోటకు వ్యర్థాలను గుట్టుగా కాకుండా తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అదే గ్రానైట్లో పనిచేసే వాచ్‌మన్ భూమి అంటూ చెప్పుకుంటూ, గత మూడు రోజులుగా గ్రానైట్ వ్యర్థాలను మరో ప్రభుత్వ సర్వే నెంబర్లకు తోలకాలు జరుపుతున్నారు.

సదరు వాచ్‌మన్‌కు ఎలాంటి ప్రభుత్వ పట్టా, వారసత్వ సంక్రమణ, ప్రభుత్వం జారీ చేసిన తెలంగాణ పాస్ పుస్తకం వంటివి ఏమీ లేవు. గ్రామీణ మండలంలో కొంతమంది గ్రానైట్ యాజమానులు ఇష్టారీతిలో వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పారబోసి అనేక ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. ఇంత జరుగుతున్నా మైనింగ్ అధికారులు నోరు మెదపడం లేదు. రెవెన్యూ శాఖ గాని, మైనింగ్ అధికారులు కానీ, మాట్లాడకపోవడం అనేక అనుమానాలు తావిస్తోంది. అసిస్టెంట్ మైనింగ్ అధికారి అంతా తానై కావాల్సిన సూచనలు ఇస్తూ గ్రానైట్ యాజమాన్యం చేసే అక్రమాలను సమర్థిస్తున్నట్లు తెలుస్తుంది.

పోలేపల్లి పంచాయతీ పరిధిలోని 149 సర్వేనెంబర్‌లో పోసిన వ్యర్థాన్ని ఎప్పుడు తొలగిస్తారని ప్రజలు ఎదురుచూస్తున్నారు. అక్రమంగా ప్రభుత్వ భూమిలో వ్యర్థాన్ని పోస్తున్నా చూడనట్టుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ అధికారుల తీరును చూస్తే కచ్చితంగా దీని వెనుక రాజకీయ నాయకుల అండ మెండుగానే ఉన్నాయని చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు రావాల్సిన మామూలు ముందుగానే చేరాయని తెలుస్తుంది. ఈ గ్రానైట్ క్వారీ పనులతో పెద్ద ఎత్తున దుమ్ము, ధూళితో కలిసిన గాలితో పంట పొలాలు పెద్ద ఎత్తున నష్టపోయామని రైతులు ఆరోపిస్తున్నారు. కరుణగిరి ప్రాంతం నుంచి పోలేపల్లి గ్రామంలోకీ పోయే దారిలో జేసీబీ వాహనాలు, ట్రాక్టర్లు పెట్టడంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గతంలో ఎలాంటి గుంతలు లేకుండా ఉన్న రోడ్లు హెవీలారీలతో మొత్తం దెబ్బతింటున్నాయని ప్రజలు బహిరంగంగానే ఆరోపణలు చేస్తూ, గ్రానైట్ పనులు ఆపాలని పలు అధికారులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. రోడ్లపై నీళ్లు చల్లాలనే నిబంధన ఉన్నా వాటిని పాటించడం లేదని తెలుస్తుంది. క్వారీ యాజమాని పనులు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి కనీస రక్షణ చర్యలు తీసుకోకుండానే పనులు చేస్తున్నారని తెలుస్తోంది. క్వారీ నుంచి వచ్చే పెద్దపెద్ద శబ్దాలతో అటుగా వెళ్ళే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంత జరుగుతున్నా మైనింగ్ అధికారులు కనపడిన పాపాన పోలేదు. గ్రానైట్ యాజమానితో మేమున్నాం మీకేం కాదు అనే అభయమిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తెలిసింది. ఇదే క్వారీ యజమాని పలు ప్రాంతాల్లో చేసిన క్వారీలకు కూడా గతంలో నిబంధనలు పాటించలేదని ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

Next Story